నటి కష్టం.. ఓ వైపు థెరపీ.. ఇంకో వైపు సన్నివేశాల చిత్రీకరణ !
విక్రాంత్ కథానాయకుడిగా, చాందిని చౌదరి కథానాయికగా నటించిన `సంతాన ప్రాప్తిరస్తు` ఈనెల 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
By: Sivaji Kontham | 11 Nov 2025 9:39 AM ISTవిక్రాంత్ కథానాయకుడిగా, చాందిని చౌదరి కథానాయికగా నటించిన `సంతాన ప్రాప్తిరస్తు` ఈనెల 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్‌లపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్విప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా టీజర్ , ట్రైలర్‌కు ఇప్పటికే అద్భుత స్పందన వచ్చింది. సోమవారం సాయంత్రం ప్రీరిలీజ్ వేడుకలో చిత్రబృందం సందడి చేసింది. ఈ వేడుక ఆద్యంతం తెలుగమ్మాయి చాందిని చౌదరి ప్రత్యేక ఆకర్షణగా మారారు.
ఈ సినిమా టీమ్ ని విష్ చేసేందుకు దర్శకరచయిత మచ్చ రవి, దర్శకుడు బాబి తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై మచ్చ రవి మాట్లాడుతూ.. నటి చాందిని చౌదరి చాలా మంది తెలుగమ్మాయిలు సినీరంగంలోకి రావడానికి స్ఫూర్తినిచ్చారని ప్రశంసించారు. చాందిని ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం గొప్ప విషయమని అన్నారు. తెలుగమ్మాయిలు సినీరంగానికి రావాలంటే భయపడతారు. కానీ చాందిని నటనా రంగంలో నిరూపించుకున్నారు. కెరీర్ లో తను మంచి సినిమాలు చేసారు. కలర్ ఫోటో తర్వాత సంతాన ప్రాస్తిరస్తు.. మంచి పేరు తెచ్చే సినిమా అని అన్నారు. ఈ సినిమాలో పిల్లల్ని కనాలంటే ఎలా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లో ఉండాలో చెప్పిన సాధువు పాత్ర లో వెన్నెల కిషోర్ అద్భుతంగా నటించారని కూడా తెలిపారు.
ఇక ఇదే వేదికపై నిర్మాతలు మాట్లాడుతూ.. చాందిని చౌదరి షూటింగ్ సమయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారని తెలిపారు. ఓవైపు సెట్లో తనకు థెరపీ జరుగుతుంటే, మరోవైపు సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని, బాధతో ఉన్నా కానీ, తన సీన్ కోసం వచ్చి చాందిని చాలా శ్రమించారని తెలిపారు. ఈ సినిమా కథానాయకుడు విక్రాంత్ అమెరికాలో విజయవంతమైన టెకీ. ఆయన సాఫ్ట్ వేర్ కంపెనీలను నడిపిస్తున్నారు. అయితే వాటిని వదిలేసి ఇక్కడ హీరోగాను రాణిస్తున్నారని కితాబిచ్చారు.
ఈ సినిమాలో అద్భుతంగా నటించిన చాందిని చౌదరి, విక్రాంత్ తదితరులకు మధురా శ్రీధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సంతాన ప్రాప్తిరస్తు విజువల్స్ చూసాక అందరూ చప్పట్లు కొడుతుంటే విజయం సాధించిన ఆనందం కలుగుతోందని నిర్వి ప్రసాద్ అన్నారు. ఎంత బడ్జెట్ అయినా ఫర్వాలేదు.. పెద్ద బడ్జెట్ పెట్టాలనుకున్నాం.. కానీ చిన్న బడ్జెట్ అయినా.. తప్పక సూపర్ సక్సెస్ సాధించే సినిమా తీసామని తెలిపారు. ఈ చిత్రంలో విక్రాంత్, చాందిని అద్బుతంగా నటించారని తెలిపారు. చైతన్య, కళ్యాణి పాత్రలు అద్భుతంగా పండాయని అన్నారు.
