దళపతి విజయ్ కొడుకుపై విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇండస్ట్రీ జాసన్ వెంటే!
తాను అసలు ఆ కాల్‌ని అస్సలు ఊహించలేదని.. విజయ్ లాంటి పెద్ద సూపర్‌స్టార్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం తనకెంతో ఆశ్చర్యకరంగా అనిపించిందని విజయ్ సేతుపతి తెలిపారు.
By: Sivaji Kontham | 19 Sept 2026 11:24 AM ISTతమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తాజాగా పాల్గొన్న ఒక ఈవెంట్‌లో దళపతి విజయ్ కుమారుడు, యువ దర్శకుడు జాసన్ సంజయ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. జాసన్ సంజయ్ పుట్టినరోజు సందర్భంగా తాను అతడికి శుభాకాంక్షలు తెలిపానని.. ఆ తర్వాత కోలీవుడ్ బాద్షా దళపతి విజయ్ స్వయంగా తనకు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పారని విజయ్ సేతుపతి వెల్లడించారు. ``నన్బా, చాలా ధన్యవాదాలు. వాడు చాలా సంతోషంగా ఉన్నాడు`` అంటూ విజయ్ తనతో మాట్లాడినట్లు సేతుపతి గుర్తుచేసుకున్నారు.
తాను అసలు ఆ కాల్‌ని అస్సలు ఊహించలేదని.. విజయ్ లాంటి పెద్ద సూపర్‌స్టార్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం తనకెంతో ఆశ్చర్యకరంగా అనిపించిందని విజయ్ సేతుపతి తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ తో తాను సరదాగా ``ఏంట్రా, మీ ఇంట్లోనే అంత పెద్ద హీరోని పెట్టుకుని..`` అని వ్యాఖ్యానించానని తెలిపారు. జాసన్ సంజయ్ చాలా మంచి కుర్రాడనీ.. అతనంటే తనకు చాలా ఇష్టమని.. షూటింగ్ సెట్‌కు వెళ్లి ఒక గంటపాటు అతడితో గడిపానని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం `సిగ్మా` ఆడియో లాంచ్.. వారి ఈవెంట్ ఒకే సమయంలో జరుగుతున్నాయని.. ఆ సినిమా కూడా తమతో పాటు వస్తోందని ఆయన తెలిపారు. జాసన్ సంజయ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై కోలీవుడ్ వర్గాల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఫన్, హాస్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అందరినీ ఆకట్టుకునేలా సాగింది.
జాసన్ సంజయ్ వర్కింగ్ శైలి, ఆలోచనలు పూర్తిగా జెన్ జీ తరహాకు దగ్గరగా ఉన్నాయి. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తహాలోనే దర్శకుడిగా అతడు కూడా సక్సెస్ అవుతాడని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ముఖ్యంగా తమిళ సినీపరిశ్రమ దిగ్గజాలంతా జాసన్ సంజయ్‌కి అండగా నిలుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మొత్తం తమిళ సినీ పరిశ్రమ దళపతి విజయ్ వెంటే ఉండటంతో పాటు అతడి వారసుడిని ఆదరించడం ప్రస్తుతం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అతడికి రాజకీయంగా అండగా ఉన్న పరిశ్రమ ఇప్పుడు అతడి కొడుకును కూడా ఒక పెద్ద దర్శకుడిగా చూడాలని కోరుకుంటోంది. మరి జాసన్ సంజయ్ ఫేట్ ఎలా ఉండబోతుందో కాలమే నిర్ణయించాలి. ఇక ఈ సినిమాతో తమిళంలో తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్న తెలుగు కుర్రాడు సందీప్ కిషన్ కూడా మంచి విజయం అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
