ENE రిపీట్.. వీళ్ళకు ఎంత ఇంపార్టెంట్ అంటే..
ఎనిమిదేళ్ల తర్వాత వస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా హీరో విశ్వక్ సేన్, దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో పాటు శివాత్మిక, వెంకటేశ్ కాకుమాను, మాగంటి శ్రీనాథ్‌లకు కూడా కీలకంగా మారింది. వరుస పరాజయాల తర్వాత విశ్వక్‌కు హిట్ అవసరం కాగా, దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కూడా మరో విజయంపై ఆశలు పెట్టుకున్నారు. నవంబర్ 19న సినిమా విడుదల కానుంది.
By: M Prashanth | 18 Nov 2026 10:00 PM ISTతెలుగు యూత్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. 2018లో వచ్చిన మొదటి భాగం అప్పట్లో కల్ట్ స్టేటస్ తెచ్చుకోవడంతో, ఎనిమిదేళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ పై మంచి బజ్ నెలకొంది. అయితే బయటకు ఇదొక ఫన్ రైడ్ లా కనిపిస్తున్నా, లోపల మాత్రం ఈ సినిమాలో పనిచేసిన అసలు టీమ్ అందరికీ ఈ సక్సెస్ చాలా కీలకంగా మారింది.
ముఖ్యంగా హీరో విశ్వక్ సేన్ కెరీర్ కు ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ చాలా అవసరం. గత కొంతకాలంగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'మెకానిక్ రాకీ', 'లైలా', 'ఫంకీ' లాంటి సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. ఇటీవల తానే డైరెక్ట్ చేసిన 'కల్ట్' కూడా అనుకున్న రేంజ్ కు చేరలేదు. వరుసగా కొత్త జానర్లు ట్రై చేస్తున్నా కమర్షియల్ బ్రేక్ మాత్రం దొరకడం లేదు. తనకు యూత్ లో మంచి గుర్తింపు తెచ్చిన వివేక్ పాత్రతో విశ్వక్ మళ్లీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు.
ఇటు దర్శకుడు తరుణ్ భాస్కర్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. 'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో యూత్ లో ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. నేచురల్ డైలాగ్స్, సిచువేషనల్ కామెడీతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత డైరెక్ట్ చేసిన 'కీడా కోలా' అందరి అంచనాలను అందుకోలేకపోయింది. నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ, దర్శకుడిగా తన మొదటి రెండు సినిమాల స్థాయి హిట్ కోసం తరుణ్ మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన గ్యాంగ్ కామెడీనే నమ్ముకున్నారు.
హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ కు కూడా ఈ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. 'దొరసాని'తో ఎంట్రీ ఇచ్చి, 'రంగమార్తాండ'లో నటనతో మంచి మార్కులు వేయించుకున్నా కమర్షియల్ హీరోయిన్ గా ఆమెకు పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికీ మంచి రోల్స్ కోసం ఆడిషన్స్ కు వెళ్తున్నట్లు ఆమె ఇటీవలే ఓపెన్ గా చెప్పారు. ఈ సీక్వెల్ యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే, శివాత్మికకు మరిన్ని కమర్షియల్ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
ఇక కౌశిక్ పాత్రతో అభినవ్ గోమటం ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుని బిజీ కమెడియన్ గా మారారు. అయితే ఉప్పు పాత్రలో కనిపించే వెంకటేశ్ కాకుమానుతో పాటు, ఈసారి కొత్తగా గ్యాంగ్ లో చేరిన మాగంటి శ్రీనాథ్ కు ఈ సినిమా కెరీర్ కు బూస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో సుశాంత్ చేసిన కార్తీక్ పాత్రలో ఇప్పుడు శ్రీనాథ్ కనిపించబోతున్నారు. పాత గ్యాంగ్ లో కొత్త వ్యక్తిగా ఆడియన్స్ ను మెప్పించడం ఛాలెంజ్ అనే చెప్పాలి.
ట్రైలర్ చూస్తుంటే ఈసారి పాత గ్యాంగ్ అంతా కలిసి మళ్లీ సినిమా తీయడానికి పడే పాట్లు ఎంటర్ టైనింగ్ గా సాగేలా కనిపిస్తున్నాయి. శివాత్మికతో పాటు అనీషా ఆంబ్రోస్ మరో ముఖ్య పాత్రలో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఎస్ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 19న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు ఈరోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్లు కూడా ప్లాన్ చేశారు. మరి ఎనిమిదేళ్ల తర్వాత వస్తున్న ఈ గ్యాంగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
