8th క్లాస్‌లోనే యానిమేషన్.. విశ్వక్ మామూలోడు కాదు
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా ఆఫర్లు దక్కించుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు.
By: Ramesh Palla | 26 Oct 2026 9:58 AM ISTఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా ఆఫర్లు దక్కించుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. బాగా డబ్బు అయినా ఉండాలి, ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ అయినా ఉండాలి.. అప్పుడే హీరోగా ఎంట్రీ ఇవ్వడం సులభం అవుతుంది. ఈ విషయం చాలా మంది హీరోల విషయంలో నిరూపితం అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం ఎంత కష్టమో కూడా చాలా మంది హీరోలను చూస్తే అర్థం అవుతుంది. అయితే విశ్వక్సేన్ తన ప్రతిభతో ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టాడు. హీరోగానే కాకుండా తన కథలు తానే రెడీ చేసుకుని, దర్శకత్వం సైతం చేస్తున్న విశ్వక్ సేన్ మల్టీ ట్యాలెంటెడ్ అని పలు సందర్భాల్లో నిరూపించాడు. ఇప్పుడు హీరోగా బిజీగా ఉన్న విశ్వక్ సేన్ చిన్నతనంలోనే తన ప్రతిభను చూపించాడట. సాధారణంగా డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత యానిమేషన్ వైపు వెళ్తారు, కనీసం ఇంటర్ తర్వాత యానిమేషన్ నేర్చుకుంటారు. కానీ విశ్వక్సేన్ కేవలం 8th క్లాస్ చదివేప్పుడు యానిమేషన్ నేర్చుకున్నాడట.
విశ్వక్సేన్ హీరోగా కల్ట్ మూవీ...
ఈ విషయాన్ని స్వయంగా విశ్వక్ సేన్ ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'కల్ట్' సినిమాను ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా విశ్వక్సేన్ కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నాడు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాలు అంటూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో విశ్వక్ సేన్ మరింత ఎక్కువ శ్రద్ద తీసుకుని మరీ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఆ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. ఆ సమయంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసుకున్నాడు. తనకు సినిమాలపై చిన్నప్పుడే ఆసక్తి కలగడంకు కారణం ఏంటీ, అందుకు తాను ఏం చేశాను అనే విషయాలను అందరితోనూ పంచుకున్నాడు.
యానిమేషన్ కోర్స్‌లో విశ్వక్...
విశ్వక్సేన్ మాట్లాడుతూ... నేను స్కూల్ కి వెళ్లే సమయంలో మా ఇంటి మీద ఒక కంప్యూటర్ ఇన్సిట్యూట్ ఉండేది. స్కూల్‌కి వెళ్లి వచ్చిన తర్వాత పైకి వెళ్లి కంప్యూటర్లో గేమ్స్ ఆడుకోవడం, ఇంకా ఏదో ఒకటి చేయడం చేస్తూ ఉండేవాడిని, నాకు ఉన్న ఆసక్తిని గమనించి వారు డీటీపీ కోర్స్ ను మీ వాడికి నేర్పించండి అని మా ఇంట్లో వాళ్లకు చెప్పాడు. అప్పటి నుంచి కంప్యూటర్ లో ఏదో ఒకటి నేర్చుకుంటూ వచ్చాను. 8th క్లాస్‌లో నన్ను అప్పుడు బాగా బూమ్ ఉన్న యానిమేషన్ కోర్స్‌లో జాయిన్ చేశారు. స్కూల్‌కి వెళ్లి సాయంత్రం పరిగెత్తుకుంటూ వచ్చి, వెంటనే ఎరినా యానిమేషన్ ఇన్సిట్యూట్‌లో రెండున్నర ఏళ్ల కోర్స్ ను పూర్తి చేశాను. అందులో మల్టీమీడియా కు సంబంధించిన అన్ని కోర్సులను పూర్తి చేశాను. యానిమేషన్ కోర్స్ చేస్తున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తి కలిగిందని విశ్వక్ సేన్ పేర్కొన్నాడు.
లైలా, ఫంకీల తర్వాత కల్ట్ మూవీ...
అంత చిన్న వయసులోనే యానిమేషన్ కోర్స్ ను నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం, ఈజీ టూల్స్ అప్పుడు లేవు. ప్రతి దానికి ఇప్పుడు షార్ట్ కట్స్ ఉన్నాయి, కానీ అప్పట్లో కంప్యూటర్ యానిమేషన్ అనేది అత్యంత కష్టమైన జాబ్‌గా ఉండేది. అలాంటి రోజుల్లో విశ్వక్సేన్ యానిమేషన్ కోర్స్ నేర్చుకున్నాడు అంటే గ్రేట్ అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి విశ్వక్ సేన్ కొత్తగా ఏదో ఒకటి ప్రయత్నించాలని చూస్తూన్నాడు. ఇప్పుడు కూడా కొత్త జోనర్లో 'కల్ట్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసంతో విశ్వక్ ఉన్నాడు. లైలా, ఫంకీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో ఈ సినిమాతో ఫ్లాప్‌ల పరంపరకు బ్రేక్ వేయాలని చూస్తున్నాడు. మరి విశ్వక్ సేన్ ఈ సినిమాతో హిట్ కొట్టేనా చూడాలి.
