అందులో అనుకున్నది సాధించలేకపోయా!
అలా నిర్మాతలుగా మారిన వారిలో టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి నేచురల్ స్టార్ నాని వరకు ఎంతో మంది ఉన్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 29 Jan 2026 6:00 PM ISTకాలంతో పాటూ టెక్నాలజీ, టెక్నాలజీకి తగ్గట్టు అన్ని రంగాలు, వాటిలోని జనాలు కూడా పరిగెడుతున్నారు. ఒకసారి గడిచిన కాలం మళ్లీ రాదని, దొరికిన టైమ్ ను, అవకాశాన్ని వాడుకుని కెరీర్లో పైకి ఎదగాలని ప్రతీ ఒక్కరూ ప్రయత్నం చేస్తుంటారు. ఏ రంగంలో అయినా ఇదే జరుగుతుంది. సినీ ఇండస్ట్రీలో కూడా అంతే. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తరహాలో ఫేమ్, క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని అందరూ అనుకుంటారు.
అందుకే నటీనటులు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు ఆ క్రేజ్ తో బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, రకరకాల ఉత్పత్తులను ప్రమోట్ చేసి క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే కొంచెం ధైర్యం చేసి సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి, ఎంతోమందికి ఉపాధి కల్పించి, తమతో పాటూ మరికొందరు పైకి ఎదగాలని చూస్తూంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా మంది నటులు నిర్మాతలుగా మారిన విషయం తెలిసిందే.
హీరోలే కాదు నిర్మాతలు కూడా!
అలా నిర్మాతలుగా మారిన వారిలో టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి నేచురల్ స్టార్ నాని వరకు ఎంతో మంది ఉన్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, రామ్ చరణ్, రానా, మంచు విష్ణు, నితిన్ సొంత బ్యానర్లలో సినిమాలు తీస్తూ నిర్మాతలుగా కూడా తమ అభిరుచిని తెలుపుతుండగా, కోలీవుడ్ లో కూడా పలువురు నటులు నిర్మాతలుగా మారారు. వారిలో టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా ఒకరు.
నిర్మాతగా విజయ్ సేతుపతి
విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి తెలుగు ఆడియన్స్ కు కూడా సురిచితులే. కేవలం కోలీవుడ్ లోనే కాకుండా వివిధ భాషల్లో సినిమాలు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి కూడా తన తోటి హీరోల లాగానే సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, అందులో సినిమాలు నిర్మించి, దాని ద్వారా డబ్బులు సంపాదించి, ఆ డబ్బుతో నలుగురుకి సాయం చేద్దామనుకున్నారట.
జనవరి 30న గాంధీ టాక్స్ రిలీజ్
కానీ విజయ్ సేతుపతి ఏ ముహూర్తాన ఆ నిర్మాణ సంస్థను మొదలుపెట్టారో కానీ దాని ద్వారా తనకు ఆశించిన ఫలితాలు దక్కలేదని రీసెంట్ గా గాంధీ టాక్స్ చిత్ర ప్రమోషన్స్ లో తెలిపారు. విజయ్ సేతుపతి ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థలో సేతుపతి పలు సినిమాలను నిర్మించినప్పటికీ అవి తనకు అనుకున్న రిజల్ట్స్ ను అందించలేదని, అందుకే తాను నిర్మాతగా సక్సెస్ అవలేదని భావిస్తుంటానని ఆయన అన్నారు. ఇక గాంధీ టాక్స్ విషయానికొస్తే, కిషోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అదితి రావు హైదరి, అరవింద్ స్వామి లాంటి భారీ క్యాస్టింగ్ నటించింది. జనవరి 30న గాంధీ టాక్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
