Begin typing your search above and press return to search.

10 ఏళ్ల క్రితం అదృశ్య‌మైన న‌టుడు.. ఇంత‌కీ ఎక్క‌డున్నాడు?

మెగాస్టార్ చిరంజీవి నటించిన `శంకర్ దాదా ఎంబీబీఎస్` చిత్రంలో ఆసుపత్రి పేషెంట్‌గా శర్వానంద్ పోషించిన ఎమోషనల్ పాత్రను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు.

By:  Sivaji Kontham   |   8 May 2026 5:00 AM IST
10 ఏళ్ల క్రితం అదృశ్య‌మైన న‌టుడు.. ఇంత‌కీ ఎక్క‌డున్నాడు?
X

మెగాస్టార్ చిరంజీవి నటించిన `శంకర్ దాదా ఎంబీబీఎస్` చిత్రంలో ఆసుపత్రి పేషెంట్‌గా శర్వానంద్ పోషించిన ఎమోషనల్ పాత్రను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. అయితే ఆ సినిమాకు మాతృక అయిన హిందీ వెర్షన్ `మున్నాభాయ్ ఎంబీబీఎస్`లో అదే పాత్రను పోషించిన నటుడు విశాల్ థక్కర్ కథ మాత్రం నేడు ఒక మిస్టరీగా మారింది. 2000వ దశకంలో బాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ సరిగ్గా పదేళ్ల క్రితం అర్థాంతరంగా అదృశ్యమయ్యారు. నేటికీ పోలీస్ రికార్డుల్లో అపరిష్కృతంగా ఉన్న ఈ మిస్సింగ్ కేసు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విశాల్ థక్కర్ అదృశ్యం వెనుక ఉన్న పరిణామాలు గమనిస్తే.. అవి ఏదో సినిమా కథను తలపిస్తాయి. 2015 డిసెంబర్ 31న `స్టార్ వార్స్` సినిమా చూడటానికి వెళ్తున్నానని ముంబైలోని తన నివాసం నుండి అత‌డు బయలుదేరారు. వెళ్లేముందు తన తల్లి వద్ద 500 రూపాయలు అప్పుగా తీసుకున్న విశాల్ ఆ తర్వాత జనవరి 1 తెల్లవారుజామున తాను పార్టీకి వెళ్తున్నానని.. ఉదయం తిరిగి వస్తానని తండ్రికి ఒక మెసేజ్ పంపారు. అదే ఆయన నుండి వచ్చిన చివరి సందేశం. ఆ తర్వాత నుండి అత‌డి ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు.

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. జనవరి 1 ఉదయం 11:45 గంటల ప్రాంతంలో విశాల్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఘోడ్‌బందర్ రోడ్డులో కనిపించారు. అక్కడి నుండి షూటింగ్ నిమిత్తం అంధేరీకి వెళ్తున్నానని ఆటో ఎక్కి వెళ్ళిన విశాల్ ఫోన్ ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. విచిత్రమేమిటంటే.. అత‌డు అదృశ్యమైనప్పటి నుండి బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయి కూడా లావాదేవీ జరగలేదు. కనీసం ఆసుపత్రి రికార్డుల్లో గానీ.. గుర్తు తెలియని వ్యక్తుల జాబితాలో గానీ ఆయన ఆచూకీ దొరక్కపోవడం ఈ మిస్టరీని మరింత క్లిష్టంగా మార్చింది.

ఈ కేసులో మరో ఆసక్తికరమైన మలుపు ఏమిటంటే.. విశాల్ అదృశ్యానికి మూడు నెలల ముందు గర్ల్‌ఫ్రెండ్ అత‌డిపై అత్యాచార ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. అయితే తర్వాత వారిద్దరూ రాజీ పడటంతో ఆ కేసు వెనక్కి తీసుకున్నారు. పోలీసులు తొలుత ఆమెను అనుమానించినా.. త‌న‌ స్టేట్‌మెంట్‌లో ఎటువంటి పొరపాట్లు లేవని తేలింది. దురదృష్టవశాత్తు.. విశాల్ మిస్సైన కొద్ది నెలలకే అతడి ప్రియురాలు కూడా గుండెపోటుతో మరణించడంతో ఈ కేసు దర్యాప్తుకు ఉన్న ప్రధాన ఆధారాలు కూడా దొర‌క‌లేదు.

దాదాపు దశాబ్దం కాలం గడిచినా విశాల్ థక్కర్ సజీవంగా ఉన్నారా లేక ఏదైనా ప్రమాదానికి గురయ్యారా అన్నది నేటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. చాందీనీ బార్, టాంగో చార్లీ వంటి సినిమాలతో పాటు `క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ` వంటి సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఒక నటుడు ఇలా గుర్తులేకుండా పోవడం విషాదకరం. ఇది హత్యనా.. కిడ్నాపా లేక వ్యక్తిగత ఒత్తిళ్ల వల్ల ఆయనే లోకాన్ని విడిచి వెళ్లిపోయారా అనేది నేటికీ ఒక మిస్టరీ థ్రిల్లర్‌లా సాగుతూనే ఉంది.