చిన్న సినిమాల కోసం అప్పులు.. డిస్టర్బ్ అయితే వారి జీవితాలు నాశనం: విజయశాంతి
కామాఖ్య సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
By: M Prashanth | 23 July 2026 5:51 PM ISTచిన్న సినిమాలకు అందరి సపోర్ట్ ఎంత అవసరమో మరోసారి గుర్తు చేశారు సీనియర్ నటి విజయశాంతి. పెద్ద సినిమాలకు ఉన్న ప్రమోషన్స్, వసూళ్ల అవకాశాలు చిన్న చిత్రాలకు ఉండవని, అలాంటి సమయంలో ప్రేక్షకులు, మీడియా కలిసి ప్రోత్సహిస్తేనే కొత్త దర్శకులు, నిర్మాతలు నిలబడతారని ఆమె అభిప్రాయపడ్డారు. కామాఖ్య సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
"భయపడకు అభి.. అందరూ సపోర్ట్ చేస్తారు. మీడియా కూడా చిన్న సినిమాల గురించి బాగా రాయాలి. మొదటి రోజే ఎవరో ఏదో అన్నారు కాబట్టి తీర్పు ఇవ్వకూడదు. ఎంత ఎక్కువగా సపోర్ట్ చేస్తే, అంతలా చిన్న సినిమా నిలబడుతుంది" అని విజయశాంతి అన్నారు. చిన్న సినిమాల వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో ఆశలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
"ఎక్కడెక్కడో అప్పులు తీసుకుని, ఎంతో నమ్మకంతో నిర్మాతలు సినిమాలు తీస్తారు. అలాంటి సమయంలో ఏదైనా ఆటంకం కలిగితే నిర్మాతలు, దర్శకుల జీవితాలే నాశనం అవుతాయి. అది ఎప్పుడూ జరగకూడదు" అంటూ ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. పెద్ద హీరోలు, ప్రముఖ దర్శకులు ఇప్పటికే ఎన్నో కష్టాలను ఎదుర్కొని తమ స్థాయికి చేరుకున్నారని, కానీ కొత్తవాళ్లు మాత్రం తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న సమయంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత అందరిదీ అని చెప్పారు.
"మీరు ఈ మూవీ గురించి మంచి ప్రమోషన్స్ చేస్తే, వారి జీవితాలను నిలబెట్టిన వారవుతారు. అప్పుడు వారు మరిన్ని కొత్త కథలతో ముందుకు వస్తారు. అయితే ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది" అని అన్నారు. ఆమె వ్యాఖ్యలు చిన్న సినిమాల పరిస్థితిని క్లియర్ గా రిఫ్లెక్ట్ చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవలి కాలంలో చిన్న సినిమాలకు థియేటర్లలో అవకాశాలు తగ్గిపోతున్నాయని, విడుదలైన మొదటి రోజే సోషల్ మీడియాలో వచ్చే అభిప్రాయాలు వాటి భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయనే చర్చ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విజయశాంతి చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, కామాఖ్య చిత్రానికి జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇది ఆయనకు దర్శకుడిగా రెండో సినిమా. గతంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన చిరంజీవా చిత్రాన్ని ఆయన రూపొందించగా, ఆ సినిమా ఓటీటీలోనే విడుదలైంది.
అయితే కామాఖ్యను మాత్రం థియేటర్లలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ టీమ్ నిర్ణయించింది. ఆ చిత్రాన్ని వడ్డేపల్లి శ్రీవాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు. రామం రాఘవం చిత్రంలో కీలక పాత్ర పోషించిన సముతిరకని ఈ సినిమాలోనూ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు సమైరా, ఆనంద్, అభిరామి, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య తదితరులు నటిస్తున్నారు. ఏదేమైనా చిన్న సినిమాల విజయమే కొత్త టాలెంట్ కు మంచి వే చూపుతుందని, వాటిని ప్రోత్సహించడం ద్వారా ఇండస్ట్రీకి మరింత బలం చేకూరుతుందని విజయశాంతి స్పష్టం చేశారు.
