భారీ హిట్ ఇచ్చినా గ్యాప్ ఏ కారణంగా!
'డీజేటిల్లు' విజయంతో విమల్ కృష్ణ పేరు ఒక్కసారిగా సంచలనంగా మారింది. అప్పటికే 'జెస్సీ', 'లేడీస్ అండ్ జెంటిల్మెన్' లాంటి సినిమాలు చేసినా? అవేవి ఇవ్వని సక్సెస్ ని గుర్తింపును డీజేటిల్లు ఇచ్చింది.
By: Srikanth Kontham | 9 Sept 2025 3:00 PM IST'డీజేటిల్లు' విజయంతో విమల్ కృష్ణ పేరు ఒక్కసారిగా సంచలనంగా మారింది. అప్పటికే 'జెస్సీ', 'లేడీస్ అండ్ జెంటిల్మెన్' లాంటి సినిమాలు చేసినా? అవేవి ఇవ్వని సక్సెస్ ని గుర్తింపును డీజేటిల్లు ఇచ్చింది. ఐదు కోట్ల బడ్జెట్ లో నిర్మించిన సినిమా 30 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో విమల్ కృష్ణ ఇండస్ట్రీలో బిజీ డైరెక్టర్ అవ్వడం ఖాయమనుకున్నారంతా. కానీ ఆయన కెరీర్ మాత్రం అలా సాగలేదు. `డీజేటిల్లు` రిలీజ్ అయి మూడేళ్లు అవుతున్నా? కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి చాలా సమయం పట్టింది.
ప్రతిభావంతులు ఉన్నదే తక్కువ:
నిన్నటి రోజున రాగ్ మయూరి హీరోగా ఓ సినిమా లాంచ్ చేసాడు. దీంతో విమల్ కృష్ణ పేరు అంతటా చర్చనీ యాంశంగా మారింది. దర్శకుడిగా విమల్ ఎందుకింత గ్యాప్ తీసుకున్నాడు? అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. స్టోరీ సిద్దం చేసుకోవడంలో ఆలస్యమైందా? హీరోలు దొరకక వెయిట్ చేసాడా? లేక అవకాశం రాక ఖాళీగా ఉండిపోయాడా? అన్న చర్చ సాగుతోంది. 'డీజేటిల్లు' లాంటి హిట్ ఇచ్చిన తర్వాత అవకాశాలు రాకపోవడం ఉండదు. ఇలాంటి డైరెక్టర్లు ఉన్నదే ఇద్దరు ముగ్గురు.
ఆ ఛాన్స్ తీసుకోకుండా:
అందులో విమల్ కృష్ణ పేరు ముందుంటుంది. ఆ సంగతి పక్కన బెడితే `డీజేటిల్లు` తర్వాత విమల్ కాస్త పేరున్న స్టార్లతో పనిచేసే అవకాశం ఉంటుంది. టైర్ -2 హీరోలు, మీడియం రేంజ్ హీరోలు కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. మీడియం రేంజ్ నిర్మాణ సంస్థల వద్ద అడ్వాన్సులు తీసుకొవొచ్చు. కానీ విమల్ మాత్రం ఆ ఛాయిస్ తీసుకోలేదు. తాను నమ్మిన కొత్త వాళ్లతోనే ముందు కెళ్తున్నాడు. తాజా నిర్మాణ సంస్థ కూడా కొత్తగానే కనిపిస్తుంది.
కథ కొత్త నటుడినే కోరుకుందా:
అలాగే తాను రాసుకున్న స్క్రిప్ట్ కూడా కొత్త నటుడినే డిమాండ్ చేసి ఉండొచ్చు. కొన్ని కథలకు కొందరు మాత్రం సెట్ అవుతుంటారు. `డీజేటిల్లు` అలా అన్ ప్లాన్డ్ గా సెట్ అయిన ప్రాజెక్టే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిత్రం సంచలనం సృష్టించింది. మళ్లీ అలాంటి సంచలనంలో భాగంగా కొత్త నటుడిని తెరపైకి తెస్తున్నాడా? అన్నది సస్పెన్స్ . డీజేటిల్లు తర్వాత సిద్దు జొన్నలగడ్డ టాలీవుడ్ లో బిజీ స్టార్ మారిన సంగతి తెలిసిందే. వరుసగా అగ్ర బ్యానర్లో సినిమాలు చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్లు సైతం అతడితో పనిచేయాలనే ఆసక్తితో ఉన్నారు.
