Begin typing your search above and press return to search.

స్టార్ క‌పుల్స్ వెడ్డింగ్ లో మహారాజా వేషంలో అగంత‌కుడు!

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ- బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మల వివాహం 2017లో ఇటలీలోని టస్కనీలో అత్యంత గోప్యంగా జరిగిన సంగతి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   16 April 2026 7:00 AM IST
స్టార్ క‌పుల్స్ వెడ్డింగ్ లో మహారాజా వేషంలో అగంత‌కుడు!
X

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ- బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మల వివాహం 2017లో ఇటలీలోని టస్కనీలో అత్యంత గోప్యంగా జరిగిన సంగతి తెలిసిందే. కేవలం 40 మంది అత్యంత సన్నిహితుల మధ్య మాత్ర‌మే ఈ వేడుక‌ జరిగింది.

తాజాగా ఈ వేడుకకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పెళ్లికి భద్రత పర్యవేక్షించిన సెక్యూరిటీ హెడ్ యాసిన్ ఖాన్ వెల్లడించారు. పటిష్టమైన భద్రతా వలయాన్ని దాటుకుని ఓ అపరిచిత వ్యక్తి పెళ్లి వేదిక వ‌ద్ద‌కు ఎలా చొరబడ్డాడో వివరించారు. సాధారణంగా ఎవరైనా దొంగతనంగా పెళ్లికి రావాలంటే ఎవరికీ కనబడకుండా రావాలని చూస్తారు.

కానీ ఈ గేట్‌క్రాషర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఖరీదైన బీఎండబ్ల్యూ కారులో అచ్చం ఒక మహారాజా లాంటి దుస్తులు ధరించి పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. అతని వెంట సఫారీ కారులో ఇద్దరు బౌన్సర్లు కూడా ఉండటంతో భద్రతా సిబ్బంది అతడిని ఎవరో ముఖ్యమైన అతిథి అని పొరబడ్డారు. యాసిన్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం అప్పట్లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు చూస్తున్నది అంతా కాలేజీ పూర్తి చేసిన యువ ట్రైనీలే. వారు ఆ వ్యక్తి కారును అతని ఆహార్యాన్ని చూసి అతను తప్పకుండా పెద్ద విఐపి అయి ఉంటాడని భావించి లోపలికి అనుమతించారు.

నిజానికి యాసిన్ ఖాన్ ఆ సమయంలో లోపల మెయిన్ హాల్‌లో ఉండటంతో గేటు వద్ద ఉన్న జూనియర్లు వ‌ల్ల ఈ పొరపాటు జ‌రిగింది. లోపలికి వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి ప్రవర్తన యాసిన్ ఖాన్‌కు అనుమానం కలిగించింది. ఒక సాధారణ అతిథిలా అందరితో కలవకుండా అతను కేవలం ఒక మూలలో నిలబడి సెలబ్రిటీలతో ఫోటోలు దిగడానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు. అతనితో పాటు వచ్చిన బౌన్సర్లు సెలబ్రిటీలతో అతని ఫోటోలు తీసి పక్కకు వెళ్ళిపోయేవారు. దీనిని గమనించిన యాసిన్ ఖాన్ వెంటనే అతని వద్దకు వెళ్లి వివరాలు ఆరా తీశాడు.

విచారణలో ఆ వ్యక్తి తాను ఒక ప్రముఖ అతిథికి మేనల్లుడినని ఇటలీకి రాలేకపోయిన ఆ అతిథి తరపున తాను వచ్చానని అబద్ధం చెప్పాడు. అయితే యాసిన్ ఖాన్ వెంటనే విరాట్ కోహ్లీ మేనేజర్‌ను సంప్రదించగా ఆ వ్యక్తి పేర్కొన్న అతిథికి కేవలం ఢిల్లీలో జరిగే రిసెప్షన్‌కు మాత్రమే ఆహ్వానం ఉందని ఇటలీ పెళ్లికి కాదని చెప్పాడు. దీంతో సెక్యూరిటీ టీమ్ ఆ వ్యక్తిని మర్యాదగా బయటకు వెళ్లాలని కోరింది. భద్రతా సిబ్బంది బయటకు వెళ్లమన్నప్పుడు ఆ వ్యక్తి అహకారాన్ని ప్రదర్శించాడు. చివరికి అక్కడి నుండి నిష్క్రమించాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సెలబ్రిటీ వివాహాల్లో కూడా వేషధారణతో ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని ఈ ఘటన నిరూపిస్తోంది. ఏళ్ల తర్వాత బయటపడిన ఈ విచిత్రమైన సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.