Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : ఇది నువ్వేనా బాసు?

మకుటం పోస్టర్‌ ను చూసిన చాలా మంది అందులో ఉన్న నటుడిని పోల్చుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నారు, కొందరు అయితే కనీసం అందులో ఉన్నది ఎవరు అనేది గుర్తు పట్టలేక పోతున్నారు.

By:  Ramesh Palla   |   21 Oct 2025 9:00 AM IST
పిక్‌టాక్‌ : ఇది నువ్వేనా బాసు?
X

స్టార్‌ హీరోలు తమ సినిమాల్లో ఎలాంటి పాత్రల్లో, గెటప్స్‌లో కనిపించినా అభిమానులు, ప్రేక్షకులు ఈజీగా గుర్తు పట్టేస్తారు. ప్రేక్షకులు సైతం గుర్తు పట్టనంతగా భిన్నమైన మేకోవర్‌, అభిమానులు సైతం పోల్చుకోలేని విధంగా హీరోలు మారడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అలా గుర్తు పట్టలేని విధంగా హీరోలు ఆయా సినిమాల్లో ఉన్నప్పుడు సక్సెస్‌ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఎక్కువ శాతం తమ ఫేస్‌ను ఈజీగా గుర్తు పట్టే విధంగానే మేకోవర్‌ కావడం మనం చూస్తూ ఉంటాం. విశాల్‌ హీరోగా ప్రస్తుతం మకుటం అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది. మకుటం పోస్టర్‌ ను చూసిన చాలా మంది అందులో ఉన్న నటుడిని పోల్చుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నారు, కొందరు అయితే కనీసం అందులో ఉన్నది ఎవరు అనేది గుర్తు పట్టలేక పోతున్నారు.


విశాల్‌ హీరోగా మకుటం సినిమా...

విశాల్‌ హీరోగా రవి అరసు దర్శకత్వంలో ఒక సినిమాను ప్రారంభించారు. అధికారికంగా సినిమాను ప్రకటించడంతో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత షూటింగ్‌ ఆగిపోయింది, హీరో విశాల్‌ - దర్శకుడు రవి అరసు మధ్య తీవ్రమైన విభేదాల కారణంగా ప్రాజెక్ట్‌ క్యాన్సల్‌ అంటూ ప్రచారం జరిగింది. మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్‌ లేదు. ఎట్టకేలకు విశాల్‌ ముసుగు తొలగించాడు, ఇన్నాళ్లు ఉన్న పుకార్లు అన్నింటికి చెక్‌ పెట్టి నిజాన్ని నిర్భయంగా ప్రకటించాడు. ఈ సినిమా విషయంలో మీడియా సర్కిల్స్‌లో ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న ప్రచారానికి బ్రేక్‌ వేశాడు. ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఇంకా ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను.. నేను ఈ సినిమాను సొంతంగా తెరకెక్కిస్తున్నాను అంటూ మకుటం పోస్టర్‌ను రివీల్‌ చేయడం జరిగింది.

మకుటంపై కీలక ప్రకటన

దీపావళి పండుగ సందర్భంగా విశాల్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. మకుటం సినిమా గురించి ఆసక్తికర విషయాలను మీతో ఈ సమయంలో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. సెకండ్‌ లుక్‌ ఇదిగో మీకోసం. ఈ సినిమాకు నేను దర్శకత్వం వహిస్తాను అని ఊహించలేదు. పరిస్థితులు ప్రభావితం చేయడం ద్వారా ఈ బాధ్యతను నెత్తిన పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను దర్శకత్వం చేయాలి అనేది ఎవరి బలవంతం లేదు, నాకు నేనుగా స్వేచ్చగా ఈ సినిమా బాధ్యతలు తీసుకున్నాను. సరైన నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నాను. బాధ్యతను తీసుకోవడం సరైన నిర్ణయంగా నేను భావిస్తున్నాను. నన్ను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలకు అన్యాయం జరగకూడదు అనుకుంటున్నాను. అందుకే సినిమా దర్శకత్వ బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చిందని విశాల్‌ తాజాగా ఒక ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశం అయింది.

ఆర్‌బి చౌదరి నిర్మాణంలో...

విశాల్‌ గతంలోనూ ఒక సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రకటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చలేదు. కానీ ఈ సినిమా ఖచ్చితంగా వర్కౌట్‌ కానుంది అని ఆయన నమ్మకంగా చెబుతున్నాడు. 25 ఏళ్లుగా దర్శకత్వం చేయాలని ఎదురు చూస్తున్నాను అని, ఇప్పటికి ఆ కల నెరవేరబోతుంది అంటూ విశాల్ గతంలో చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో నిజం కాలేదు కానీ ఈసారి మకుటం సినిమాతో నిజం కాబోతుంది. మకుటంలో విశాల్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉంది. ఓల్డ్‌ గెటప్‌లో విశాల్‌ను చూడబోతున్నాం. ఇప్పటికే ఈ సినిమాలో విశాల్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో అంజలి హీరోయిన్‌గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆర్‌ బి చౌదరి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.