అనుదీప్ మార్క్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? నాగవంశీ వ్యాఖ్యలు వైరల్
'జాతి రత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన దర్శకుడు అనుదీప్ కేవీ, ఇప్పుడు విశ్వక్ సేన్‌తో కలిసి 'ఫంకీ' అంటూ రాబోతున్నారు.
By: Madhu Reddy | 7 Feb 2026 11:04 PM ISTహైదరాబాద్‌లోని శ్రీ రాములు థియేటర్ సాక్షిగా 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ మళ్ళీ సందడి మొదలుపెట్టారు. 'జాతి రత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన దర్శకుడు అనుదీప్ కేవీ, ఇప్పుడు విశ్వక్ సేన్‌తో కలిసి 'ఫంకీ' అంటూ రాబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వుల జాతర ఖాయమనిపిస్తోంది. ఇక అనుదీప్ మార్క్ కామెడీ, మూవీ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ ధీమా, వెరసి ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
నాన్ స్టాప్ ఎంటర్ టైనర్ గా 'ఫంకీ' ట్రైలర్:
విశ్వక్ సేన్ ఎనర్జీకి అనుదీప్ కేవీ వింత కామెడీ తోడైతే ఎలా ఉంటుందో 'ఫంకీ' ట్రైలర్ నిరూపించింది. శ్రీ రాములు థియేటర్లో అభిమానుల కోలాహలం మధ్య విడుదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించింది. అనుదీప్ గత చిత్రం 'జాతి రత్నాలు'లో ఉన్నట్టే, ఇందులోనూ తన మార్క్కామెడీ, చిత్రవిచిత్రమైన డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. విశ్వక్ సేన్ కామెడీ టైమింగ్, ఆయన మేనరిజమ్స్ చూస్తుంటే ఈసారి 'మాస్ కా దాస్' కొత్త బాట పట్టినట్లు కనిపిస్తోంది. ఇక ఫిబ్రవరి 13న విడుదల కానున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ట్రైలర్ భరోసానిస్తోంది.
నిర్మాత నాగవంశీ ధీమా.. అనుదీప్ టేకింగ్ పై ప్రశంసలు:
సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్ట్ గురించి చాలా నమ్మకంగా ఉన్నారు. ట్రైలర్ లాంచ్ వేదికపై ఆయన మాట్లాడుతూ.. అనుదీప్ మార్క్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని, థియేటర్లలో ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వడం ఖాయమని పేర్కొన్నారు. అనుదీప్ కథలు రాసే విధానం, పాత్రలను మలిచే తీరు చాలా భిన్నంగా ఉంటాయని, విశ్వక్ సేన్ ఈ కథకు సరిగ్గా సరిపోయారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇక గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా నాగవంశీ తన సినిమా కంటెంట్‌పై చూపిస్తున్న నమ్మకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా, నరేశ్, వీటీవీ గణేశ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా వీటీవీ గణేశ్ కామెడీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుందని టాక్. 'ధమాకా' వంటి సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చడం మరో విశేషం. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ 'ఫంకీ' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
