విజయ్ విడాకులు.. రూ.250 కోట్లు అడిగారా? ఇస్తామన్నారా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఆయన కుటుంబ విషయాలపై సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి.
By: M Prashanth | 19 April 2026 8:00 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఆయన కుటుంబ విషయాలపై సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్య సంగీతతో విభేదాలు, విడాకుల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ప్రచారాలకు బలం చేకూరేలా సంగీత కోర్టును ఆశ్రయించారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
విజయ్ నుంచి విడాకులు కోరుతూ సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో కొన్ని రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ ఆమె నిర్ణయం తీసుకున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కేసు విచారణలో భాగంగా ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్ కు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు, ఆ జంట పరస్పర అంగీకారంతో విడిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారని సమాచారం వినిపిస్తోంది. లాయర్ల సమక్షంలో ఇటీవల చర్చలు జరిగినట్లు, విడాకుల ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్థిక పరమైన సెటిల్మెంట్ విషయంలో మాత్రం భేదాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సంగీత తనకు సెటిల్మెంట్ కింద సుమారు రూ.250 కోట్లు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రతిగా విజయ్ సుమారు రూ.35 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కోర్టు విచారణలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అలాగే పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని విజయ్ సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, గతంలో విజయ్ తన కుటుంబ భవిష్యత్తు కోసం భారీ మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం మాత్రం విభిన్నంగా ఉండటంతో అసలు నిజం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. అప్పుడు విజయ్ రూ.250 కోట్ల భరణం ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.
అయితే విజయ్- సంగీత దంపతులు 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు సంతానం ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కలిసి జీవించిన ఆ జంట మధ్య 2023 నుంచి విభేదాలు మొదలయ్యాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు పెళ్లైన 27 ఏళ్ల తర్వాత విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారన్న వార్తలు కోలీవుడ్ లో చర్చకు దారి తీస్తున్నాయి. అయితే ఇప్పటివరకు విజయ్ లేదా సంగీత అధికారికంగా ఆ విషయంపై స్పందించలేదు. అందువల్ల కోర్టు విచారణ తర్వాత అసలు పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
