ఫంకీ రిలీజ్ డేట్ పై అనుదీప్ క్లారిటీ
లైలా సినిమాతో డిజాస్టర్ అందుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫంకీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 19 Sept 2025 8:00 PM ISTలైలా సినిమాతో డిజాస్టర్ అందుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫంకీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. లైలా కోసం విశ్వక్ ఎంతో కష్టపడినప్పటికీ ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా అయిపోవడమే కాకుండా ఆ సినిమా విశ్వక్ కెరీర్ కు ఓ మాయని మచ్చలా మిగిలింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో నెక్ట్స్ మూవీతో హిట్ కొట్టాలని కసితో ఉన్నారు విశ్వక్.
హీరోయిన్ గా కయాదు లోహర్
అందులో భాగంగానే విశ్వక్, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో ఫంకీ మూవీ చేస్తున్నారు. ప్రిన్స్ తర్వాత అనుదీప్ నుంచి వస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాలో తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే మాస్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలను అనుదీప్ జోడిస్తున్నట్టు తెలుస్తోంది. ఫంకీలో డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఫిబ్రవరిలో ఫంకీ రిలీజ్
ఫంకీ మూవీ సెట్స్ పైకి వెళ్లి చాలా కాలమవుతున్నా, ఇంకా అది ప్రేక్షకుల ముందుకు రాలేదు. వాస్తవానికి అనుదీప్ సినిమా తీయడానికి పెద్దగా టైమ్ తీసుకోరు. కానీ ఫంకీ సినిమాకు అనుదీప్ ఎందుకింత ఆలస్యం చేస్తున్నారనేది తెలియడం లేదు. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు అనుదీప్ అతని సన్నిహితులతో చెప్పారని తెలుస్తోంది.
అనుదీప్, విశ్వక్ కాంబినేషన్ లో రాబోతున్న ఫంకీ కచ్ఛితంగా విశ్వక్ ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్ చేస్తుందని యూనిట్ సభ్యులంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే అటు విశ్వక్ కు, ఇటు అనుదీప్ కు తర్వాత్తర్వాత మంచి అవకాశాలొచ్చే ఛాన్సుంది. ఫంకీ హిట్ తో తన సత్తా చాటి, లైలాతో వచ్చిన నెగిటివిటీకి సమాధానమివ్వాలని విశ్వక్ చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరి ఫంకీ సినిమా విశ్వక్ ఆశలను నెరవేరుస్తుందో లేదా చూడాలి.
