అప్పుడు ఫలక్ నుమా దాస్.. ఇప్పుడు కల్ట్.. అందుకే చేశా అంటున్న విశ్వక్!
మొత్తానికి అయితే గత తాలూకా చిత్రాలు సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్లే విశ్వక్సేన్ ఇప్పుడు మళ్లీ ఇలాంటి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.
By: Madhu Reddy | 19 Oct 2026 9:37 AM ISTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈయన.. 2017లో వెళ్ళిపోమాకే అనే సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాలోనే తన అద్భుతమైన నటన కనబరిచిన విశ్వక్ సేన్ .. ఇందులో చందు పాత్రతో యువతను బాగా ఆకట్టుకున్నారు.. అంతేకాదు ఉత్తమ నూతన నటుడు విభాగంలో సైమా తెలుగు అవార్డ్స్ కి నామినేట్ కూడా కాబడ్డారు. అలాంటి ఈయన 2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో వెలుగులోకి వచ్చారు.
ఇక 2019లో వచ్చిన ఫలక్ నుమా దాస్ చిత్రంతో దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా , నటుడిగా అన్ని తానై ఈ సినిమా తీసి ఇండస్ట్రీలో తాను ఒకడిని అని అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. ఇక తర్వాత వచ్చిన హిట్ : ది ఫస్ట్ కేస్ సినిమాతో తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్న విశ్వక్ సేన్ ఆ తర్వాత చేసిన పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ముఖచిత్రం, దాస్ కా ధమ్కీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే చివరిగా ఈయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ, లైలా, ఫంకీ ఇలా పలు చిత్రాలు చేశారు. కానీ ఏవి కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు కల్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా.. ఈ ట్రైలర్ ఆద్యంతం రక్తపాతంతో ఆర్ రేటెడ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జపనీస్,స్పానిష్ భాషల్లో పాన్ గ్లోబల్ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి విశ్వక్ సేన్ హీరోగా, దర్శకుడిగా పని చేస్తున్నారు. ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న విశ్వక్ సేన్ అసలు ఇంత రక్తపాతంతో కూడిన కల్ట్ సినిమా చేయడం వెనుక అసలు కారణం ఏంటి? అనే విషయంపై మీడియాతో పంచుకున్నారు.
"ఒక కథ రాసుకున్నప్పుడు.. ఎన్నో కలలతో దానిని తెరకెక్కించడానికి ఆ కథ రాసుకుంటాము. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే మీది. మీ కథకి న్యాయం చేయలేరనే ఉద్దేశంతో మీ కథకు మీరే డైరెక్షన్ చేశారా?" అని అడగగా.." లేదు సార్, నేను కష్టాలలో ఉండి నా కథకు డైరెక్షన్ చేసుకున్నాను. ఒకరి టాలెంట్ ను నేనెప్పుడూ తక్కువ చేయలేదు. అంటే ఫలక్నుమా దాస్ దర్శకత్వం వహించక ముందు ఒక సినిమాలో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నన్ను తీసేశారు. ఒక మూడు నెలలు నన్ను ఆఫీసులో ఉంచుకొని ఆ తర్వాత వదిలేస్తే.. ఇంటికి వెళ్ళాక.. కొన్ని రోజులు బాగా ఏడ్చాను. వెయిట్ చేసి ఏం చేయాలో తెలియక కోపం వచ్చి ఆ కోపంలోనే ఫలక్నుమా దాస్ కథ రాసి నేను దర్శకత్వం వహించి సినిమా చేశాను.అలా మళ్లీ అంత బాధ నాకు ఇప్పుడు కలిగింది. ఆ కారణంగానే కల్ట్ సినిమా తీశాను" అంటూ అసలు కారణాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు విశ్వక్ సేన్.
మొత్తానికి అయితే గత తాలూకా చిత్రాలు సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్లే విశ్వక్సేన్ ఇప్పుడు మళ్లీ ఇలాంటి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే తన సినిమాకు పిల్లలు తప్ప ఫ్యామిలీ ఆడియన్స్, యువత రావచ్చని ఫ్యామిలీ ఆడియన్స్ అంటే భార్యాభర్త 18 సంవత్సరాలు పైబడిన వారే కదా అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే బాధలో నుండి పుట్టుకొచ్చిన కల్ట్ సినిమా ఆడియన్స్ను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.
