ఈ సీనియర్ నటికి షష్ఠిపూర్తి ఏజ్ అంటే నమ్మగలరా?
ఇటీవల పాల్గొన్న ఒక కార్యక్రమంలో విజయశాంతి ఛామింగ్ రూపంపై బోలెడంత చర్చ సాగుతోంది. వెటరన్ నటి ప్రసంగిస్తూ తన హుందాతనంతో అందరినీ ఆకట్టుకున్నారు.
By: Sivaji Kontham | 24 July 2026 8:45 AM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటన, పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ఒకప్పుడు బాక్సాఫీస్‌ను ఏలిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రస్తుత రూపం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. 24 జూన్, 1966న మద్రాసులో జన్మించిన ఈ సీనియర్ నటికి ఇప్పుడు షష్టిపూర్తి (60 ఏళ్లు) వయసు వచ్చిందంటే ఎవరైనా నమ్మగలరా? ఆ వయసులో కూడా సీనియర్ నటి మెయింటెన్ చేస్తున్న పర్ఫెక్ట్ ఫిట్‌నెస్, రాయల్ లుక్ .. వేదికలపై మాట్లాడేటప్పుడు కనిపించే హుందాతనం నేటి తరం నటీనటులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయి.
సినిమా రంగంలో నాలుగు పదుల వయసు దాటగానే ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఎంతో కష్టమైన విషయం. అలాంటిది టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి (70 ఏళ్లు), అక్కినేని నాగార్జున (66 ఏళ్లు), నందమూరి బాలకృష్ణ (66 ఏళ్లు), విక్టరీ వెంకటేష్ (65 ఏళ్లు) ఇప్పటికీ యంగ్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను ఎలా అలరిస్తున్నారో.. సరిగ్గా అదే స్థాయిలో విజయశాంతి కూడా తన అందం, ఆరోగ్యం, గ్రేస్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. తన సహచర కథానాయకులకు ఏమాత్రం తీసిపోని గ్లామర్, ఫిట్‌నెస్‌తో నేటికీ ఎవర్‌గ్రీన్ స్టార్‌గా మెరిసిపోతున్నారు. సమీరా రెడ్డి, నివేదా థామస్ లాంటి జనరేషన్ స్టార్స్ ప్రారంభ రూపాన్ని చివరివరకూ కాపాడుకోవడంలో విఫలమయ్యారు. నేటి జెన్ జి నటీమణుల్లోను చాలా మంది ఫిజికల్ ఛేంజెస్ కారణంగా కెరీర్ ని కోల్పోయారు. కానీ మేటి సీనియర్ కథానాయిక విజయశాంతి ఎప్పటికీ అదే ఫిట్ నెస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
చెన్నైలో జన్మించి తెలుగు సినిమా ప్రయాణాన్ని ప్రారంభించిన విజయశాంతి.. పలు భాషల్లో ఏకంగా 187కు పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా.. హీరోలతో సమానమైన మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఏకైక నటిగా ఖ్యాతి ఘడించారు. ముఖ్యంగా `కర్తవ్యం` చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా.. `ఓసేయ్ రాములమ్మ`గా విప్లవాత్మక పాత్రతో తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత రాజకీయ నాయకురాలిగా ప్రజాక్షేత్రంలోనూ తన గళాన్ని వినిపించారు.
ఇటీవల పాల్గొన్న ఒక కార్యక్రమంలో విజయశాంతి ఛామింగ్ రూపంపై బోలెడంత చర్చ సాగుతోంది. వెటరన్ నటి ప్రసంగిస్తూ తన హుందాతనంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా యాంకర్ మున్ముందు కూడా సినిమాలో నటిస్తారా? అని ప్రశ్నించగా..తన రీ-ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``నాకు తగిన మంచి కథ, నటనకు ప్రాధాన్యమున్న బలమైన పాత్ర .. ప్రతిభావంతుడైన దర్శకుడు కుదిరితేనే మళ్లీ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను`` అని స్పష్టం చేశారు. కేవలం పాత్రల కోసం కాకుండా.. తన ఇమేజ్‌కు తగిన ప్రాజెక్ట్‌లను మాత్రమే ఎంచుకుంటానని తేల్చి చెప్పారు.
సినిమా పరిశ్రమలో ఒక శకం ముగిసినా.. తన నటన , వ్యక్తిత్వంతో లక్షలాది మంది అభిమానులకు నిత్య స్ఫూర్తిగా నిలుస్తున్నారు విజయశాంతి. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని తన క్రమశిక్షణ, జీవనశైలితో నిరూపిస్తున్న ఈ `రాములమ్మ`.. మునుముందు రోజుల్లో మరో సరికొత్త, పవర్ ఫుల్ పాత్రతో వెండితెరపై కనిపించి అలరించాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు.
