దేవర నిర్మాతతో విశ్వక్ కొత్త మూవీ .. ఈసారి గురి తప్పకుండా..
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మరోసారి సాలిడ్ హిట్ కొట్టేందుకు గట్టిగా ట్రై చేస్తున్నారు.
By: M Prashanth | 13 April 2026 3:40 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మరోసారి సాలిడ్ హిట్ కొట్టేందుకు గట్టిగా ట్రై చేస్తున్నారు. గత కొంతకాలంగా వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయి విజయాలు మాత్రం అందుకోవడంలో కాస్త వెనుకబడ్డారు. ఇటీవల కేవీ అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఫంకీ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో విశ్వక్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. కోలీవుడ్ హీరో కార్తీతో దేవ్ సినిమా చేసిన దర్శకుడు రజత్ రవిశంకర్ ఇప్పుడు విశ్వక్ సేన్ తో తన కొత్త సినిమా చేయబోతున్నారు. నిజానికి.. దేవ్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన తర్వాత దాదాపు ఏడు సంవత్సరాల విరామం తీసుకున్న రజత్, ఇప్పుడు పక్కా స్క్రిప్ట్ తో రీఎంట్రీ ఇస్తుండటం విశేషంగా మారింది.
ఈసారి తప్పక హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన.. విశ్వక్ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్స్ పై సుధాకర్ మిక్కిలినేని రూపొందిస్తున్నారు. ఆ బ్యానర్ ఇటీవల పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, విశ్వక్ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ దేవర 2 వంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న ఆ సంస్థ నుంచి వస్తున్న కొత్త ప్రాజెక్ట్ కావడంతో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.
తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఆ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ క్లాప్ ఇవ్వగా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్ ను అందజేశారు. అదే సమయంలో విశ్వక్- రజత్ సినిమా న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కేవలం రొమాన్స్ కే పరిమితం కాకుండా, మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు కూడా ఇందులో ఉండనున్నాయని సమాచారం.
దీంతో విశ్వక్ సేన్ కు ఇది ఒక డిఫరెంట్ జానర్ మూవీ అవుతుందని, ఆయన కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే విశ్వక్ సేన్ లెగసీ వంటి విభిన్న కథలతో పాటు స్వయంగా దర్శకత్వం వహిస్తూ తన టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రజత్ రవిశంకర్ తో చేస్తున్న సినిమా ఆయనకు కీలకంగా మారే అవకాశముంది.
కథ, స్క్రీన్ ప్లే విషయంలో విశ్వక్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. మొత్తానికి, సరైన ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఆయన.. ఈసారి తప్పక హిట్ సాధిస్తారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటుల వివరాలు మేకర్స్ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి విశ్వక్.. ఎలాంటి హిట్ అందుకుంటారో..
