సుస్మితా సేన్‌తో డేటింగ్ రోజుల్లో నా దగ్గర పైసల్లేవు!
1990ల కాలంలో విక్రమ్ భట్- సుస్మితా సేన్ ల ప్రేమాయణం బాలీవుడ్‌లో ఓ పెద్ద సంచలనం.
By: Srikanth Kontham | 8 Jun 2026 10:22 PM ISTరంగుల ప్రపంచం అనగానే విలాసవంతమైన జీవితాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ మెరిసే గ్లామర్ వెనుక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు.. ఒడిదుడుకులు ఉంటాయని బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఒకవైపు అమీర్ ఖాన్ లాంటి అగ్ర హీరోతో సినిమా చేస్తూనే.. మరోవైపు `మిస్ యూనివర్స్` సుస్మితా సేన్‌తో ప్రేమలో ఉన్న సమయంలో తాను ఎలాంటి దారుణమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో? ఓ ఇంటర్వ్యూలో పంచు కున్నారు. బయట ప్రపంచానికి తానొక పెద్ద దర్శకుడిగా చలామణి అవుతున్నా? వ్యక్తిగతంగా జేబులో కనీసం డబ్బులు లేని రోజులు అవి అని పేర్కొన్నారు.
1990ల కాలంలో విక్రమ్ భట్- సుస్మితా సేన్ ల ప్రేమాయణం బాలీవుడ్‌లో ఓ పెద్ద సంచలనం. ఆ సమయంలో విక్రమ్ భట్ `గులాం` సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా అమీర్ ఖాన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేతిలో ఉన్నప్పటికీ తనకు ఆశించిన స్థాయిలో పారితోషికం అందలేదని విక్రమ్ భట్ తెలిపారు. ప్రపంచం తనను అమీర్ ఖాన్‌ను డైరెక్ట్ చేస్తున్న పెద్ద దర్శకుడిగా.. విశ్వసుందరితో డేటింగ్ చేస్తున్న అదృష్టవంతుడిగా చూసిందని కానీ తన అసలు పరిస్థితి ఎవరికీ తెలియదని నవ్వేసారు.
ఆ రోజుల్లో తన ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే? కనీసం లగ్జరీ హోటల్‌కు వెళ్లి బిల్లు కట్టేంత స్తోమత కూడా ఉండేది కాదని విక్రమ్ భట్ గుర్తు చేసుకున్నారు. ఒక సందర్భంలో సుస్మితా సేన్ తనను ఒక ఖరీదైన రెస్టారెంట్‌కు తీసుకెళ్లినప్పుడు అక్కడ బిల్లు కట్టడానికి దగ్గర సరిపడా డబ్బులు లేవని దాంతో సుస్మితానే స్వయంగా బిల్లు చెల్లించిందని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఎంతో ఆత్మన్యూనతకు లోనయ్యానని కానీ సుస్మితా పరిస్థితిని అర్థం చేసుకుని ఏరోజు ఒత్తిడి తీసుకురాలేదన్నారు.
సరిగ్గా అదే సమయంలో విక్రమ్ భట్ మొదటి భార్య అదితితో విడాకుల ప్రక్రియ కూడా నడుస్తోందని, దీంతో మానసికంగా, ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయానని భట్ వెల్లడించారు. `ఒకవైపు విడాకుల కోర్టు ఖర్చులు, మరోవైపు చేతిలో సినిమాలు లేకపోవడం నన్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఒకానొక దశలో నా బ్యాంక్ ఖాతాలో కనీసం వెయ్యి రూపాయలు కూడా లేవు. అప్పట్లో నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే? చనిపోవడానికి విషం కొనుక్కోవాలన్నా నా దగ్గర డబ్బుల్లేని పరిస్థితి` అన్నారు.
సినిమా రంగంలో సక్సెస్ అనేది ఎంత తాత్కాలికమో? అలాగే అక్కడ గ్లామర్ చూసి మోసపోవద్దని విక్రమ్ భట్ ఈ సందర్భంగా హితవు పలికారు. బయటకు కనిపించే ఆడంబరాలకు, లోపల ఉండే వాస్తవ జీవితానికి పొంతన ఉండదన్నారు. సాధారణ మధ్యతరగతి వ్యక్తి ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందుల కంటే సెలబ్రిటీల ఇబ్బందులు మరింత క్లిష్టంగా ఉంటాయని ఎందుకంటే వారు తమ స్టేటస్ ను కాపాడుకోవడానికి సమాజం ముందు నటించాల్సి వస్తుందని విశ్లేషించారు. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా? ఆ కష్ట కాలం నుండి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని, ఆ అనుభవాలే తనను మానసికంగా దృఢంగా మార్చాయని విక్రమ్ భట్ ముగించారు.
