విష్ణు 'విష్ణు విన్యాసం'.. ఓపెనింగ్స్ ఎంతంటే?
కామెడీ ఎంటర్టైనర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ విష్ణు విన్యాసం.
By: M Prashanth | 28 Feb 2026 6:54 PM ISTకామెడీ ఎంటర్టైనర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ విష్ణు విన్యాసం. గతంలో సామజవరగమన, సింగిల్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన నుంచి వచ్చిన మరో ఎంటర్టైనర్ కావడంతో రిలీజ్ కు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషనల్ కంటెంట్ వాటిని పెంచగా, శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ విడుదలైంది మూవీ.
సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ స్టార్ట్ అయింది. మూవీ చూసిన వారంతా సోషల్ మీడియాలో రివ్యూస్ ఇస్తున్నారు. శ్రీవిష్ణు ఎప్పటిలాగే తనదైన కామెడీ టైమింగ్ తో అలరించారని చెబుతున్నారు. డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను నవ్వించారని.. ఏదేమైనా మేకర్స్ సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ తో నడపడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. రన్ టైమ్ క్రిస్పీగా ఉండడం ప్లస్ పాయింట్ అని కామెంట్లు పెడుతున్నారు.
అయితే తాజాగా మేకర్స్.. ఓపెనింగ్స్ డిటైల్స్ ను అనౌన్స్ చేశారు. ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, మొదటి రోజే రూ. 3.95 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని వెల్లడించారు. దీంతో మూవీకి మంచి ఓపెనింగ్స్ దక్కాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అదే సమయంలో థియేటర్లలో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా విష్ణు విన్యాసం మూవీకి కలిసి వచ్చే అంశంగా మారింది. వీకెండ్ లో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.
ఇక సినిమా విషయానికొస్తే.. శ్రీవిష్ణు సరసన యంగ్ హీరోయిన్ నయన సారిక నటించారు. యధునాధ్ మారుతీ రావు దర్శకత్వం వహించగా.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుబ్రహ్మణ్యం నాయుడు, సుమంత్ నాయుడు నిర్మించారు. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా.. రాదన్ సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.
కథ విషయానికి వస్తే… విష్ణు పాత్రలో శ్రీ విష్ణు ఓ జూనియర్ లెక్చరర్ గా కనిపిస్తాడు. అతనికి జాతకాలు, వాస్తు వంటి మూఢనమ్మకాలపై అతిగా నమ్మకం ఉంటుంది. ఇంట్లో వాస్తు బాగోలేదని పక్కింటి బాత్ రూమ్ ను వాడుకునేంతగా అతని ప్రవర్తన ఉంటుంది. విచిత్ర అలవాట్ల కారణంగా 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తుంటాడు. అలాంటి విష్ణును చూసిన తొలి చూపులోనే మరో లెక్చరర్ అదే హీరోయిన్ నయన్ ప్రేమలో పడుతుంది.
ఆమె అలవాట్లు, ఆలోచనా విధానం చూసి మొదట విష్ణు ఆశ్చర్యపడినా, తర్వాత ఆమెను ఇష్టపడతాడు. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో మనీషా తన జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిజాన్ని విష్ణుకు చెబుతుంది. ఆ నిజం తెలుసుకున్న తర్వాత వారి ప్రేమ కథలో అనూహ్య మలుపులు వస్తాయి. ఆ నిజం ఏమిటి? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనే అంశాల చుట్టూ మిగతా మూవీ నడుస్తుంది. మరి మీరు సినిమా చూశారా?
