తండ్రి వారసత్వం కోసం విశ్వక్ పోరాటం!
టాలీవుడ్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఇప్పుడు మరో ఇంటెన్స్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 27 Aug 2026 3:22 PM ISTటాలీవుడ్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఇప్పుడు మరో ఇంటెన్స్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న లెగసీ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. డైరెక్టర్ సాయి కిరణ్ రెడ్డి దైదా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కలాహీ మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు. సంజయ్ సాంబ్రాణి, వీవీఎన్ ప్రసాద్ కో ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్ రిలీజైనప్పటి నుంచే సినిమాపై ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న పిండం సినిమా తర్వాత కలాహీ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం వంటి అంశాలను మిళితం చేస్తూ కథను రూపొందించినట్లు తెలుస్తోంది. తండ్రి వారసత్వం అనుకోకుండా తన భుజాలపై పడటంతో ఓ యువ వారసుడు ఎదుర్కొనే సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో విశ్వక్ ఇంతకుముందెన్నడూ చూడని విధంగా కొత్త అవతార్‌లో కనిపించనున్నారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, కుటుంబ బంధాలు, వ్యక్తిగత సంఘర్షణల మధ్య అతని క్యారెక్టర్ జర్నీ ఆసక్తికరంగా ఉండనుంది. ఇక విలక్షణ నటుడు కే కే మేనన్ పవర్‌ఫుల్ విలన్ గా నటిస్తుండటం సినిమాకు మరో మెయిన్ ఎట్రాక్షన్ గా మారింది. వీరిద్దరి మధ్య సాగే ఘర్షణ కథలో కీలకంగా ఉండనుంది.
ప్రస్తుతం లెగసీ ఆఖరి షెడ్యూల్ మొదలైంది. చిత్తూరు జిల్లా మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో సుమారు నెల రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ప్రధాన తారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్‌లో సినిమాలోని కీలకమైన సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్ ను షూట్ చేయనున్నారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయ్యే దిశగా చిత్రబృందం అడుగులు వేస్తోంది.
ఏక్తా రాథోడ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మురళీ మోహన్, రావు రమేష్, సచిన్ ఖేడేకర్, రాజా రవీంద్ర, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, కలెక్టర్ శ్రీనివాస్, రవి కాలే, అమిత్ తివారీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై విశ్వక్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అధికారాన్ని వారసత్వంగా స్వీకరించడం కంటే.. దాన్ని కొనసాగించాలా, లేక తిరగరాయాలా అనే ప్రశ్న చుట్టూ సాగే లెగసీ పొలిటికల్ డ్రామా, ఎమోషన్స్, యాక్షన్‌కు ప్రాధాన్యమిస్తూ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
