ఈ టెస్ట్ పాసైతే ఇక చెలరేగిపోతాడా?
ఇలాంటి తప్పుల వల్లే యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ఈ మధ్య వరుస ఫ్లాపుల్ని దక్కించుకుంటూ తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు.
By: Tupaki Entertainment Desk | 12 Feb 2026 6:00 PM ISTటాలీవుడ్‌లో యంగ్ హీరోలు, టైర్ 2 స్టార్స్ కొంత మంది విభిన్నమైన కథలని ఎంచుకుంటూ సక్సెస్‌లని సాధిస్తుంటే మరి కొంత మంది మాత్రం వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు. ప్రయోగాల పేరుతో కొత్త తరహా కథలు, పాత్రల్లో నటిస్తున్నా అవి ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోవడం లేదు. కారణం బలమైన కథ, కథనాలు లేకపోవడమే. ఇలాంటి తప్పుల వల్లే యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ఈ మధ్య వరుస ఫ్లాపుల్ని దక్కించుకుంటూ తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు.
విభిన్నమైన కథలని ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న విశ్వక్‌సేన్ హీరోగానే కాకుండా డైరెక్టర్‌గానూ మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. `దాస్ కా ధమ్కీ` తరువాత విశ్వక్ హిట్టు మాట విని చాలా రోజులే అవుతోంది. `గామి` ఫరవాలేదు అనిపించినా `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి`, మెకానిక్ రాఖీ, ఫస్ట్ టైమ్ లేడీ గెటప్‌లో నటించిన `లైలా`..ఇవేవీ విశ్వక్‌సేన్‌కు సక్సెస్‌ని అందించలేకపోయాయి. `లైలా` అయితే హిట్టు మాట దేవుడెరుగు..విశ్వక్‌ని విమర్శలు ఎదుర్కొనేలా చేసింది.
అంతే కాకుండా ఈ సినిమా గురించి తెలుసుకున్న విశ్వక్ సేన్ శ్రేయోభిలాషులు మరో సారి లేడీ గెటప్ వేయడానికి సాహసం చేయకని, ఇలాంటి స్క్రిప్ట్‌లు అంగీకరించకని స్ట్రిక్ట్‌గా చెప్పారట. అలా విశ్వక్‌ని హెచ్చరించిన వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ కూడా ఉండటం గమనార్హం. దాదాపు మూడేళ్లుగా ఫ్లాప్‌ల చుట్టూ తిరుగుతున్న విశ్వక్ సేన్ కెరీర్‌పై సర్వత్రా కామెంట్‌లు మొదలయ్యాయి. వరుస ఫ్లాపుల వల్ల విశ్వక్ కూడా చాలా లో ఫీలయ్యాడట. అదే సమయంలో అనుదీప్ కె.వి యూవీ `ఫంకీ` తన వద్దకు వచ్చిందని, ఈ సినిమాతో మళ్లీ తన సత్తా ఏంటో చూపిస్తానని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
అనుదీప్ కె.వి డైరెక్ట్ చేసిన ఫన్నీ మూవీ `ఫంకీ`. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ఈ మూవీలో తనకు జోడీగా క్రేజీ లేడీ కయదు లోహర్ నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేసి విశ్వక్ ఈ సారి కచ్చితంగా హిట్టు కొట్టేలా ఇండికేషన్స్ ఇచ్చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ విశ్వక్‌సేన్‌కు, దర్శకుడు అనుదీప్‌కు కూడా కీలకం. అనుదీప్ `ప్రిన్స్` మూవీతో ఫ్లాప్‌ని ఎదుర్కొన్నాడు. దీంతో తనకు కూడా `ఫంకీ` సక్సెస్ అత్యంత కీలకంగా మారింది. అనుదీప్ మార్కు ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కిన `ఫంకీ` ఫిబ్రవరి 13న రిలీజ్ అవుతోంది.
ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్, పాజిటివ్ వైబ్ ఏర్పడింది. అంతా అనుకున్నట్టే సినిమాకు హిట్ టాక్ పడితే విశ్వక్ పాసైపోతాడు. సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకుంటాడు. ఆ తరువాత సినిమాల విషయంలో ఇక చెలరేగిపోవడం పక్కా. సినిమా ప్రారంభం నుంచి తన దూకుడిని తగ్గించి పక్కా అనుదీప్ తరహాలో కూల్ అయిపోయిన విశ్వక్ ఈ మూవీతో అనుకున్నట్టే ఈ టెస్ట్ పాసైపోతాడా? అన్నది తెలియాలంటే మరి కొన్ని గంటల వేచి చూడాల్సిందే.
