Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: ఈ ఇద్ద‌రు నేపోకిడ్స్ ప‌రిస్థితేంటి?

శివాజీ గణేశన్, ప్రభు కుటుంబం నుంచి వచ్చిన విక్రమ్ ప్రభు, చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ఇంకా ఆశించిన స్టార్‌డమ్ కోసం పోరాడుతున్నారు. కుంకి, మహాన్, బైసన్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నా సోలో హీరోలుగా భారీ కమర్షియల్ విజయాలు అందుకోలేకపోయారు. వారసత్వం కంటే వరుస విజయాలు, కథల ఎంపికే స్టార్‌డమ్‌కు కీలకమని వీరి కెరీర్లు చెబుతున్నాయి.

By:  Sivaji Kontham   |   22 Nov 2026 6:00 PM IST
టాప్ స్టోరి: ఈ ఇద్ద‌రు నేపోకిడ్స్ ప‌రిస్థితేంటి?
X

కోలీవుడ్ సినీ పరిశ్రమలో దిగ్గజ కుటుంబాల నుంచి వచ్చినా ఆశించిన స్థాయి స్టార్‌డమ్ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్న నటవారసులలో విక్రమ్ ప్రభు, ధృవ్ విక్రమ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు నట దిగ్గజం శివాజీ గణేశన్ మనవడిగా.. ప్రముఖ నటుడు ప్రభు తనయుడిగా విక్రమ్ ప్రభు ఇండస్ట్రీలోకి రాగా.. మరోవైపు విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ వారసుడిగా ధృవ్ విక్రమ్ వెండితెరకు పరిచయమయ్యారు. వీరిద్దరికీ ఉన్న సినీ నేపథ్యం వల్ల ప్రారంభంలోనే భారీ గుర్తింపు తో పాటు అవకాశాలు లభించినా ఆ క్రేజ్‌ను దీర్ఘకాలిక సూపర్ స్టార్‌డమ్‌గా మలచుకోవడంలో మాత్రం స‌క్సెస్ కాలేక‌పోయార‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి.

2012లో వచ్చిన `కుంకి` చిత్రంతో విక్రమ్ ప్రభుకు ఘనమైన ఆరంభం దక్కింది. ఆ తర్వాత `ఇవాన్ వేరమాతిరి`, `అరిమ నంబి` వంటి చిత్రాలతో ఆకట్టుకున్నా తన మార్కెట్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లే వరుస కమర్షియల్ బ్లాక్‌బస్టర్లు లేక వెనుకబడ్డారు. కష్టానికి వెనుకాడకుండా యాక్షన్, కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ `పొన్నియిన్ సెల్వన్` వంటి భారీ చిత్రాల్లో నటించినా.. సోలో హీరోగా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టే స్థాయికి ఇంకా చేరుకోలేకపోయారు. ప్రస్తుతం రోమియో పిక్చర్స్ నిర్మిస్తున్న `సిటీ ఆఫ్ గోల్డ్` వంటి ప్రాజెక్ట్‌లతో తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారు.

మరోవైపు చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అర్జున్ రెడ్డి రీమేక్ `ఆదిత్య వర్మ`తో అరంగేట్రం చేసిన ధృవ్.. తన తండ్రి మాదిరిగానే పాత్రల కోసం ఎంతటి కష్టమైనా పడే తత్వం ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి విక్రమ్‌తో కలిసి నటించిన `మహాన్`లో తన నటనతో మెప్పించినా సోలో హీరోగా బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడానికి మాత్రం చాలా సమయం పడుతోంది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా `బైసన్` కోసం ధృవ్ తీవ్రంగా శ్రమించినా కెరీర్‌లో ఆశించిన స్థాయి కమర్షియల్ బ్రేక్ ఇంకా దక్కాల్సి ఉంది.

నిజానికి గ్లామ‌ర్ పరిశ్రమలో కేవలం ఇంటి పేరు లేదా వారసత్వం ఉంటే సరిపోదని.. వరుస విజయాలు .. ప్రేక్షకుల నాడిని పట్టే కథల ఎంపికతోనే స్టార్‌డమ్ సాధ్యమవుతుందని వీరిద్దరి ప్రయాణం స్పష్టం చేస్తోంది. శివకార్తికేయన్, విజయ్ సేతుపతి వంటి సినీ నేప‌థ్యం లేని హీరోలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంటే....విక్రమ్ ప్రభు-ధృవ్ విక్రమ్ వంటి నటవారసులు మాత్రం తమ శ్రమకు తగిన భారీ కమర్షియల్ విజయం కోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు.