Begin typing your search above and press return to search.

ఒక్క మెయిల్‌తో విశ్వక్ కెరీర్ ఆగిపోయేదా!

విశ్వక్ సేన్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ‘ENE Repeat’ సక్సెస్ వేడుకలో గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఓ ఫేక్ మెయిల్ కారణంగా సినిమా అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు తరుణ్ భాస్కర్ తనకు అండగా నిలిచారని చెప్పారు. ఆ సంఘటనతోనే తరుణ్‌ను తన సొంత సోదరుడిగా భావిస్తానని, తన జీవితంపై ఆయన ప్రభావం ఎంతో ఉందని వెల్లడించారు.

By:  M Prashanth   |   25 Nov 2026 10:10 AM IST
ఒక్క మెయిల్‌తో విశ్వక్ కెరీర్ ఆగిపోయేదా!
X

విశ్వక్ సేన్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి తన దూకుడైన మాటలతో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. సినిమా ప్రమోషన్స్‌లోనూ అంతే ఓపెన్‌గా మాట్లాడుతుంటారు. కానీ ఈ నగరానికి ఏమైంది రిపీట్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మాత్రం విశ్వక్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్ మొదట్లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా తరుణ్ భాస్కర్‌తో తనకున్న అనుబంధం వెనుక ఇంత పెద్ద మ్యాటర్ ఉందని చాలామందికి ఇప్పటివరకు తెలియదు.

విశ్వక్ 17 ఏళ్ల వయసు నుంచే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారట. ఒక సినిమాలో మొదట హీరోగా తీసుకుని తర్వాత నాలుగో హీరోగా మార్చారని చెప్పారు. చివరికి ఆ ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా తొలగించారట. ఆ విషయం తెలియక ఇరవై రోజుల పాటు ఆఫీస్ చుట్టూ తిరిగానని, నిజం తెలిసిన తర్వాత ఇంటికి వెళ్లి బాగా ఏడ్చానని చెప్పారు. ఆ అనుభవంతో సొంతంగా ఫలక్‌నుమా దాస్ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

అలాంటి సమయంలో ఈ నగరానికి ఏమైంది ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లారు. తరుణ్ భాస్కర్‌కు విశ్వక్ ఆడిషన్ నచ్చడంతో సినిమాలో అవకాశం దక్కింది. అంతా బాగానే ఉందనుకుంటున్న టైమ్‌లో ఓ ఫేక్ మెయిల్ సమస్య తెచ్చిపెట్టింది. ఒక అమ్మాయి పేరుతో క్రియేట్ చేసిన ఈమెయిల్ నుంచి విశ్వక్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయట. నేను విశ్వక్‌తో కలిసి పనిచేశాను. నాకు ఎదురైన పరిస్థితి మరే అమ్మాయికీ ఎదురుకాకూడదు.. సినిమాలో తీసుకుంటే మీడియాకు వెళ్తామని కూడా ఆమె బెదిరించినట్లు విశ్వక్ వెల్లడించారు.

ఆ మెయిల్ రావడంతో తరుణ్ మొదట విశ్వక్‌ను సినిమా నుంచి తప్పించారట. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని నిరూపించుకునేందుకు ఆ మెయిల్ కాపీ కావాలని విశ్వక్ కోరారు. తరుణ్ దాన్ని పంపించడంతో 24 గంటల్లోనే అసలు విషయం బయటపడిందట. గతంలో తనతో గొడవపడిన ఓ వ్యక్తి ఆ మెయిల్ పంపినట్లు తేలిందని విశ్వక్ చెప్పారు. దీంతో మళ్లీ సినిమాలో అవకాశం దక్కిందని ఈవెంట్ లో చెప్పుకొచ్చారు.

నిజానికి అప్పటికి విశ్వక్ పెద్ద హీరో కాదు. అలాంటి ఆరోపణ వచ్చినప్పుడు అవకాశం పూర్తిగా పోయినా ఆశ్చర్యం లేదు. కానీ తన వాదన వినేందుకు తరుణ్ అవకాశం ఇవ్వడం విశ్వక్‌కు బాగా గుర్తుండిపోయింది. అందుకే తరుణ్‌ను సొంత సోదరుడిలా భావిస్తున్నట్లు ఈవెంట్‌లో చెప్పారు. జీవితంలో తల్లిదండ్రులు, అక్క తర్వాత తనపై ఎక్కువ ప్రభావం చూపించిన వ్యక్తి తరుణ్ అని కూడా ఎమోషనల్ అయ్యారు.

ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత అదే టీమ్‌తో విశ్వక్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ చేశారు. విశ్వక్‌తో పాటు అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను మళ్లీ కలిసి నటించారు. నవంబర్ 19న విడుదలైన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సక్సెస్ వేడుకలో అప్పటి మెయిల్ సంఘటనను విశ్వక్ బయటపెట్టడంతో తరుణ్ తన జీవితంలో ఎంత ముఖ్యమైన వ్యక్తో మరోసారి చెప్పారు. ఇప్పటికే విజయ్ దేవరకొండకు పెళ్లి చూపులు సినిమాతో మంచి సక్సెస్ ఇచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేసిన తరుణ్ విశ్వక్ కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ఇచ్చాడు. ఇక ఆ హీరోలు తరుణ్ గురించి ఎప్పుడూ మాట్లాడాల్సి వచ్చిన ఆ కృతజ్ఞత చూపిస్తూ ఎమోషనల్ అవుతున్నారు.