నటుడు ఇంటి నుంచి పారిపోయిన బాధలో డిప్రెషన్?
చాలా చిన్న వయసలోనే తన ఇంటిని వదలిపెట్టి ముంబైకి వెళ్లిపోయానని బహిరంగంగా వెల్లడించింది క్వీన్ కంగన రనౌత్.
By: Sivaji Kontham | 9 Nov 2025 9:15 PM ISTచాలా చిన్న వయసలోనే తన ఇంటిని వదలిపెట్టి ముంబైకి వెళ్లిపోయానని బహిరంగంగా వెల్లడించింది క్వీన్ కంగన రనౌత్. కళారంగంలోకి వెళ్లే చాలా మంది ఇదే బాపతు. కానీ బయటపడేవారు కొద్ది మందే. ఇంట్లో అనుమతి లేకుండా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తుంటారు. స్టార్ అవ్వాలని కలలు కంటారు. కానీ అవి నిజమయ్యేది ఏ కొందరికో. ఈ రంగంలో కేవలం 5శాతం మందికి మాత్రమే సరైన అవకాశాలుంటాయి. అయితే ఇటీవల ఓటీటీ డిజిటల్ వేదికల రాకతో అంతా మారిపోయింది. ప్రతిభావంతులైన కళాకారులు, సాంకేతిక నిపుణులకు కావాల్సినన్ని అవకాశాలున్నాయి. కానీ వాటిని తెలివితేటలు చొరవతో ఒడిసిపట్టుకోవడం చాలా ముఖ్యం.
ఇప్పుడు కంగన తరహాలోనే నటుడు విజయ్ వర్మ కూడా తాను ఇంటి నుంచి పారిపోయిన అపరాధ భావన కారణంగా తీవ్ర డిప్రెషన్ ని అనుభవించానని చెప్పాడు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నానని, తమ ఇంటి టెర్రాస్ మీదకు వెళ్లి వెలుగును చూసినప్పుడు మాత్రమే దాని నుంచి బయటపడ్డానని విజయ్ వర్మ చెప్పాడు. ఇదంతా మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాతో ప్రేమాయణం మొదలు కాక మునుపటి వ్యవహారం.
అయితే తాను డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అమీర్ ఖాన్ కుమార్తె ఇరాఖాన్ సహకరించారని తెలిపారు. అప్పట్లో `దహద్` షూటింగ్ జరుగుతోంది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీనికి నిర్మాత. ఆ సమయంలో ఇరా ఖాన్ సెట్లో తనకు సహాయసహకారాలు అందించేవారు. అదే సమయంలో డిప్రెషన్ కి చికిత్స తీసుకోవాలని ఇరా సూచించగా, వెంటనే విజయ్ వర్మ మంచి కౌన్సిలర్ ని కలిసారు. అది తనకు చాలా సహకరించిందని చెప్పాడు విజయ్ వర్మ.
ఇదంతా ఎందుకు? ఇంటి నుంచి పారిపోయి వచ్చినందుకు.. ఆ అపరాధ భావన మస్తిష్కంలో అలానే ఉండిపోయింది. అది మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని విజయ్ వర్మ అన్నారు. యోగా, ధ్యానంతో కొంత మెరుగయ్యాను. యోగా మ్యాట్ పై పడతాను.. సూర్య నమస్కారాలు ఐదు కూడా చేయలేను. గంటల తరబడి మ్యాట్ పైనే ఏడుస్తాను. ఇదంతా శూన్యత వల్లనే. ఒంటరిగా ఇంట్లో ఒకే చోట కూచోవద్దని ఇరా చెప్పిందని కూడా విజయ్ వర్మ వెల్లడించాడు.
విజయ్ వర్మ డిప్రెషన్ తో పోరాడుతున్న తీరును మరింత డెప్త్ తో బయటపెట్టారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో డిప్రెషన్ తో పోరాడాననని, ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా, భయంగా ఉన్నానని తెలిపాడు. ఆకాశాన్ని చూడగలిగే ప్రకృతితో కనెక్ట్ అయ్యే చిన్న టెర్రస్ తనను కాపాడిందని, అది లేకుంటే తాను పిచ్చివాడిని అయ్యేవాడినని విజయ్ వర్మ అన్నారు. ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తనకు సహాయం చేసినందుకు విజయ్ వర్మ కృతజ్ఞతలు తెలిపాడు.
రియా చక్రవర్తి పాడ్‌కాస్ట్‌లో విజయ్ ఈ విషయాలను బహిర్గతం చేసాడు. దాహద్ షూటింగ్ సమయంలో ఇరాఖాన్, గుల్షన్ దేవయ్య నాకు సహాయం చేసారు. మేమంతా మంచి స్నేహితులం అయ్యాము. జూమ్ వీడియో కాల్స్ లో మాట్లాడుకునేవాళ్లం. విందులు చేసుకునేవాళ్లం! అని గుర్తు చేసుకున్నాడు విజయ్ వర్మ. నాకు తీవ్రమైన డిప్రెషన్ , ఆందోళన ఉన్నట్లు నిర్ధారణ అయింది. నా థెరపిస్ట్ మందులు కూడా రాసాడు. వైద్యం కోసం థెరపీ , యోగా వైపు మొగ్గు చూపాను. ఇవి అన్నిటినీ బయటకి తెచ్చాయి. నేను నా యోగా మ్యాట్ మీద పడేవాడిని.. మూడవ లేదా నాల్గవ సూర్య నమస్కారం చేసేప్పటికి కుప్పకూలిపోయేవాడిని.. ఎందుకో తెలియకుండానే గంటల తరబడి ఏడుస్తాను. అది లోతైన డిప్రెషన్... ఏవో భావోద్వేగాలు .. పరిష్కారం లేని అపరాధభావంతో పుట్టుకొచ్చిన ఆవేదన! అని గమనించినట్టు విజయ్ చెప్పాడు.
ఇల్లు వదిలి వెళ్లిపోవడం చింతను పెంచింది. ఒక వ్యక్తి వెళ్లిపోయినప్పుడు కుటుంబం వారిని మిస్ అవుతుందని, అతడు తాను వెళ్లిన మార్గంలో ఎప్పుడూ శాంతించలేడని వివరించాడు. కొన్నిసార్లు తన నిర్ణయం తనకు సరైనదే అనిపించినా, మిగిలినవారికి నిజంగా సరైనదే అనిపిస్తుందా? అని ఇప్పటికీ ఆలోచిస్తానని అన్నాడు. మనలో చాలా చిన్నప్పటి బాధలు అంతర్లీనంగా మస్తిష్కంలో ఉండిపోతాయని వాటిని క్లియర్ చేసుకోవాలని కూడా విజయ్ చెప్పారు.
