రమ్య కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై విజయ్ సేతుపతి ఫస్ట్ రియాక్షన్
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వ సాధారణం అనేది చాలా మంది అభిప్రాయం.
By: Ramesh Palla | 31 July 2025 11:25 AM ISTసినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వ సాధారణం అనేది చాలా మంది అభిప్రాయం. ఎప్పుడూ ఈ విషయం గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. సీనియర్ హీరోయిన్స్ ఏదో ఒక సమయంలో తాము కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నట్లు చెబుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద స్టార్స్ పేర్లను మాత్రం ఎవరూ చెప్పలేదు, కానీ ఇటీవల తమిళ సినిమా ఇండస్ట్రీని కుదిపేసే విధంగా స్టార్ నటుడు విజయ్ సేతుపతిపై రమ్య అనే మహిళ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె తన స్నేహితురాలు కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొందని, ప్రస్తుతం తాను రిహాబిలేషన్ సెంటర్‌లో కోలుకుంటుందని, ఆమెను విజయ్ సేతుపతి చాలా ఇబ్బంది పెట్టాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది.
ఆ ట్వీట్ వెంటనే డిలీట్
కింది స్థాయి నుంచి వచ్చి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా నిలిచిన విజయ్ సేతుపతి గురించి ఇలాంటి ఆరోపణలు ఏంటి అంటూ చాలా మంది షాక్ అయ్యారు. అయితే ఆ ట్వీట్‌ను కొన్ని నిమిషాల్లోనే సదరు మహిళ డిలీట్ చేసింది. ఆ తర్వాత తన స్నేహితురాలి యొక్క ప్రైవసీ కోసం తాను ఆ పోస్ట్‌ను డిలీట్ చేసినట్లు చెప్పింది. అప్పటికే చాలా మంది ఆ ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీశారు, వీడియోలు చేశారు. విజయ్ సేతుపతికి జరగాల్సిన నష్టం జరిగి పోయింది. ఈ విషయం గురించి విజయ్ సేతుపతి స్పందించాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఈ విషయం గురించి ఏదో ఒకటి మాట్లాడాలి అంటూ చాలా మంది డిమాండ్ చేశారు. దాంతో ఆయన రమ్య ఆరోపణలపై స్పందించాడు.
విజయ్ సేతుపతి ప్రకటన
విజయ్ సేతుపతి ఒక ప్రకటనలో.. ఎవరో చేసిన తప్పుడు ఆరోపణలతో తాను ఏమాత్రం ప్రభావితం కానని అన్నాడు. అలాంటి ఆరోపణలు నా గురించి రావడంతో నవ్వుకున్నాను. నేను ఏంటో నాకు బాగా తెలుసు. ఇలాంటి విషయాలు నన్ను భయపెట్టవు. కానీ ఇలాంటి ఆరోపణల కారణంగా నా ఫ్యామిలీ మెంబర్స్, నా స్నేహితులు కలత చెందారు. నా పై ఇలాంటి ఆరోపణలు రావడంతో వారికి బాధ కలిగింది. నా గురించి వారికి పూర్తిగా తెలుసు కనుక వారూ అర్థం చేసుకుంటారు. ఇది ఒక చౌకబారు పబ్లిసిటీ స్టంట్ అని నేను భావిస్తున్నాను. ఆమె ఫేమ్ కోసం ఇలాంటి ఒక ట్వీట్ చేసిందే తప్ప అందులో ఏమాత్రం వాస్తవం లేదని అన్నాడు. ఇప్పటికే ఆమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. అన్ని విషయాలను పోలీసులు తేల్చుతారనే విశ్వాసం ను విజయ్ సేతుపతి వ్యక్తం చేశారు.
సమగ్ర విచారణ అవసరం
రమ్య చేసిన ట్వీట్ ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు తెర తీసింది. విజయ్ సేతుపతి గురించి ఇలాంటి ఆరోపణలు వినాల్సి వస్తుందని ఊహించలేదని, ఈ విషయం గురించి సీరియస్‌గా తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఆమె కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ఆమె పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు సినీ వర్గాల వారు అంటున్నారు. నేడు విజయ్ సేతుపతి గురించి ఆరోపణలు చేసిన వారు, రేపు మరొక స్టార్ పై మరొకరు ఇలాంటి ఆరోపణలు చేస్తారు. అందుకే ఇలాంటి ఆరోపణలు ఉపేక్షించవద్దని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరో వైపు రమ్య చేసిన ఆరోపణల గురించి, ఆమె స్నేహితురాలి గురించి లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని, ఒక మహిళ అలాంటి వ్యాఖ్యలు చేయడం పబ్లిసిటీ కోసం అనుకోలేమని కొందరు అంటున్నారు. మొత్తానికి విజయ్ సేతుపతి కెరీర్‌లో ఇదో పెద్ద మాయని మచ్చగా అని ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు.
