Begin typing your search above and press return to search.

ఈ ఫ్లాప్ కాపాడుతుందేమో?

విశాల్ హీరోగా, దర్శకుడిగా చేసిన 'మకుటం' సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రివ్యూలు కూడా నెగిటివ్ గానే వచ్చాయి.

By:  M Prashanth   |   18 Aug 2026 10:26 AM IST
ఈ ఫ్లాప్ కాపాడుతుందేమో?
X

విశాల్ హీరోగా, దర్శకుడిగా చేసిన 'మకుటం' సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రివ్యూలు కూడా నెగిటివ్ గానే వచ్చాయి. అయితే ఒక ప్లాప్ రాగానే విశాల్ పని అయిపోయిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే 2023లో మార్క్ ఆంటోనీతో సూపర్ హిట్ కొట్టాడు. అలాగే 2025లో ఎప్పటినుంచో ఆగిపోయిన మద గజ రాజా కూడా రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించింది. ఇలా పడిలేచిన రికార్డ్ ఆయనకు చాలానే ఉంది.

నిజానికి ఈ సినిమాను విశాల్ మొదటి నుంచి డైరెక్ట్ చేయలేదు. రవి అరసు దర్శకత్వంలో మొదలైన ఈ ప్రాజెక్ట్ లో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో మధ్యలో విశాల్ బాధ్యతలు తీసుకున్నాడు. అందుకే ఒక డైరెక్టర్ గా ఇది పూర్తిగా ఆయన విజన్ అని చెప్పలేం. అప్పటికే షూట్ చేసిన సీన్స్ ను ఎంతవరకు మార్చాడు, దేన్ని అలాగే ఉంచేశాడు అనే విషయాలు బయటకు రాలేదు. కారణాలు ఏవైనా తెర మీద సినిమాకు దర్శకుడు కాబట్టి ఇప్పుడు ఆ ఫ్లాప్ భారాన్ని మోయక తప్పడం లేదు.

విశాల్ కు సినిమా జడ్జిమెంట్ అస్సలు తెలియదు అనడం కూడా కరెక్ట్ కాదు. 2013లో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ స్థాపించి నిర్మాతగా మంచి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత డిటెక్టివ్, అభిమన్యు లాంటి సినిమాలు నిర్మించాడు. ముఖ్యంగా అభిమన్యు తన కెరీర్ లోనే పెద్ద హిట్ అని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. దీన్నిబట్టి ఒక ప్రొడ్యూసర్ గా మార్కెట్ కు ఏ కథ వర్కౌట్ అవుతుందో పసిగట్టే అనుభవం అతనికి బాగానే ఉందని అర్థం చేసుకోవచ్చు.

అసలు విశాల్ డైరెక్టర్ గా చేయాలనుకున్న ప్రాజెక్ట్ డిటెక్టివ్ (తుప్పరివాలన్ 2). డైరెక్టర్ మిస్కిన్ తో గొడవల తర్వాత 2020లో తానే ఈ సీక్వెల్ కు దర్శకత్వం వహిస్తానని ప్రకటించాడు. మొదటి పార్ట్ కు మంచి పేరు ఉండటంతో పార్ట్ 2 మీద భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఫెయిల్ అయితే డ్యామేజ్ చాలా దారుణంగా ఉండేది. అందుకే ఆ సినిమా కంటే ముందే మకుటం ప్లాప్ అవ్వడం ఒక రకంగా విశాల్ కు ఉపయోగపడే విషయమే.

మకుటం సినిమా మీద మెయిన్ వచ్చిన కంప్లైంట్ రొటీన్ కథ, బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే. డైరెక్టర్ గా విశాల్ నెక్స్ట్ టైమ్ కచ్చితంగా చూసుకోవాల్సిన విషయాలు ఇవే. హీరోగా తనకు కావాల్సిన ఎలివేషన్స్ ఇచ్చుకోవడం వేరు, సినిమా ఎక్కడ బోర్ కొడుతుందో పసిగట్టడం వేరు. హీరోగా దర్శకుడిగా రెండు బాధ్యతలు తీసుకున్నప్పుడు తనను ప్రశ్నించే ఒక బలమైన టీమ్ పక్కన ఉండాలి. ఈ సినిమా రిజల్ట్ తో ఆ విషయం మరింత క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది.

డిటెక్టివ్ 2 ఎప్పుడు వస్తుందనే దాని మీద ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఆ ప్రాజెక్ట్ మళ్లీ ముందుకు వస్తే విశాల్ కు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక దర్శకుడిగా ఏం తీయకూడదో మకుటం రిజల్ట్ ఇప్పటికే అతనికి నేర్పించింది. ఇరవై ఏళ్ల హీరో అనుభవం, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ట్రాక్ రికార్డ్ అతని సొంతం. సరైన కథ పడితే డైరెక్టర్ గా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు.