Begin typing your search above and press return to search.

US మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో టాప్-10 మిడ్‌రేంజ్ హీరోలు

విశ్వక్ సేన్ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’తో నార్త్ అమెరికాలో తొలిసారి 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ మార్కును అందుకున్నారు. ఇప్పటికే నాని, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, అడివి శేష్, నాగచైతన్య, తేజ సజ్జా, నితిన్, నిఖిల్ ఈ ఘనత సాధించగా, ఇప్పుడు విశ్వక్ కూడా వారి సరసన నిలిచారు.

By:  Sivaji Kontham   |   22 Nov 2026 4:27 PM IST
US మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో టాప్-10 మిడ్‌రేంజ్ హీరోలు
X

ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ యువ‌హీరోల‌ హవా రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం స్టార్ హీరోల సినిమాలకే పరిమితమైన `1- మిలియన్ డాలర్ క్లబ్` (9.3 కోట్ల రూపాయలు) ఇప్పుడు టాలీవుడ్ యువ హీరోలకు సైతం అలవోకగా చిక్కుతోంది. తాజాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన `ఈ నగరానికి ఏమైంది రిపీట్` (ఈఎన్ఈ రిపీట్) చిత్రంతో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఈ ప్రతిష్టాత్మక క్లబ్‌లో చేరిపోయారు. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం నార్త్ అమెరికాలో 1- మిలియన్ డాల‌ర్ మార్కును దాటడం విశ్వక్ సేన్ కెరీర్‌లోనే తొలి విదేశీ రికార్డుగా నిలిచింది. 1 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ అంటే సుమారు 10 కోట్లు. విదేశాల నుంచి కేవ‌లం 2,3 రోజుల్లోనే ఇంత పెద్ద వ‌సూళ్లు సాధించ‌డం అంటే.. అది కూడా ఒక యువ‌హీరోకి ఇది సాధ్య‌మైంది అంటే.. ఓవ‌ర్సీస్ మార్కెట్లో అత‌డి విలువ ఎలా పెరుగుతోందో అంచ‌నా వేయొచ్చు.

టాలీవుడ్ మిడ్-రేంజ్ హీరోల జాబితాను పరిశీలిస్తే.. నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద నేచురల్ స్టార్ నాని ఏకంగా 12 చిత్రాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఏ, జెర్సీ, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 వంటి చిత్రాలతో పాటు తన తాజా రిలీజ్ ప్యార‌డైజ్‌తో కలిపి సీనియర్ సూపర్ స్టార్లకు దీటుగా నాని ఆధిపత్యం చెలాయిస్తున్నారు. నాని తర్వాత విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ఖుషి, కింగ్‌డమ్ వంటి 5 సోలో చిత్రాలతో ఓవర్సీస్‌లో తన బలమైన మార్కెట్‌ను నిరూపించుకున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలతో 4 సార్లు ఈ అరుదైన రికార్డును అందుకోగా.. విభిన్న కథలతో అలరించే అడివి శేష్ మేజర్, హిట్ 2, డెకాయిట్ చిత్రాలతో హ్యాట్రిక్ 1మిలియ‌న్ డాల‌ర్ క్లబ్ పూర్తి చేశారు. అక్కినేని హీరో నాగచైతన్య లవ్ స్టోరీ, తండేల్ చిత్రాలతో లీడ్ హీరోగా నార్త్ అమెరికాలో రెండుసార్లు మిలియన్ డాలర్ల మార్కును దాటారు.

ఇక పాన్-ఇండియా విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ హీరో తేజ సజ్జా హను-మాన్ చిత్రంతో ఏకంగా 5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించగా.. ఆ తర్వాత `మిరాయ్`తోనూ 1.5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు. అలాగే నితిన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన `అ.. ఆ` చిత్రంతో 2.4 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టి ఈ జాబితాలో నిలవగా.. నిఖిల్ సిద్ధార్థ్ `కార్తికేయ 2`తో 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి ఓవర్సీస్ మార్కెట్‌లో తన సత్తా చాటారు.

ఎట్ట‌కేల‌కు నాని, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, అడివి శేష్, నాగచైతన్య, తేజ సజ్జా, నితిన్, నిఖిల్ వంటి యువ హీరోల సరసన ఇప్పుడు `ఈఎన్ఈ రిపీట్`తో విశ్వక్ సేన్ కూడా చేరడం టాలీవుడ్ మార్కెట్ విస్తరణకు నిదర్శనం. కంటెంట్ బావుంటే స‌రిహ‌ద్దులు దాటి తెలుగు యువ‌హీరోలు- రైజింగ్ స్టార్లు స‌త్తా చాటుతార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌నం.