1920 ఫ్రాంచైజీ రీ-ఎంట్రీపై భారీ అంచనాలు!
హారర్ జానర్‌కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు.. ఆదరణ ఉన్నాయి. పాయింట్ ఎలాంటిదైనా? హారర్ ని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తే అది చిన్న సినిమా అయినా? మంచి ఫలితాలు సాధిస్తున్నాయి
By: Srikanth Kontham | 20 Jun 2026 2:11 PM ISTహారర్ జానర్‌కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు.. ఆదరణ ఉన్నాయి. పాయింట్ ఎలాంటిదైనా? హారర్ ని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తే అది చిన్న సినిమా అయినా? మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. హారర్ జోనర్ కు ఏ పరిశ్రమలోనూ ఎప్పటికీ ఎండింగ్ లేనిది. బాలీవుడ్ లో ఈజానర్ చిత్రాల్లో విక్రమ్ భట్ స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే. హారర్ సినిమాలకు కమర్షియల్ విలువులను జోడించి.. వాటిని బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ఫ్రాంచైజీలుగా మార్చడంలో విక్రమ్ ఏనాడో? అగ్రగామిగా నిలిచారు. గతంలో ఆయన అందించిన భయానక చిత్రాలు హిందీ సినిమా ప్రేక్షకులలో సరికొత్త భయ ప్రకంపనలను సృష్టించాయి.
ముఖ్యంగా విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన `హాంటెడ్ 3D` చిత్రం బాలీవుడ్ హారర్ జోనర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3D హారర్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించిన చిత్రమిది. ఈ చిత్రం సాధించి న ఘన విజయం ..లభించిన ప్రజాదరణ.. హారర్ జోనర్‌లో మరింత వినూత్నమైన చిత్రాలను రూపొందించడానికి మేకర్స్‌కు ఎనలేని ఉత్సాహాన్ని.. నమ్మకాన్ని కలిగించింది. అలాగే విక్రమ్ భట్ కెరీర్‌లో అత్యంత విజయవంతమైన `1920` హారర్ ఫ్రాంచైజీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
15 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చిత్రం అప్పట్లో గొప్ప విజయాన్ని సాధించింది. పీరియాడిక్ హారర్ డ్రామాగా మొదలైన 1920 సిరీస్ బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భయానక ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచింది. పాతకాలపు భవనాలు, మంత్రముగ్ధులను చేసే సంగీతం, బలమైన కథాంశంతో సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్రాంచైజీలోకి విక్రమ్ భట్ మళ్లీ అడుగు పెట్టడం హారర్ ప్రియులకు పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం విక్రమ్ భట్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఆనంద్ పండిట్‌తో చేతులు కలపడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
కంటెంట్ ఆధారిత చిత్రాలను, భారీ కమర్షియల్ ప్రాజెక్ట్‌లను నిర్మించడంలో ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్ మంచి గుర్తింపు పొందింది. తాజాగా ఇద్దరు దిగ్గజాల కలయిక వల్ల `1920` ఫ్రాంచైజీలో రాబోయే చిత్రం నిర్మాణ విలువల పరంగా, కథా వస్తువు పరంగా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు హాలీవుడ్ స్థాయి హారర్ చిత్రాలు చూసి ఎంతో పరిణతి చెందుతున్నారు. ఈనేపత్యంలో నేటి తరం ఆడియన్స్‌ను మెప్పించాలంటే పాత పద్ధతుల భయపెట్టే సీన్లు సరిపోవు.
విజువల్ ఎఫెక్ట్స్ , అధునాతన సౌండ్ డిజైన్, ఊహించని ట్విస్టులతో కూడిన బలమైన స్క్రీన్‌ప్లే ఎంతో ముఖ్యం. `హాంటెడ్ 3D`లో సాంకేతిక విప్లవాన్ని చూపించిన విక్రమ్భట్ ఈ కొత్త చిత్రంలో కూడా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. బాలీవుడ్‌లో సీక్వెల్స్ - ఫ్రాంచైజీల హవా నడుస్తున్న తరుణంలో `1920` సిరీస్ పునరాగమనం బాక్సాఫీస్ వద్ద మంచి బజ్ ని తీసుకొస్తుంది. అనుభవజ్ఞుడైన దర్శకుడు- ప్రతిభావంతుడైన నిర్మాత జతకట్టడం ప్రాజెక్ట్‌కు అతిపెద్ద బలం.
