30కోట్ల మోసం కేసుపై దర్శకుడి కౌంటర్
హారర్ చిత్రాలతో ట్రెండ్ సృష్టించిన ప్రముఖ దర్శకుడు 30కోట్ల మోసం కేసులో చిక్కుకున్నాడు. అతడు అతడి భార్య, సహచరులపై ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదయ్యాయి.
By: Sivaji Kontham | 19 Nov 2025 3:00 AM ISTహారర్ చిత్రాలతో ట్రెండ్ సృష్టించిన ప్రముఖ దర్శకుడు 30కోట్ల మోసం కేసులో చిక్కుకున్నాడు. అతడు అతడి భార్య, సహచరులపై ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని తోసిపుచ్చుతున్న సదరు స్టార్ డైరెక్టర్ తమపై కేసు పెట్టిన వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లను సమర్పించి పోలీసులను కూడా తప్పు దారి పట్టించాడని చెబుతున్నారు.
తనపైనా, తన సహచరులపైనా కేసులు పెట్టినట్టు తనకు ఇప్పుడే తెలిసిందని అతడు వెల్లడించాడు. ఆ వ్యక్తి సినిమాను మధ్యలో ఆపేసాడు. సాంకేతిక నిపుణులకు లక్షల్లో బకాయిలు చెల్లించాలి. దానిని ఎగవేసేందుకు తమపై తప్పుడు ఫిర్యాదు చేసాడని, తప్పుడు పత్రాలను సృష్టించాడని సదరు డైరెక్టర్ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసాడు.
అయితే ఈ కేసులో నిజానిజాలేమిటన్నది పోలీసులు నిగ్గు తేలాల్సి ఉంటుంది. మొత్తం ఎనిమిది మందిపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయి. ఈ కేసులో ప్రముఖుల వివరాల్లోకి వెళితే.. ఇందిరా ఐవిఎఫ్ వ్యవస్థాపకుడు డాక్టర్ అజయ్ ముర్దియా ఉదయపూర్‌లోని భూపాల్‌పురా పోలీస్ స్టేషన్‌లో దర్శకుడు విక్రమ్ భట్, అతడి భార్య, సహచరులపై కేసు నమోదు చేసారు. మోసం, ఆర్థిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని, తప్పుడు హామీలు ఇచ్చారని ముర్దియా ఆరోపించారు.అయితే దీనికి విక్రమ్ భట్ కౌంటర్ ఇచ్చారు. అతడు నకిలీ పత్రాలతో ఫిర్యాదు చేసారని ఆరోపించారు. ముర్దియా `విరాట్` అనే సినిమాని మధ్యలో నిలిపివేసి, చెల్లించాల్సిన బకాయిలను క్లియర్ చేయడంలో విఫలమయ్యారని కూడా భట్ ఆరోపించారు.
తన భార్య శ్వేతాంబరి సహా ఏడుగురిపై కేసులు నమోదయ్యాయని, ఇవన్నీ తప్పుడు కేసులు అని అన్నారు భట్. పోలీసులను ఒప్పించడానికి అతడు ఏదో నకిలీ సృష్టించారని అన్నారు. మర్థియా సాంకేతిక నిపుణులకు 2.5 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, ఎగ్గొట్టేందుకు కేసులు పెట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించాడని భట్ ఆరోపించారు.
ఎఫ్.ఐ.ఆర్ వివరాల ప్రకారం.. ఉదయపూర్ నివాసి దినేష్ కటారియా ద్వారా భట్‌కు మర్థియా పరిచయం అయ్యారు.
ముంబై పరిశ్రమలో బలమైన సంబంధాలు ఉన్న వ్యక్తితో పాటు అతడు భట్ ని కలిసాడు. విక్రమ్ భట్ మొత్తం చిత్ర నిర్మాణ ప్రక్రియను తాను పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చాడని, నిధులను బదిలీ చేస్తూనే ఉండాలని కోరాడని మర్ధియా వెల్లడించాడు. తన దివంగత భార్య జీవితకథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తానని చెప్పిన విక్రమ్ భట్ 30కోట్ల వరకూ మోసం చేసారని నిర్మాత మర్ధియా ఆరోపించారు. ఎఫ్.ఐ.ఆర్ లో విక్రమ్ భట్, శ్వేతాంబరి భట్, వారి కుమార్తె కృష్ణ భట్ సహా పలువురి పేర్లు ఉన్నాయి.
పోలీస్ అధికారులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. అధికారులతో సహకరించడానికి తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని భట్ అన్నారు. నేను చెప్పేదానికి నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. పోలీసులకు పత్రాలు అవసరమైతే ప్రతిదీ చూపిస్తాను. ఆ తర్వాత ఎవరు సరైనవారో, ఎవరు తప్పు అనేది స్పష్టంగా తెలుస్తుందని భట్ అన్నారు.
