Begin typing your search above and press return to search.

రాజ‌కీయ పార్టీ పెట్టి 10 పెద్ద దెబ్బ‌లు తిన్న స్టార్ హీరో

అయితే.. తాజా సమాచారం ప్రకారం ఆమె విడాకుల కోసం అధికారికంగా దరఖాస్తు చేయడం విజయ్ రాజకీయ ప్రతిష్టపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది.

By:  Sivaji Kontham   |   13 March 2026 11:00 PM IST
రాజ‌కీయ పార్టీ పెట్టి 10 పెద్ద దెబ్బ‌లు తిన్న స్టార్ హీరో
X

తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని `ఇలయ దళపతి`గా వెలుగొందుతున్న విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వేళ అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. `తమిళగ వెట్రి కజగం` (టీవీకే) పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకిన ఆయనకు ప్రస్తుతం కాలం కలిసిరావడం లేదనిపిస్తోంది. అటు సినిమా కెరీర్, ఇటు వ్యక్తిగత జీవితం, మరోవైపు రాజకీయ భవిష్యత్తు.. ఇలా మూడు రంగాల్లో విజయ్ వరుసగా పది గట్టి దెబ్బలు తిన్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన తాజా చిత్రం `జననాయగన్`' చుట్టూ ముసురుతున్న వివాదాలు దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తుండ‌గా, భార్య సంగీత‌ సోర్న‌లింగం విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌డం, కుమారుడు జాస‌న్ విజ‌య్ కి దూరంగా త‌న త‌ల్లితో ఉండ‌టం కూడా ఎమోష‌న‌ల్ బ్లాకేజీకి కార‌ణ‌మైంద‌ని విశ్లేషిస్తున్నారు.

విజయ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా భావించిన `జననాయగన్` విడుదలకు నోచుకోకపోవడం ఆయనకు తగిలిన మొదటి పెద్ద దెబ్బ. ఈ సినిమా విడుదలపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో తన డీల్‌ను రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ ధరతో కుదుర్చుకున్న ఈ ఓటీటీ ఒప్పందం క్యాన్సిల్ అవ్వడం వల్ల నిర్మాతలకు ఆర్థికంగానే కాకుండా, హీరోగా విజయ్ బ్రాండ్ ఇమేజ్‌కు కూడా గట్టి దెబ్బ తగిలింది. సినిమాలు పూర్తిస్థాయిలో మానేసి రాజకీయాల్లోకి వెళ్తున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు ఆయనకు తీవ్ర‌ నష్టం కలిగిస్తున్నాయి.

కేవలం వృత్తిపరమైన సమస్యలే కాకుండా.. వ్యక్తిగత జీవితంలో విజయ్ ఎదుర్కొంటున్న సంక్షోభం ఆయనను మానసిక వేదనకు గురిచేస్తోంది. గత కొంతకాలంగా విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో షికారు చేస్తున్నాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఆమె విడాకుల కోసం అధికారికంగా దరఖాస్తు చేయడం విజయ్ రాజకీయ ప్రతిష్టపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. క్రమశిక్షణ, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే తమిళ రాజకీయాల్లో ఈ విడాకుల వ్యవహారం ప్రత్యర్థులకు ఆయుధంగా మారే అవకాశం ఉంది.

ఈ కుటుంబ కలహాల ప్రభావం విజయ్ పిల్లలపై కూడా పడటం మరో భావోద్వేగ దెబ్బగా మారింది. తన కుమారుడు సంజయ్ ప్రస్తుతం తల్లి వైపు నిలబడటం విజయ్‌ను ఒంటరిని చేసింది. తండ్రి రాజకీయ వారసుడిగా రావాల్సిన కుమారుడు దూరంగా ఉండటం.. మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో ఉన్న ఒక `ప్రియురాలిని` పెళ్లాడలేక.. విడాకుల సమస్యను తేల్చలేక డైలమాలో ఉండటం ఆయనను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇవన్నీ ఒకవైపు అయితే సినిమాలకు దూరమవ్వడం వల్ల రావాల్సిన భారీ పారితోషికాలు నిలిచిపోవడం ఆర్థికంగానూ దెబ్బేనని చెప్పాలి.

రాజకీయ రంగంలో విజయ్ అడుగులు కూడా ఆశించినంత సాఫీగా సాగడం లేదు. పార్టీ పెట్టిన కొత్తలో ఉన్న జోష్, క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురయ్యేసరికి తగ్గుతూ వస్తోంది. అప్ప‌ట్లో నిర్వహించిన రాజకీయ సభలో జరిగిన తొక్కిసలాట.. అందులో ప్రాణాలు కోల్పోయిన మృతుల ఘటన విజయ్ రాజకీయ ప్రయాణంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. దీనిని `పాప పరిహారం`గా భావిస్తూ ఆయన తీవ్ర విచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా ఎదురవుతున్న ఈ రాజకీయ ఎదురుదెబ్బలు ఆయన క్యాడర్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి.

మొత్తానికి స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన దళపతి విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ఆరంభ ద‌శ‌లోనే పది పెద్ద దెబ్బలతో ప్రారంభించాల్సి వచ్చింది. అటు `జననాయగన్` ఓటీటీ డీల్ రద్దు కావడం నుండి.. ఇటు విడాకుల వివాదం వరకు అన్నీ ఆయనకు వ్యతిరేకంగా మారుతున్నాయి. ఈ సంక్షోభం నుండి విజయ్ ఎలా గట్టెక్కుతారు? తన రాజకీయ ప్రయాణాన్ని తిరిగి ఎలా ట్రాక్ లోకి తెచ్చుకుంటారు? అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక యోధుడిలా ఈ దెబ్బలన్నిటినీ తట్టుకుని ఆయన నిలబడతారో లేదో కాలమే నిర్ణయించాలి.