భక్తితోనే ప్రశాంతత: ఒత్తిళ్లకు దూరంగా భజన్స్-కీర్తన్స్లో 'విరుష్క' దంపతులు
ఆధునిక సమాజంలో తీవ్రమైన పోటీ, వృత్తిగత బాధ్యతలు.. నిరంతర మీడియా శోధనల నడుమ ప్రశాంతతను వెతుక్కోవడం సవాలుగా మారింది
By: Sivaji Kontham | 26 Oct 2026 3:43 PM ISTఆధునిక సమాజంలో తీవ్రమైన పోటీ, వృత్తిగత బాధ్యతలు.. నిరంతర మీడియా శోధనల నడుమ ప్రశాంతతను వెతుక్కోవడం సవాలుగా మారింది. ముఖ్యంగా క్రీడా, సినీ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన పాపులర్ వ్యక్తులు అనునిత్యం తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటుంటారు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ- బాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క శర్మ (విరుష్క దంపతులు) తమ కెరీర్లో ఎదురైన ఒత్తిళ్లను అధిగమించేందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలు ఇస్కాన్ (ISKCON) డివోషనల్ భజనలు, కీర్తనలలో పాల్గొనేందుకు ఆసక్తిని కనబరచడం.. ఈ జంట కూడా భక్తి ద్వారానే జీవితానికి నిజమైన వైభవం, మనశ్శాంతి లభిస్తాయని భావించడం తెలిసిన విషయాలే.
ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఎదుర్కొనే వ్యక్తిగత, వృత్తిగత ఒత్తిళ్లకు భక్తి తత్వమే సరైన పరిష్కారమని, ఆధ్యాత్మికత ద్వారానే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రేమానంద్ మహారాజ్ సహా పలువురు ఆధ్యాత్మిక గురువులు తరచూ నొక్కిచెబుతుంటారు. విరాట్, అనుష్కలు తమ కెరీర్లో ఎన్నో సవాళ్లు, గడ్డుకాలాలు ఎదుర్కొన్న సమయంలో నీమ్ కరోలీ బాబా బోధనలను, ఆశ్రమాన్ని ఆశ్రయించి గొప్ప మానసిక ధైర్యాన్ని పొందారు. బృందావనంలో ప్రేమానంద్ మహారాజ్‌ను పలుమార్లు దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందడం విశేషం. ఇటీవల నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా తీసిన `హనుమాన్ అంశ్` చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించడం కూడా భక్తి మార్గానికి ఉన్న ప్రాధాన్యతను ప్రజలకు చాటిచెబుతోంది.
విరుష్క దంపతులు ఆదివారం సాయంత్రం ముంబైలో జరిగిన ప్రముఖ అమెరికన్ భక్తి గాయకుడు కృష్ణ దాస్ ప్రత్యక్ష కీర్తన కార్యక్రమంలో పాల్గొని మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. కీర్తనలో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని.. భక్తి పూర్వక సంగీతానికి అనుగుణంగా తల ఊపుతూ `రాధే రాధే`.. `హరే రామ్` నామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోవడం కనిపించింది. ఈ కార్యక్రమానికి ముందు వారు గేట్‌వే ఆఫ్ ఇండియా వద్దకు చేరుకున్న దృశ్యాలు కూడా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రఖ్యాత అమెరికన్ గాయకుడు కృష్ణ దాస్ తన ఇండియా టూర్లో భాగంగా నిర్వహించిన ఈ భక్తి సంగీత విభావరిలో భారతీయ సాంప్రదాయ ఆధ్యాత్మిక సంగీతానికి పాశ్చాత్య శైలి సమ్మేళనం కనిపించింది. విరాట్, అనుష్క జంట కృష్ణ దాస్ కీర్తనలలో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. గతంలో జూలై 2026లో లండన్‌లోని యూనియన్ చాపెల్‌లో జరిగిన కీర్తన కార్యక్రమంలోనూ వీరు హాజరయ్యారు. వేలాదిమంది అభిమానులు, కెమెరాల వెలుగుల మధ్య జీవించే ఈ సెలబ్రిటీలు, కీర్తనా వేదికలపై సాధారణ భక్తుల్లా మారి భగవన్నామస్మరణలో లీనం కావడం వారిలోని నమ్రతను, ఆధ్యాత్మిక అనురక్తిని ఎలుగెత్తి చూపుతోంది.
గత కొన్ని సంవత్సరాలుగా అనుష్క, విరాట్లు తమ వ్యక్తిగత జీవితాన్ని మీడియా లైమ్‌లైట్‌కు దూరంగా ప్రశాంతంగా గడిపేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుతం లండన్‌కు నివాసాన్ని మార్చిన ఈ దంపతులు..తమ పిల్లలు వామిక, అకాయ్‌లతో కలిసి ప్రశాంత వాతావరణంలో సమయాన్ని గడుపుతున్నారు. అయితే విదేశాలలో ఉన్నా కానీ భారత్‌కు వచ్చిన ప్రతిసారీ ఇలాంటి భక్తి కార్యక్రమాలు, కీర్తనా సభల్లో పాల్గొంటూ తమ మూలాలను, భక్తి విశ్వాసాలను కాపాడుకుంటున్నారు. ఒత్తిళ్లకు లోనయ్యే నేటి యువతకు, తమ రంగాలు ఏదైనా భక్తి మరియు నామస్మరణ ద్వారా మానసిక ప్రశాంతతను ఎలా పొందవచ్చో విరుష్క జంట తమ ప్రవర్తనతో నిరూపించి ఆదర్శంగా నిలుస్తున్నారు.
