హిట్టు కొట్టాక 9 సినిమాలు వదులుకున్నాను
విజయం జోష్ పెంచుతుంది. అవకాశాలు పెరుగుతాయి. కానీ ఈ యంగ్ హీరో విషయంలో అలా జరగలేదు.
By: Sivaji Kontham | 24 Oct 2025 9:53 AM ISTవిజయం జోష్ పెంచుతుంది. అవకాశాలు పెరుగుతాయి. కానీ ఈ యంగ్ హీరో విషయంలో అలా జరగలేదు. బ్యాక్ టు బ్యాక్ అతడు రెండు హిట్లు అందుకున్న తర్వాత కూడా అతడిని విధి విచిత్రంగా ఆడుకుంది. మొత్తం 9 సినిమాల నుంచి అతడు తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు సెట్స్ పై ఉన్న ఒక సినిమా కోసం ఆరుగురు నిర్మాతలు మారారు. వేరొక సినిమా కోసం నలుగురు, మరో సినిమా కోసం ముగ్గురు నిర్మాతలు మారారు. పడుతూ లేస్తూ ప్రస్తుతం కొన్ని సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అని సదరు హీరో వాపోతున్నాడు.
తనకు విజయాలు దక్కిన తర్వాత కూడా తన తోటి హీరోలు, తాను అభిమానించే వారు ఎవరూ తనకు కనీసమాత్రంగా అయినా ఫోన్ చేసి అభినందించలేదని అన్నారు. దానికి బదులుగా తనకు హిట్లు ఇచ్చిన దర్శకులకు ఫోన్లు చేసి వారంతా మాట్లాడతారని అన్నాడు. నాలో ఆ బాధ విచారం అలానే ఉన్నాయి అని తనకు తగిలిన గాయాల గురించి గుర్తు చేసుకున్నాడు. ఇంతకీ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ఆ హీరో ఎవరు? అంటే.. తమిళ హీరో, ప్రతిభావంతుడైన విష్ణు విశాల్. అతడు హైదరాబాద్ కి చెందిన టెన్నిస్ స్టార్ జ్వాలా గుత్తాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా పరిశ్రమ నుండి మద్దతు లేకపోవడం గురించి విష్ణు విశాల్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసాడు. అతడు నటించిన ఆర్యన్ ప్రీరిలీజ్ వేదికపై పరిశ్రమ వ్యక్తుల ఇరుకు స్వభావం గురించి షాకిచ్చే విషయాలు కొన్ని చెప్పాడు. విష్ణు విశాల్ మాట్లాడుతూ-``నేను హిట్లు కొట్టాక కూడా సతమతమయ్యాను. పరిశ్రమ వ్యక్తుల నుంచి గుర్తింపును పొందలేకపోయినందుకు సంతోషంగా లేను. నా ప్రాజెక్టులకు ఓకే చెప్పడానికి ఏడాది కాలంగా వేచి చూడాల్సి వచ్చింది. నా చిత్రం `గట్ట కుస్తీ`కి పని చేస్తున్నప్పుడు చివరి నిమిషంలో ఆరుగురు నిర్మాతలు మమ్మల్ని తిరస్కరించారు. `వేలైను వందుత వెల్లైకారన్` చిత్రీకరణకు వెళ్లాల్సిన సమయంలో నలుగురు నిర్మాతలు మారారు. `ఎఫ్.ఐ.ఆర్: ఫైజల్ ఇబ్రహీం రైజ్` విషయంలో ముగ్గురు నిర్మాతలు వెనక్కి తగ్గారు. `రచ్చాసన్` విజయం సాధించిన తర్వాత నేను కమిట్ అయిన 9 సినిమాల నుంచి నన్ను తొలగించారని విష్ణు విశాల్ గుర్తు చేసుకున్నారు.
నేను విజయం సాధించాక కూడా వీటిని పొందేందుకు అర్హత సాధించలేదా? నాలో ఆ బాధ అలానే ఉంది. గట్ట కుస్తీ, ఎఫ్ఐఆర్ వంటి హిట్స్ ఇచ్చిన తర్వాత కూడా బయటి నిర్మాణ సంస్థల నుంచి మరో అవకాశం కోసం మూడేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. అందుకే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు నిర్మిస్తున్నాను! అని తెలిపారు.
నేను ఎవరిపైనా ఫిర్యాదులు చేయాలనుకోవడం లేదు అని కూడా అన్నారు. నా సినిమాల దర్శకులతో మాట్లాడే హీరోలు నాకు కనీసమాత్రంగా అయినా శుభాకాంక్షలు చెప్పలేదని కూడా ఆవేదన చెందారు. వారంతా నాతో కాదు నా దర్శకులతో మాట్లాడతారని అన్నారు.
విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో ప్రవీణ్.కె దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ఆర్యన్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. సెల్వరాఘవన్, వాణీ భోజన్, వాణి కపూర్, జీవా తదితరులు నటించారు.
