రూ.156 కోట్ల వాచ్.. ప్రత్యేకతలు ఏంటో చూద్దాం రండీ
ఏదైనా వస్తువు పాతగా అయితే విలువ తగ్గుతుంది. కానీ మరీ ఎక్కువ పాతగా అయిన తర్వాత కూడా అది పని చేస్తూ ఉందంటే అది వింటేజ్ వస్తువు అవుతుంది.
By: Ramesh Palla | 11 Nov 2025 3:00 PM ISTఏదైనా వస్తువు పాతగా అయితే విలువ తగ్గుతుంది. కానీ మరీ ఎక్కువ పాతగా అయిన తర్వాత కూడా అది పని చేస్తూ ఉందంటే అది వింటేజ్ వస్తువు అవుతుంది. ఈ మధ్య కాలంలో వింటేజ్ వస్తువులకు మార్కెట్ లో ఉన్న విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వందల ఏళ్ల క్రితం నాటి వస్తువులు తమ వద్ద వినియోగించుకున్నా అలా ఉంచుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే మార్కెట్ లో వింటేజ్ వస్తువుల విక్రయం బాగా పెరిగింది. సోషల్ మీడియా మొదలుకుని ప్రతి చోట వింటేజ్ వస్తువుల గురించి మనం ఏదో ఒక చోట చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఒక వింటేజ్ వాచ్ గురించి మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఏకంగా రూ.156 కోట్ల ధర పలికిన ఆ వాచ్ గురించి తెలుసుకునేందుకు జనాలు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తూ, ఆ వాచ్ గురించి తెలుసుకుని షాక్ అవుతున్నారు.
1943లో తయారైన వాచ్...
రూ.156 కోట్ల ధర పలికిన ఆ వాచ్ కు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం... 1943లో ఈ వాచ్ తయారు అయింది. ఈ వాచ్ ను పోటెక్ ఫిలిప్ అండ్ కో కంపెనీ తయారు చేసింది. ఈ వాచ్ చూడ్డానికి సాధారణంగానే కనిపించినప్పటికీ ఆ సమయంకి ఉన్న పరిజ్ఞానం ను ఉపయోగించి అత్యధ్బుతంగా రూపొందించడం జరిగిందట. ఈ వాచ్ గతంలోనూ చాలా సార్లు వేలం ద్వారా అమ్మడం జరిగింది. చేతులు మారుతున్నా కొద్ది విలువ పెరుగుతూ వచ్చింది. ఇప్పటికే ఈ వాచ్ ను ప్రంపంలోనే అత్యంత ఖరీదైన వస్తువుల జాబితాలో చేర్చడం జరిగింది. చేతి గడియారం కేటగిరీలో ఈ వాచ్ కి అత్యంత ప్రాధాన్యత ఉండటం వల్ల ఎంతో మంది వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరీ కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
విభిన్నమైన డిజైనర్ వాచ్..
9 ఏళ్ల క్రితం ఈ వాచ్ ను 11 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ వద్ద ఉంచుకున్న సదరు యజమాని ఇప్పుడు మరోసారి ఈ వాచ్ ను వేలం ద్వారా అమ్మేందుకు సిద్దం అయ్యాడు. వాచ్ కి ఉన్న ప్రాధాన్యత, వింటేజ్ లుక్, ఇతర విషయాల కారణంగా ఇప్పుడు ఏకంగా 17.6 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయినట్లుగా చెబుతున్నారు. సదరు సంస్థ ఈ మొడల్ వాచ్ లను 280 తయారు చేయడం జరిగిందట. ఆ సమయంలో వీటి ధర నామమాత్రంగానే ఉన్నప్పటికీ, అప్పటి మార్కెట్ విలువను బట్టి చూస్తే చాలా ఎక్కువే అంటున్నారు. విభిన్నమైన మెకానిజంను ఉపయోగించడం ద్వారా అప్పట్లోనే ఈ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించిందని, అప్పటి నుంచి ఈ మోడల్ వాచ్ ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారని ఈ వాచ్ గురించి తెలిసిన వారు అంటున్నారు.
స్టెయిన్‌లెస్ స్టీల్, బంగారంతో తయారు చేసిన వాచ్...
ఈ కంపెనీ తయారు చేసిన 280 గడియారాల్లో నాలుగు వాచ్ లను స్టెయిన్‌లెస్ స్టీల్, బంగారం మిక్స్ చేసి తయారు చేయడం జరిగిందట. ఇక మిగిలిన 276 వాచ్ లను మొత్తం బంగారంతో తయారు చేయడం జరిగింది. స్టెయిన్ లెస్ స్టీల్ వాడిన వాచ్ లకు మంచి లుక్ వచ్చింది. దాంతో బంగారు వాచ్ ల కంటే కూడా ఎక్కువగా స్టెయిన్ లెస్ స్టీల్ ఉన్న వాచ్ లకు డిమాండ్ ఉండేదట. ఆ కంపెనీ తయారు చేసిన నాలుగు స్టెయిన్‌లెస్ స్టీల్ వాచ్ ల్లో ఇటీవల వేలంలో అమ్ముడు పోయిన వాచ్ మొదటిది అని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ వాచ్ ను వేలం వేసిన సమయంలో మొత్తం అయిదుగురు బిడ్డర్ లు ముందుకు వచ్చారు. వారిలో టెలిఫోన్ బిడ్డర్ కి దక్కిందని వేలం నిర్వాహకులు చెబుతున్నారు. ముందు ముందు ఈ వాచ్ ధర మరింతగా పెరిగినా ఆశ్చర్యం లేదని వేలం నిర్వాహకులు చెబుతున్నారు.
