Begin typing your search above and press return to search.

'ప‌సివాడి ప్రాణం' కాపీ స‌రే కానీ.. హృద‌యాన్ని క‌దిలించే క‌థ చెప్పిన‌ విజ‌యేంద్ర ప్ర‌సాద్!

దీనిపై విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంట‌ర్వ్యూలో స్పందిస్తూ.. `పసివాడి ప్రాణం` సినిమా స్ఫూర్తితోనే ఈ కథను రాసుకున్నానని చాలా నిజాయితీగా అంగీకరించారు.

By:  Sivaji Kontham   |   29 Aug 2026 9:36 AM IST
ప‌సివాడి ప్రాణం కాపీ స‌రే కానీ.. హృద‌యాన్ని క‌దిలించే క‌థ చెప్పిన‌ విజ‌యేంద్ర ప్ర‌సాద్!
X

భారతీయ చిత్రసీమలో `బాహుబలి`, `ఆర్.ఆర్.ఆర్, `మణికర్ణిక`, `తలైవి` వంటి అనేక భారీ పాన్-ఇండియా చిత్రాలకు కథలు అందించిన దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `వార‌ణాసి`కి ఆయ‌నే ర‌చ‌యిత‌. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా విజ‌యేంద్రుడు క‌థ‌, క‌థ‌నం అందించిన `భజరంగీ భాయిజాన్` చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన కల్ట్ క్లాసిక్ `పసివాడి ప్రాణం` సినిమా నుంచి కాపీ కొట్టారని గతంలో ప్రచారం జరిగింది. దీనిపై విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంట‌ర్వ్యూలో స్పందిస్తూ.. `పసివాడి ప్రాణం` సినిమా స్ఫూర్తితోనే ఈ కథను రాసుకున్నానని చాలా నిజాయితీగా అంగీకరించారు.

2009-2011 మధ్య కాలంలో తనకు `పసివాడి ప్రాణం` సినిమా ఎంతగానో నచ్చిందని.. ఆ లైన్‌ను ఆధారంగా చేసుకుని కథ రాయడం ప్రారంభించానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కథా చర్చల్లో తన తమ్ముడు కాంచి - సహాయకుడు మహదేవ్‌లు కూడా భాగమయ్యారు. ఆ సమయంలోనే పాప ఎదుర్కొనే ప్రమాదాన్ని భారతదేశంలో కాకుండా పాకిస్థాన్ నేపధ్యంలో పెడితే బాగుంటుందని.. కథానాయకుడు ఎల్లప్పుడూ `జై శ్రీరామ్` అని మంత్రం జపించే నిజాయితీపరుడైన భజరంగీలా ఉంటే బాగుంటుందని వారు ఇచ్చిన ఆలోచనలతో కథ ఒక కీలక మలుపు తిరిగింది.

అయితే ప్రారంభంలో రాసుకున్న స్క్రిప్ట్‌లో ఒక ధనవంతుడి పసిపిల్లవాడిని రక్షించి పాకిస్థాన్‌లోని ఇంటికి చేర్చేలా ప్లాన్ చేసినా.. రచయితగా విజయేంద్ర ప్రసాద్‌కి అందులో పూర్తి సంతృప్తి లభించలేదు. కథలో ఏదో బలమైన ఎమోషన్ లోపించిందనే భావన త‌నను వెంటాడుతూనే ఉండేదని తెలిపారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆయన ఒక టీవీ ఛానెల్‌లో ఒక పాకిస్థానీ కుటుంబానికి సంబంధించిన రియల్ లైఫ్ ఇంటర్వ్యూను చూశారు. ఆ సంఘటన `భజరంగీ భాయిజాన్` రూపురేఖలను పూర్తిగా మార్చేసింది.

గుండెలో రంధ్రం ఉన్న ఒక పాకిస్థానీ చిన్నారికి స్వదేశంలో ఆపరేషన్ చేయడానికి రూ.10-15 లక్షల ఖర్చవుతుంటే, ఆ కుటుంబం మద్రాస్‌లోని అపోలో ఆసుపత్రికి వచ్చింది. అక్కడ అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ విజయవంతం కావడమే కాకుండా.. వారి ఆర్థిక పరిస్థితిని చూసి హాస్పిటల్ యాజమాన్యం రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా వైద్యం అందించి... తిరుగు ప్రయాణానికి కూడా డబ్బులిచ్చి పంపింది. అడ్వాన్స్ ఇచ్చిన ల‌క్ష కూడా ఆ పాకిస్తానీ దంప‌తుల‌కు తిరిగి వెన‌క్కి ఇచ్చేసారు. భారతీయ వైద్యులు, ప్రజల మంచితనానికి ఆ పాకిస్థానీ దంపతులు కన్నీళ్లు పెట్టుకుంటూ కృతజ్ఞతలు తెలిపిన తీరు విజయేంద్ర ప్రసాద్ మనసును తీవ్రంగా కదిలించింది. ఈ విష‌యాల‌న్నీ ఆ దంప‌తులు చెన్నైలో ఓ రేడియో లైవ్ టెలీకాస్ట్ లో చెప్పడం హృయాల‌ను క‌రిగించింది. పాకిస్తాన్ నుంచి వ‌చ్చిన వారిని భార‌త్ లో శ‌త్రువులుగా చూస్తార‌ని భ‌య‌ప‌డ్డామ‌ని.. కానీ ఇక్క‌డ అంతా ప్రేమ ద‌య ఉన్నాయ‌ని పాకిస్తానీ దంప‌తులు రేడియోలో చెప్పారు. ఇదే విధంగా పాకిస్తాన్ లో ప్ర‌జ‌లు కూడా ఉంటార‌ని కూడా వారు చెప్పారు.

రెండు దేశాల మధ్య నిరంతరం ఉండే వైరం, పోరాటాలు - యాక్షన్ ఘట్టాల కంటే.. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న ప్రేమ, సామరస్యాన్ని ప్రతిబింబించేలా సినిమా తీస్తే ఎందుకు చూడరు అని ఆయన భావించారు. ఎలాంటి చదువు, ఆయుధాలు, తెలివితేటలు లేదా డబ్బు లేని ఒక సామాన్యమైన అమాయక మానవుడు కేవలం తన `మంచితనాన్నే` ఆయుధంగా చేసుకుని.. పాకిస్థాన్ పసిపాపను సురక్షితంగా స్వదేశానికి ఎలా చేర్చాడనే ఆలోచనతో పూర్తి స్థాయి క్లాసిక్ `భజరంగీ భాయిజాన్` కథ రూపుదిద్దుకుందని ఆయన వెల్లడించారు.