నిరూపించుకున్న స్టార్ కిడ్.. పట్టుకొని కాదు వదిలేసి చూడండి!
ఆయన ఎవరో కాదు ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ వారసుడు ధ్రువ్ విక్రమ్.
By: Madhu Reddy | 18 Oct 2025 10:10 AM ISTసినీ సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి వస్తున్నారు అంటే.. వారసుల తాలూకు తల్లిదండ్రులు తమ వారసుల మొదటి సినిమా కోసం కథల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ కథ తమ వారసులకు సెట్ అవుతుందా ? లేదా? ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? ఇలా పలు విషయాలను గమనించి సరైన దర్శకులను రంగంలోకి దింపి, ఆ తర్వాతే తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసినా.. ఒకసారి సక్సెస్ లభిస్తే మరొకసారి డిజాస్టర్ గా నిలుస్తూ ఉంటారు.
నిజానికి స్టార్ కిడ్స్ కు సినీ ఇండస్ట్రీ ఎంట్రీకి మొదటి అవకాశం సులభంగానే దొరికినా...రెండవ అవకాశం కోసం వారే కష్టపడాల్సి ఉంటుంది. అందుకే మొదటి సినిమా విషయంలోనే కష్టం విలువ తెలిస్తే.. రెండవ సినిమాకి అది సులభం అవుతుందని ఇప్పటికే చాలామంది నిరూపించారు కూడా.. ఈ క్రమంలోనే ఒక స్టార్ కిడ్ కూడా తండ్రి సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇప్పటికే ఆయన డెబ్యూ జరిగిపోయింది. కానీ అది ఆయన సొంత నిర్ణయం కాదు. కానీ ఇప్పుడు సొంత నిర్ణయంతోనే తీసిన సినిమా మంచి విజయాన్ని అందించింది. అందుకే స్టార్ కిడ్స్ ను పట్టుకొని కాదు వదిలేసి చూడండి.. తమ టాలెంటును బయట పెడతారు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ స్టార్ కిడ్ ఎవరు ? ఆయన నటించిన సినిమా ఏంటో? ఇప్పుడు చూద్దాం.
ఆయన ఎవరో కాదు ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ వారసుడు ధ్రువ్ విక్రమ్. అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ గా తెరకెక్కిన ధ్రువ్ చిత్రం చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. బాల తీసిన వెర్షన్ నిర్మాతలకు నచ్చక అర్జున్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గిరీషయ్యతో అదే చిత్రాన్ని ఆదిత్య వర్మ పేరుతో మళ్లీ తీశారు. కానీ పర్వాలేదు అనిపించుకుంది. ఇటీవల తన తండ్రితో కలిసి మహాన్ అనే సినిమా చేశారు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని ధృవ్ ఎంత బ్రతిమలాడినా ఓటీటీలో విడుదల చేసి అతడిని డిసప్పాయింట్ చేశారు చిత్ర బృందం . పైగా ఈ రెండు చిత్రాలను అతడు ఓన్ చేసుకోలేకపోయాడు. దీనికి కారణం ఒకటి రీమిక్స్.. మరొకటి తన తండ్రి విక్రమ్ హీరోగా చేసిన ఓటీటీ సినిమా..
ఈ నేపథ్యంలోనే మారి సెల్వరాజ్ దర్శకత్వంలో బైసన్ అనే సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతేకాదు ఇదే తన అసలైన డెబ్యూ మూవీగా కూడా భావించారు ధృవ్ . ఈ సినిమా కోసం భారీగానే కష్టపడ్డారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా, పశుపతి కీలక పాత్రలో పోషించిన ఈ చిత్రం.. మరొకవైపు డ్యూడ్, డీజిల్ సినిమాలతో పోటీపడి మంచి విజయం అందుకుంది. అంతేకాదు ఈ సినిమా చూసిన ఆడియన్స్ దీపావళి విన్నర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.
బైసన్ సినిమాతో పాటు విడుదలైన చిత్రాల విషయానికొస్తే.. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాకి ఇప్పుడు తమిళంలో మిక్స్డ్ టాక్ లభించింది. కానీ ఈ బైసన్ సినిమాకి ప్రేక్షకులు మంచి ఆదరణ చూపిస్తున్నారు. తమిళంలో 3.5 , 4 రేటింగ్స్ కూడా పడుతున్నాయి. ధృవ్ విక్రమ్ పర్ఫామెన్స్ కి సర్వత్ర ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. వివక్షత కారణంగా కెరియర్లో ఎదగలేక ఇబ్బంది పడే యువ ప్లేయర్ పాత్రలో జీవించేసాడు ధృవ్ . మానసికంగా, శారీరకంగా అతని ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం అని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా బైసన్ మూవీ ధృవ్ కి మంచి విజయాన్ని అందించింది అనడంలో సందేహం లేదు. అందుకే ఎప్పుడూ కూడా సొంత టాలెంట్ ను నమ్ముకుంటే.. ఇలాంటి సక్సెస్ లే లభిస్తాయని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మొత్తానికైతే స్టార్ కిడ్ తన సొంత డెబ్యూ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పవచ్చు.
