Begin typing your search above and press return to search.

విజయ్ ఎన్నికల ఫలితాలు.. రాజా గారి సడన్ సర్ ప్రైజ్!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి స్థాపించిన టీవీకే పార్టీ ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా దూసుకుపోతుండటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది

By:  M Prashanth   |   4 May 2026 1:12 PM IST
విజయ్ ఎన్నికల ఫలితాలు.. రాజా గారి సడన్ సర్ ప్రైజ్!
X

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి స్థాపించిన టీవీకే పార్టీ ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా దూసుకుపోతుండటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత నుంచే పలుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న టీవీకే.. ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు గట్టి పోటీ ఇస్తోందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఫలితాలు నమోదవుతుండటం విశేషం. కొన్ని సర్వేలు 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పగా, ప్రస్తుత ట్రెండ్స్ కూడా అదే దిశగా కదులుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా యూత్ ఓటర్లు పెద్ద ఎత్తున విజయ్ వైపు మొగ్గు చూపినట్టు టాక్ వినిపిస్తోంది. చాలా ఏళ్లగా రాష్ట్ర రాజకీయాల్లో డామినేషన్ చూపిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ఇది పెద్ద సవాల్‌ గా మారుతోంది.

అయితే అదే సమయంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరు ఇప్పుడు రాజకీయ చర్చలోకి రావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఫలితాల ముందు ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. విజయ్ చిన్నప్పుడు నటించిన సినిమా ఇదు ఎంగల్ నీదిలోని ఒక పాటను ఆయన రీసెంట్ గా నెట్టింట షేర్ చేయడం చర్చకు దారి తీసింది.

1988లో విడుదలైన ఆ చిత్రానికి ఇళయరాజానే సంగీతం అందించారు. ఆ సినిమాలో చైల్డ్ యాక్టర్ గా విజయ్ కనిపించారు. తాజాగా షేర్ చేసిన పాటలోని చిన్న తంబి.. ఉన్నై నంబి ఈ నాడు.. అనే లైన్ ఇప్పుడు ప్రత్యేకంగా వైరల్ అవుతోంది. దీనికి అర్థం చిన్న తమ్ముడా.. ఈ రాష్ట్రం నిన్నే నమ్మి ఎదురు చూస్తోంది అనే విధంగా ఉండటంతో, విజయ్ కు ఇళయరాజా పరోక్ష మద్దతు ప్రకటించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆ విషయంపై ఇళయరాజా అధికారికంగా ఎలాంటి రాజకీయ ప్రకటన చేయలేదు. ఆయన ఆ పాటను షేర్ చేయడం కేవలం ఓ సినీ మెమరీనా? లేక సపోర్ట్ చేస్తున్నట్లు సిగ్నలా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆయనను 2022లో రాజ్యసభకు నామినేట్ చేసిన కేంద్ర ప్రభుత్వం నేపథ్యంలో ఆ పోస్ట్‌ కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

రాజకీయంగా కొత్త అయినప్పటికీ, విజయ్ ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని అంతా భావిస్తున్నారు. సినిమా ద్వారా సంపాదించిన ఇమేజ్, యూత్ ఉన్న క్రేజ్, సూపర్ ఫ్యాన్ బేస్, సామాజిక అంశాలపై చేసిన వ్యాఖ్యలు అన్నీ కలిపి ఆయనకు రాజకీయంగా స్ట్రెంత్ గా మారినట్లు తెలుస్తోంది. ఇక రిజల్ట్స్ కంప్లీట్ గా బయటకు వచ్చిన తర్వాత తమిళనాడులో విజయ్ కింగ్ అవుతారా? లేక కింగ్‌ మేకర్ గా నిలుస్తారా? అన్నది క్లియర్ గా తెలుస్తోంది అయితే 2026 తమిళనాడు ఎన్నికల సందర్భంగా సినిమా- రాజకీయాల మధ్య ఉన్న స్ట్రాంగ్ రిలేషన్ మరోసారి వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఏదేమైనా ఇళయరాజా విజయ్ కు ఏమైనా సపోర్ట్ చేస్తారేమో వేచి చూడాలి.