Begin typing your search above and press return to search.

ఆరోజు ఆ అవమానమే నేడు ద‌ళ‌ప‌తి విజయ్‌ను ముఖ్య‌మంత్రిని చేసిందా?

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక నటుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం కొత్తేమీ కాకపోయినా.. దళపతి విజయ్ రాజకీయ ప్రస్థానం వెనుక ఒక బలమైన గాయం.. అంతకు మించిన కసి కనిపిస్తాయి.

By:  Sivaji Kontham   |   10 May 2026 12:07 PM IST
ఆరోజు ఆ అవమానమే నేడు ద‌ళ‌ప‌తి విజయ్‌ను ముఖ్య‌మంత్రిని చేసిందా?
X

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక నటుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం కొత్తేమీ కాకపోయినా.. దళపతి విజయ్ రాజకీయ ప్రస్థానం వెనుక ఒక బలమైన గాయం.. అంతకు మించిన కసి కనిపిస్తాయి. 2013లో `తలైవా` సినిమా విడుదల సమయంలో నాటి ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం నుండి ఆయన ఎదుర్కొన్న అడ్డంకులు సామాన్యమైనవి కావు. ఆ చిత్రానికి `టైమ్ టు లీడ్` అనే ట్యాగ్‌లైన్ పెట్టడం వల్ల అది రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. కేవలం ఒక సినిమా ట్యాగ్‌లైన్ చూసి ప్రభుత్వం భయపడటం... భద్రత సాకుతో సినిమా విడుదలను నిలిపివేయడం విజయ్‌ను తీవ్రంగా కలిచివేసింది. ఆనాడు జయలలిత వేసిన ఆ రాజకీయ దెబ్బే నేడు విజయ్‌లో సీఎం కావాలన్న కసిని మ‌రింత‌గా పెంచిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అవమానం నుండే అసాధారణమైన పట్టుదల పుడుతుందని విజయ్ నిరూపించారు. `తలైవా` వివాదం సమయంలో ఆ సినిమాను రక్షించుకోవడానికి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోసం విజయ్ గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం.. చివరికి జ‌య‌ల‌లిత అపాయింట్‌మెంట్ నిరాకరించడం అత‌డికి వ్యక్తిగత అవమానంగా మిగిలిపోయింది. తన సినిమాను విడుదల చేయాలని ఒక వీడియో సందేశం ద్వారా అప్పటి ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన పరిస్థితి కల్పించడం విజయ్‌లో ఒక ఆలోచనను రేకెత్తించింది. అధికార బలం చేతిలో లేకపోతే వ్యవస్థలో ఎన్ని మార్పులు కోరుకున్నా అవి సాధ్యం కావని.. వ్యవస్థను మార్చాలంటే ఆ వ్యవస్థలో భాగం కావాలని అత‌డికి ఆనాడే అర్థమైంది.

జయలలిత ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు విజయ్‌కు తనకున్న ప్రజా బలాన్ని గుర్తుచేశాయి. ప్రభుత్వం సినిమాను అడ్డుకున్న కొద్దీ... అభిమానుల నుండి సానుభూతి.. మద్దతు వెల్లువలా పెరిగింది. తనకున్న `మాస్ ఫాలోయింగ్` కేవలం బాక్సాఫీస్ వసూళ్లకే పరిమితం కాదని... దానిని ఒక సామాజిక శ్రేయస్సు కోసం వాడితే అది తిరుగులేని రాజకీయ శక్తిగా మారుతుందని ఆయన గ్రహించారు. జయలలిత వంటి ఉద్దండురాలు తనను లక్ష్యంగా చేసుకున్నారంటే... తనలో ఆ స్థాయి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని జ‌య‌ల‌లిత‌ గుర్తించారనే విషయాన్ని విజయ్ సానుకూలంగా మలుచుకున్నారు. ఆ గుర్తింపు ఇచ్చిన ధైర్యమే నేడు ఆయన్ని ప్రజల ముందుకు నడిపిస్తోంది.

ఈ సంఘర్షణ విజయ్‌ను ఒక వ్యూహాత్మక రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దింది. అప్పటి వేధింపుల తర్వాతే ఆయన తన అభిమాన సంఘాలను `విజయ్ మక్కల్ ఇయక్కమ్` (వీఎంఐ) పేరుతో ఒక క్రమశిక్షణ కలిగిన రాజకీయ కేడర్‌గా మార్చారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా చిత్తు చేయాలో జయలలిత హయాంలోనే అత‌డు నేర్చుకున్నారు. అందుకే ఇప్పుడు ఏ ఇతర సినీ నటుడిలానో కాకుండా... చాలా నిశ్శబ్దంగా తన బలాన్ని పెంచుకుని.. పక్కా ప్లానింగ్‌తో `తమిళగ వెట్రి కళగం` (టీవీకే) పార్టీని స్థాపించారు. గతంలో ఎదుర్కొన్న అవమానాలే అత‌డికి రాజకీయ పాఠాలుగా మారి.. తడబడకుండా అడుగులు వేసేలా చేస్తున్నాయి.

విజయ్ రాజకీయ ప్రస్థానానికి జయలలిత హయాంలో జరిగిన నాటి `తలైవా` వివాదమే ప్రధాన ప్రేరణ. ఏ రంగంలోనైనా ఎదురుదెబ్బలు తగిలినప్పుడే మనిషి మరింత పట్టుదలతో పోరాడుతాడు. విజయ్ విషయంలో కూడా అదే జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోసం వేచి చూసిన అదే విజయ్.. నేడు స్వయంగా ముఖ్యమంత్రి పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. నాటి అవమానం నేడు తమిళనాట ఒక నవ నాయకుడిని సృష్టించింది. ఒకప్పుడు సినిమా తెరపై కనిపించిన `టైమ్ టు లీడ్‌` అనే ట్యాగ్‌లైన్ నేడు విజయ్ రాజకీయ జీవితంలో కార్యరూపం దాల్చడం ఒక చారిత్రక పరిణామం.

అవమానించిన చోటే అధికారం!

ఈరోజు అవమానించిన చోటే విజయ్ అధికారం చేపట్టనున్నారని ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌గా మారింది. సినిమా వందేళ్ల వేడుక‌లో జ‌రిగిన అవ‌మానానికి ఇదే స‌రైన జ‌వాబు. ఇవాళ అదే వేదికపై దళపతి సీఎంగా ప్రమాణం చేయ‌డంతో అభిమానుల్లో భావోద్వేగం వెల్లువెత్తింది.