Begin typing your search above and press return to search.

ఓటీటీ గేమ్‌లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం? సీఎం విజ‌య్‌ని కోరిన విజయ్

గతంలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఇలాంటి ప్రతిపాదననే చేశారని గుర్తుచేసిన విజయ్ సేతుపతి.. ప్రస్తుత డిజిటల్ మార్కెట్ పరిస్థితుల్లో చిన్న సినిమాలను బతికించుకోవడానికి ఇదొక్కటే మార్గమని స్పష్టం చేశారు.

By:  Sivaji Kontham   |   25 May 2026 5:00 AM IST
ఓటీటీ గేమ్‌లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం? సీఎం విజ‌య్‌ని కోరిన విజయ్
X

మలయాళ చిత్ర పరిశ్రమకు పోటీగా తమిళ చలనచిత్ర రంగాన్ని (కోలీవుడ్) మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో విల‌క్ష‌ణ‌ నటుడు విజయ్ సేతుపతి.. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) సార‌థ్యంలోని ప్రభుత్వానికి ఒక ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రభుత్వం సొంతంగా ఒక ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని ఆయన కోరారు. గతంలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఇలాంటి ప్రతిపాదననే చేశారని గుర్తుచేసిన విజయ్ సేతుపతి.. ప్రస్తుత డిజిటల్ మార్కెట్ పరిస్థితుల్లో చిన్న సినిమాలను బతికించుకోవడానికి ఇదొక్కటే మార్గమని స్పష్టం చేశారు.

ఒకప్పుడు కరోనా సమయంలో విపరీతమైన వృద్ధిని చూసిన ఓటీటీ లు, ప్రస్తుతం మార్కెట్లో తీవ్రమైన క్రైసిస్ ను ) ఎదుర్కొంటున్నాయని విజయ్ సేతుపతి విశ్లేషించారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి కార్పొరేట్ ఓటీటీ సంస్థలు కేవలం స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలను లేదా పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల కంటెంట్‌ను కొనడానికే మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల కథాబలం ఉండి.. బడ్జెట్ లేని చిన్న చిత్రాల నిర్మాతలు డిజిటల్ రైట్స్ అమ్ముకోలేక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని.. వారి పాలిట ఓటీటీ మార్కెట్ ఇప్పుడు శూన్యంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం గనుక సొంతంగా ఒక అధికారిక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొస్తే... అది చిన్న -మధ్యతరహా చిత్రాల నిర్మాతలకు ఒక పెద్ద వరంగా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కేరళ ప్రభుత్వం భారతదేశంలోనే మొదటిసారిగా C-స్పేస్ పేరుతో ప్రభుత్వ ఓటీటీని ప్రారంభించి వినూత్న ప్రయోగానికి తెరలేపింది. అదే బాటలో తమిళనాడు కూడా నడిస్తే.. కార్పొరేట్ ఓటీటీల గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేయవచ్చని.. ఎలాంటి స్టార్ వాల్యూ లేకపోయినా కేవలం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా తగిన గుర్తింపు, ఆదాయం లభిస్తాయని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీ నుంచే వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్ (సీఎం విజయ్)కి పరిశ్రమ పడుతున్న ఇబ్బందులపై పూర్తి అవగాహన ఉంది. కాబట్టి విజయ్ సేతుపతి చేసిన ఈ విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందిస్తారని కోలీవుడ్ గట్టిగా నమ్ముతోంది. తమిళనాడు ప్రభుత్వ సాయంతో ఈ `స్టేట్ ఓటీటీ` ప్రాజెక్ట్‌ను గనుక కార్యరూపంలోకి తెస్తే అది కేవలం తమిళ సినిమాకే కాకుండా ప్రాంతీయ భాషా చిత్రాలన్నింటికీ ఒక కొత్త దిశా నిర్దేశనం అవుతుంది. మరి ఈ సరికొత్త డిజిటల్ విప్లవానికి సీఎం విజయ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందో లేదో చూడాలి.