సక్సెస్ పరుగులో ఆరోగ్యం బలి.. బయటపడ్డ హీరో మానసిక వేదన!
సినిమా పరిశ్రమలో ఉండే తీవ్రమైన అనిశ్చితి, ఇచ్చిన మాట నిలబెట్టుకోని వ్యక్తులు, ఆర్థిక ఒత్తిళ్లు తన మానసిక స్థితిని మరింత దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తంచేశారు.
By: Srikanth Kontham | 9 Sept 2026 11:00 PM ISTకోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు విష్ణు విశాల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఎమోషనల్ నోట్ కలకలం రేపుతోంది. ఎంత పెద్ద విజయాన్ని సాధించినా? మనసులో ఆందోళన, నిరాశ తీరడం లేదని బహిరంగంగా వెల్లడించారు. విజయం కోసం చేసే నిరంతర పరుగులో మనుషులు మానసిక ఆరోగ్యాన్ని, జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఎలా కోల్పోతున్నారో? ఆవేదనతో పంచుకున్నారు.
తన కెరీర్‌లో `రాట్ససన్`, `ఎఫ్‌ఐఆర్`, `మట్టి కుస్తీ` వంటి బ్లాక్‌బస్టర్ విజయాలున్నా? ఒక పెద్ద హిట్ వస్తే అంతా సర్దుకుంటుందనే భ్రమలో చాలా ఏళ్లు గడిపినట్లు విష్ణు విశాల్ పేర్కొన్నారు. ఇటీవల రిలీజ్ అయిన `గట్ట కుస్తీ 2` చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా? అంతర్గతంగా తనలో ఆందోళన ఏమాత్రం మారలేదని.. సక్సెస్ సాధించినా ఏదీ మారలేదన్నారు. 2018 నుంచే తాను డిప్రెషన్, యాంగ్జైటీ సమస్యలతో పోరాడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
గత ఎనిమిదేళ్ల ప్రయాణం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. సినిమా పరిశ్రమలో ఉండే తీవ్రమైన అనిశ్చితి, ఇచ్చిన మాట నిలబెట్టుకోని వ్యక్తులు, ఆర్థిక ఒత్తిళ్లు తన మానసిక స్థితిని మరింత దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఒత్తిడి తీవ్రత వల్ల ఆటో-ఇమ్యూన్ శారీరక సమస్య కూడా తలెత్తిందని.. గత మూడేళ్లుగా రెగ్యులర్‌గా థెరపీ, కౌన్సెలింగ్ తీసుకుం టున్నానని వివరించారు.
సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు, ఇతరులకు ఇచ్చిన కట్టుబాట్లు నిలబెట్టుకునేందుకు తగినంత ప్రతిఫలం లభించకపోయినా కష్టపడ్డానని ఆ క్రమంలో ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశానని విష్ణు విశాల్ గుర్తు చేసు కున్నారు. 13 ఏళ్ల వయసులో క్రికెటర్‌గా మొదలైన సక్సెస్ పరుగులో జీవితంలోని అత్యంత విలువైన సమయాన్ని కోల్పోయానని భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక దశలో సినీ రంగాన్ని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలనే ఆలోచన కూడా వచ్చిందన్నారు.
పరిశ్రమ అనేది ఎప్పటికీ పూర్తి స్థిరత్వంతో ఉండదని.. అందుకే విజయం కోసం జీవితాన్ని వాయిదా వేయడం ఆపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. `పెద్ద సక్సెస్ వస్తేనే జీవితం బాగుంటుందనుకోవడం భ్రమ. దక్కిన విజయాన్ని ఆస్వాదిస్తూనే.. జీవితంలోని చిన్న చిన్న క్షణాలను, సంతోషాలను అనుభవించాలి` అని విష్ణు అభిమానులకు, నెటిజన్లకు సూచించారు. మొత్తానికి విశాల్ భ్రమని వీడి నిజంలోకి వచ్చారు. రంగుల ప్రపంచం అన్నది పెద్ద మాయ. ఆ ప్రపంచం ఎంత అందంగా..అద్భుతంగా కనిపిస్తుందో? అంతకు మించి వాస్తవ జీవితాన్ని మర్చిపోయేలా చేస్తుందన్నది అంతే వాస్తవంగా విశాల్ మాటల్ని బట్టి అర్దమవుతుంది.
