మంచి దారిలో విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం..!
టాలీవుడ్‌లో స్టార్ హీరోలు సినిమాలకు ఎక్కువ సమయం తీసుకుంటున్న వేళ విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం మాత్రం వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది విశ్వక్ సేన్ నుంచి నాలుగు సినిమాలు విడుదల కాగా, కిరణ్ అబ్బవరం కూడా ‘కే ర్యాంప్’, ‘తిమ్మరాజుపల్లి టీవీ’, ‘చెన్నై లవ్ స్టోరీ’తో పాటు ‘రియాలిటీ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వీరి స్పీడ్‌తో మరింత మంది హీరోలు స్ఫూర్తి పొందాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి.
By: Ramesh Palla | 29 Nov 2026 12:00 AM ISTస్టార్ హీరోలు ఒకప్పుడు ఏడాదికి ఐదు ఆరు సినిమాలు అంతకు మించి సినిమాలు చేశారని వింటూ ఉంటాం. ఏడాదిలో పది అంతకంటే ఎక్కువ సినిమాలను చేసిన హీరోలు సైతం టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలు, చిన్న హీరోలు ఏడాదిలో అర డజను, డజను సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రెండు మూడు ఏళ్లకు ఒక సినిమాను చేసే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోలు సగటున ఏడాదిన్నర నుంచి రెండేళ్లకు ఒక సినిమా చొప్పున చేస్తున్నట్లు ఒక విశ్లేషణ ఉంది. కొందరు హీరోల సినిమాలు మూడు ఏళ్లు, అంతకు మించి సమయం తీసుకుంటూ చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిది కాదని విశ్లేషకులు మొత్తుకుంటున్నా కూడా ఏ ఒక్కరూ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్...
స్టార్ హీరోల సినిమాలు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నాయి కనుక ఆలస్యం అయినా పర్వాలేదు, కానీ చిన్న హీరోల సినిమాలు కూడా ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటున్నారు. టైర్ 2 హీరోలుగా పేరున్న వారు చాలా మంది ఏడాదికి ఒకే ఒక్కటి సినిమాను చేస్తున్నారు. వారి నుంచి అయినా ఏడాదిలో రెండు మూడు సినిమాలు వస్తాయని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. కానీ వారు కూడా ఎక్కువ సినిమాలు చేసేందుకు ధైర్యం చేయలేక పోతున్నారు. అయితే ఇద్దరు హీరోలు మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం ద్వారా ఇండస్ట్రీలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఆ ఇద్దరు మరెవ్వరో కాదు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు కాగా, మరో హీరో కిరణ్ అబ్బవరం. వీరిద్దరూ ఏడాదికి ఒక్కటే అని గిరి గీసుకుని ఉండకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ ఏడాదిలో వీరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా...
సినిమా హిట్ లేదా ఫట్ అనే విషయాలను పరిగణలోకి తీసుకోకుండా వీరు సినిమాలను చేస్తూనే ఉన్నారు. విశ్వక్ సేన్ ఈ ఏడాదిలో ఇప్పటికే ఫంకీ, కల్ట్, ఈఎన్‌ఈ రిపీట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరో రెండు నెలల్లో లెగసీ అనే సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంటే ఏడాది కాలంలో విశ్వక్ సేన్ నుంచి ఏకంగా నాలుగు సినిమాలు విడుదల అయినట్లు అవుతుంది. టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే ఈమధ్య కాలంలో ఏడాదిలో రెండు సినిమాల కంటే ఎక్కువ విడుదల చేయగలుగుతున్నారు. అలాంటిది ఏకంగా నాలుగు సినిమాలతో విశ్వక్ సేన్ బాక్సాఫీస్ వద్దకు వచ్చాడు. అందులో సక్సెస్ ఎంత అనే విషయాన్ని పక్కన పెడితే ఇండస్ట్రీ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావడం వల్ల చాలా మంది మనుగడ బాగుంటుంది. అందుకే హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలని అంతా కోరుకుంటూ ఉంటారు.
రియాల్టీ సినిమాతో రానున్న కిరణ్ అబ్బవరం...
విశ్వక్ సేన్ తర్వాత కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్ నుంచి వరుసగా కిరణ్ అబ్బవరం సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉన్నాడు. కే ర్యాంప్ మొదలుకుని తిమ్మరాజుపల్లి టీవీ, చెన్నై లవ్ స్టోరీ సినిమాలను విడుదల చేయడం జరిగింది. త్వరలోనే రియాల్టీ సినిమాతో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంటే ఏడాది గ్యాప్ లో కిరణ్ అబ్బవరం నుంచి కూడా నాలుగు సినిమాలు వచ్చినట్లే. ఈ సినిమాలు కాకుండా కిరణ్ అబ్బవరం మరో రెండు సినిమాలను సైతం లైన్ లో పెట్టాడు. ఆ రెండు వచ్చే ఏడాది ప్రథమార్థంలో వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఒక్క ఫ్లాప్ పడితే భయపడి పోయి ఏడాది పాటు సినిమాలు చేయకుండా ఉంటున్న యంగ్ హీరోలు ఉన్న టాలీవుడ్‌లో ఇలా వరుసగా ఏడాదిలో నాలుగు సినిమాలు చేయడం గ్రేట్ అంటూ ఈ ఇద్దరు హీరోలపై ప్రశంసలు కురిపిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వీరిద్దరూ కెరీర్‌లో ప్రస్తుతం చాలా మంచి దారిలో వెళ్తున్నారని, ముందు ముందు కూడా వీళ్లు ఇదే దారిలో నడుస్తూ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయాలని, వీరిని చూసి మరింత మంది ఇన్స్పైర్ అయ్యి మరిన్ని సినిమాలు చేయాలని ఇండస్ట్రీ వర్గాల వారు కోరుకుంటున్నారు.
