Begin typing your search above and press return to search.

విశ్వక్ సేన్‌ను అలా చూడాలని ఎన్టీఆర్, నాగవంశీ అనుకోవడం లేదా?

ముఖ్యంగా విశ్వక్ సేన్ దర్శకత్వంలో.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, నాగవంశీ నిర్మాతగా ఒక సినిమా వస్తే ఎలా ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో ఎక్కువగానే జరుగుతోంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   23 Oct 2026 11:30 PM IST
విశ్వక్ సేన్‌ను అలా చూడాలని ఎన్టీఆర్, నాగవంశీ అనుకోవడం లేదా?
X

సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండటం సహజం. అయితే కొంతమంది మధ్య ఉండే ప్రత్యేకమైన అనుబంధం అభిమానులను కూడా ఫిదా చేస్తూ ఉంటుంది. అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్, నాగవంశీ, విశ్వక్ సేన్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయం గురించే ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ కామెంట్లు కూడా పెడుతున్నారు.

ముఖ్యంగా విశ్వక్ సేన్ దర్శకత్వంలో.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, నాగవంశీ నిర్మాతగా ఒక సినిమా వస్తే ఎలా ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో ఎక్కువగానే జరుగుతోంది. ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

తన రాబోయే సినిమా కల్ట్ ప్రమోషన్స్ లో భాగంగా తుపాకీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్ సేన్.. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ విషయం గురించి జవాబు ఇచ్చారు. యాంకర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, నాగ వంశీ నిర్మాణ సంస్థలో మీరు దర్శకత్వం వహిస్తే చూడాలని చాలా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు అని అడిగిన వెంటనే.. తను హీరోగా ఎదగాలని జూనియర్ ఎన్టీఆర్, నాగవంశీ కోరుకోవచ్చు.. కానీ తనను ఒక దర్శకుడిగా చూడాలనే ఆలోచన మాత్రం వారిద్దరికీ లేదని చెప్పుకొచ్చాడు.

విశ్వక్ సేన్ ఇప్పటికే హీరోగా సినిమాలు చేస్తూనే, కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. అయితే ఇతర హీరోలతో సినిమాలు చేయాలనే ఉద్దేశంతో దర్శకుడిగా మారాలని తాను ఎప్పుడూ ప్రత్యేకంగా అనుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

తన సినిమాలకు తానే దర్శకత్వం వహించడం ఒక విషయమని, మరో హీరోను పెట్టి సినిమా తీయడం మరో విషయమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎప్పుడైనా అలాంటి ఆలోచన వస్తే కచ్చితంగా చెబుతానని కూడా వెల్లడించారు.

ప్రస్తుతం విశ్వక్ సేన్ తన రాబోయే చిత్రం కల్ట్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు ఆయనే కథ అందించి, దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 30, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, తరుణ్ భాస్కర్ సంభాషణలు రాశారు.

గోవాలోని ఒక ద్వీపంలో 300 మందికి పైగా వ్యక్తులు చిక్కుకుపోవడం, అక్కడ ప్రాణాలతో బయటపడేందుకు ప్రమాదకరమైన ఆటల్లో పాల్గొనాల్సి రావడం ఈ సినిమా కథలో ప్రధాన అంశం. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.