రిస్క్ చేస్తూనే ఫుల్ సపోర్ట్.. విక్రమ్ కు కలిసొస్తుందా?
విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విక్రమ్, దర్శకుడు ఆనంద్ శంకర్ తో రీసెంట్ గా చియాన్ 63 ప్రాజెక్ట్ స్ట్రార్ట్ చేశారు.
By: M Prashanth | 14 Jun 2026 12:24 PM ISTఒకప్పుడు స్టార్ హీరోల రెమ్యూనరేషన్లే సినిమాల బడ్జెట్ లో ఎక్కువ శాతం! సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా హీరోలకు ఫిక్స్ చేసుకున్న రెమ్యునరేషన్ మాత్రం అందేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మెల్లమెల్లగా మారుతున్నాయి. సినిమాల రిజల్ట్స్ ఎవరూ గెస్ చేయలేకపోతున్న వేళ.. స్టార్ హీరోలు నిర్మాతల పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. అలాంటి హీరోల లిస్ట్ లో తాజాగా చియాన్ విక్రమ్ పేరు కూడా చేరింది.
విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విక్రమ్, దర్శకుడు ఆనంద్ శంకర్ తో రీసెంట్ గా చియాన్ 63 ప్రాజెక్ట్ స్ట్రార్ట్ చేశారు. సత్య జ్యోతి ఫిలింస్ నిర్మిస్తున్న ఆ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ఇటీవల మొదలైంది. అయితే ఆ సినిమా విషయంలో కథతో పాటు బిజినెస్ పరంగా విక్రమ్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలి కాలంలో విక్రమ్ నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. నటుడిగా ఆయనకు ఉన్న ఇమేజ్, అభిమానుల్లో ఉన్న ఫేమ్ మాత్రం తగ్గకపోయినా, మార్కెట్ పరంగా ఎదురైన సవాళ్లు మాత్రం వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో నిర్మాతలపై భారం పడకుండా ఉండేందుకు విక్రమ్ ప్రాఫిట్ షేరింగ్ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఆ విధానంలో భాగంగా ఆయన ముందు తక్కువ పారితోషికం తీసుకుని, మిగిలిన దాన్ని సినిమా రిజల్ట్ పై ఆధారపడి పొందనున్నారు. నాన్ థియేట్రికల్ డీల్స్, విడుదల తర్వాత వచ్చే లాభాల్లో వాటా రూపంలో అందుకోనున్నారని సమాచారం. సినిమా విజయవంతమైతే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. రిజల్ట్ ఆశించినట్లు లేకపోతే ఆదాయం కూడా తగ్గుతుంది. అంటే నిర్మాతలతో పాటు రిస్క్ కూడా పంచుకునేందుకు విక్రమ్ సిద్ధమయ్యారన్న మాట.
దీంతో ఇప్పుడు ఇలాంటి ఆలోచనను పాజిటివ్ ఎలిమెంట్ గా చూస్తున్నారు. భారీ రెమ్యునరేషన్ కారణంగా నిర్మాతలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో స్టార్ హీరోలు కూడా సినిమా విజయంపై పూర్తి బాధ్యత తీసుకుంటున్నారనే చెబుతోంది. ఇక విక్రమ్- ఆనంద్ శంకర్ కాంబినేషన్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
గతంలో వీరి కలయికలో వచ్చిన ఇంకొక్కడు మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా ఏళ్ల తర్వాత ఆ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో కొత్త సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈసారి మరింత పవర్ ఫుల్ యాక్షన్ కథను ఆనంద్ శంకర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ వీడియోలో విక్రమ్ ను డేంజరెస్ కుక్ రోల్ లో పరిచయం చేసిన తీరు ఆసక్తిని పెంచింది.
సాధారణ వ్యక్తిలా కనిపించే పాత్ర వెనుక మరో యాంగిల్ దాగి ఉందనే సిగ్నల్స్ కనిపించాయి.
విక్రమ్ మరోసారి సరికొత్త మేకోవర్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సంతోష్ నారాయణన్ మ్యూజిక్, ఆర్‌డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎక్స్ ట్రా అసెట్స్ గా మారనున్నాయి. అయితే పాత్రల విషయంలో రిస్క్ చేయడానికి ఎప్పుడూ వెనుకాడని విక్రమ్.. ఇప్పుడు బిజినెస్ పరంగా కూడా అదే ధైర్యాన్ని చూపిస్తున్నారు. నిర్మాతలకు ఫుల్ సపోర్ట్ ఇస్తూనే, సినిమా సక్సెస్ తన విజయంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి కొత్త ప్లాన్ విక్రమ్ కు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అందిస్తుందో లేదో చూడాలి.
