'రాజా సాబ్' అభిమానులపై దాడి! ఎక్కడ? ఏం జరిగింది?
ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేకపోయినా, వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
By: M Prashanth | 10 Jan 2026 10:16 AM ISTసినిమా చూసేందుకు థియేటర్ కు వచ్చిన అభిమానులపై థియేటర్ యాజమాన్యం దాడి చేయించినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుండడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. వీడియోలో పెద్ద సంఖ్యలో యువకులు థియేటర్ నుంచి బయటకు వస్తుండగా, అక్కడ పని చేసే కొందరు వ్యక్తులు పైపులు, కర్రలతో వారిపై దాడి చేస్తున్న దృశ్యాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి.
ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేకపోయినా, వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం, థియేటర్ ఏరియాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అభిమానులు బయటకు వస్తుండగా, థియేటర్ సిబ్బంది వారిని అడ్డగించి దాడి చేసినట్లు వీడియోలో ఉంది.
కొందరు భయంతో పరుగులు తీస్తుండగా, మరికొందరు తమను తాము రక్షించుకునే ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. అ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీడియోలో భారీ సంఖ్యలో ప్రేక్షకులు కనిపించడంతో ఇది ఇటీవల విడుదలైన ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ప్రదర్శన సమయంలో జరిగి ఉండవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.
ది రాజా సాబ్ కు భారీ క్రేజ్ ఉండటంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి ఎక్కువగా ఉంటోందని, ఆ గందరగోళంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ లేదు. అదే సమయంలో వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కొందరు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అభిమానులపై అలా పైపులు, కర్రలతో దాడి చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు. సినిమా చూడటానికి వచ్చిన వారిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. థియేటర్ నిర్వహణపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, కొందరు నెటిజన్లు మాత్రం పూర్తి వివరాలు తెలియకుండా తప్పు నెట్టడం సరికాదని అంటున్నారు. థియేటర్ లో ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చని, కొందరు ఆకతాయిల ప్రవర్తన వల్ల పరిస్థితి కంట్రోల్ తప్పి ఉండవచ్చని కామెంట్లు పెడుతున్నారు. అసలు కారణం ఏమిటన్నది తెలుసుకున్న తర్వాతే అప్పుడు వీడియోపై జడ్జ్ చేయాలని అంటున్నారు.
అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు థియేటర్ యాజమాన్యం గానీ, పోలీసులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అసలు ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? అభిమానులు ఎందుకు బయటకు వస్తున్నారు? గొడవకు కారణం ఏమిటి? అనే క్వశ్చన్లకు ఆన్సర్లు తెలియాల్సి ఉంది. అసలు రాజా సాబ్ మూవీ ప్రదర్శన సమయంలో జరిగినదేనా అనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
