Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా ఆలోచ‌నే లేని ఈ సంచ‌ల‌నం ఎటు!

విక్ర‌మ్.కె. కుమార్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని ద‌ర్శ‌కుడు. హాలీవుడ్ టూ టాలీవుడ్ లో అత‌డిది వైవిథ్య‌మైన ప్ర‌యాణం.

By:  Srikanth Kontham   |   4 Feb 2026 5:00 PM IST
పాన్ ఇండియా ఆలోచ‌నే లేని ఈ సంచ‌ల‌నం ఎటు!
X

విక్ర‌మ్.కె. కుమార్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని ద‌ర్శ‌కుడు. హాలీవుడ్ టూ టాలీవుడ్ లో అత‌డిది వైవిథ్య‌మైన ప్ర‌యాణం. రెగ్యుల‌ర్ క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌కు భిన్నంగా సినిమాలు చేయ‌డం విక్ర‌మ్ ప్ర‌త్యేక‌త‌. హాలీవుడ్ లో తెర‌కెక్కించిన `సైలెంట్ స్క్రీన్` నుంచి `థాంక్యూ` వ‌ర‌కూ ప్ర‌తీ చిత్రంలో అత‌డి మార్క్ తిరుగులేనిది. పాత క‌థ‌ల్లో కొత్త‌గా త‌న‌దైన మ్యాజిక్ తో అల‌రించ‌డంలో స్పెష‌లిస్ట్. రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణంలో చేసింది కొన్ని సినిమాలే అయినా? వాటిని ఐకానిక్ చిత్రాలుగా చెప్పొచ్చు. `13 బీ`, `ఇష్క్`, `మ‌నం`, `24` లాంటి చిత్రాల‌తోనే విక్ర‌మ్ ప‌న‌త‌నం అర్ద‌మ‌వుతుంది.

కానీ అత‌డి క‌థ‌లు క‌మ‌ర్శిల్టీకి దూరం కావ‌డంతో? బిజీ డైరెక్ట‌ర్ కాలేక‌పోయాడు. పాన్ ఇండియాలో స‌త్తా చాట‌గ‌ల స‌మ‌ర్ధ‌వంతుడే. కానీ అదే పాన్ ఇండియాకిప్పుడు అత‌డు వంద‌ల కిలో మీట‌ర్ల దూరంలో ఉన్నాడు? అన్న‌ది కాద‌న‌లేని నిజం. కొంత కాలంగా తెలుగు, త‌మిళ చిత్రాల‌తోనే క‌నిపిస్తోన్న విక్ర‌మ్ కెప్టెన్ కుర్చీ ఎక్కి మూడేళ్లు దాటిపోయింది. చివ‌రిగా 2022లో నాగ చైత‌న్య‌ హీరోగా `థాంక్యూ`ని తెర‌కెక్కించాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. అప్ప‌టి నుంచి విక్ర‌మ్ జాడ ఏ భాష‌లోనూ క‌నిపించ‌లేదు.

కోలీవుడ్లో చివ‌రిగా `24` లాంటి టైమ్ ట్రావెల్ స‌క్సెస్ అందించినా మ‌రో సినిమా చేయ‌లేదు. ఈ క్ర‌మంలోనే `దూత` అనే వెబ్ సిరీస్ తెర‌కెక్కించి అక్క‌డా స‌క్సెస్ అయ్యాడు. నాగ‌చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన క్రైమ్ థ్రిల్ల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. గ్లోబ‌ల్ స్థాయిలో ఆ సినిమాకు ఓ గుర్తింపు ద‌క్కింది. అయితే ఆ క్రేజ్ ను విక్ర‌మ్ పాన్ ఇండియా వైపు మ‌ళ్లించ‌లేక‌పోయాడు విక్ర‌మ్. అందుకు కార‌ణం అవ‌కాశాలు రాక‌పోవ‌డ‌మా? స్వ‌యంకృప‌రాధ‌మా? అన్న‌ది ఆ పెరుమాళ్ల‌కే ఎరుక‌. కానీ అత‌డి అభిమానులు మాత్రం ప్ర‌తిభావంతుడు వెనుక‌బ‌డ‌టంపై నిరుత్సాహం వ్య‌క్తం చేస్తున్నారు.

రాజ‌మౌళి, లోకేష్ క‌న‌గ‌రాజ్, ప్ర‌శాంత్ నీల్, రిషబ్ శెట్టి, సుకుమార్ లాంటి వాళ్లు పాన్ ఇండియాలో స‌త్తా చాటు తుంటే? విక్ర‌మ్ పాన్ ఇండియా ఆలోచ‌నే లేకుండా ఉన్నాడా? అన్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా `దూత 2` తెర‌కెక్కించ‌డానికి స‌ర్వం సిద్దం చేసే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ సిద్ద‌మైంది. `వృష‌క‌ర్మ` నుంచి రిలీవ్ అవ్వ‌గానే? నాగ‌చైత‌న్య `దూత 2` లో జాయిన్ అవుతాడు. ఈ నేప‌థ్యంలో `దూత 2` తో నైనా విక్ర‌మ్ లో పాన్ ఇండియా సినిమా ఆలోచ‌న మొదలవ్వాల‌ని అభిమానులు ఆశీస్తున్నారు.

అలాగే విక్ర‌మ్ ఇంత వ‌ర‌కూ సొంత ప‌రిశ్ర‌మ మాలీవుడ్ ను ట‌చ్ చేయ‌లేదు. కేర‌ళ‌లోని తిరుసూర్ కు చెందిన విక్ర‌మ్ ద‌ర్శ‌క ప్ర‌యాణం ఇంగ్లీష్ చిత్రంతో మొద‌లైంది. అక్క‌డ నుంచి నేరుగా `ఇష్టం` చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టారు. అనంత‌రం `13 బీ`తో త‌మిళ్, హిందీలో ఒకేసారి లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే.