విజయ్ తో పెళ్లి.. ఎట్టకేలకు రష్మిక ఓపెన్ అయిందిగా!
రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ చిట్ చాట్ లో నేషనల్ క్రష్ పాల్గొనగా.. పలువురు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు ఇచ్చారు.
By: M Prashanth | 9 Nov 2025 1:43 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నలకు ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అక్టోబర్ 3వ తేదీన సింపుల్ గా నిశ్చితార్థ వేడుకలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరువైపుల నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
దీంతో ఫ్యాన్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారోనని.. ఎక్కడ చేసుకుంటారోనని.. ఎప్పుడు ప్రకటిస్తారోనని వెయిట్ చేస్తున్నారు. మ్యారేజ్ కోసం రకరకాల వార్తలు వస్తున్నా.. అటు విజయ్ గానీ.. ఇటు రష్మిక గానీ స్పందించలేదు. కానీ తాజాగా ఓ చిట్ చాట్ లో ఓపెనయ్యారు నేషనల్ క్రష్.
రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ చిట్ చాట్ లో నేషనల్ క్రష్ పాల్గొనగా.. పలువురు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు ఇచ్చారు. ఆ సమయంలో తన లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారో చెప్పాలని ఒక ఫ్యాన్ కోరగా.. రష్మిక నవ్వుతూ దానికి సమాధానమిచ్చారు. యుద్ధంలో తూటాకైనా ఎదురెళ్తానని చెప్పుకొచ్చారు.
ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా తన కోసం నిలబడే జీవిత భాగస్వామి కావాలని అన్నారు. తనను లోతుగా అర్థం చేసుకునే వ్యక్తి అయ్యి ఉండాలని, ప్రతి విషయాన్ని తనవైపు నుంచి ఆలోచిస్తూ అర్థం చేసుకోవాలని చెప్పారు. ఎలాంటి దాన్నైనా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని కోరుకుంటున్నట్లు చెప్పారు.
మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, తన కోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలని తెలిపిన రష్మిక.. అలాంటి భాగస్వామి కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు. అప్పుడే మరో అభిమాని.. ఒకవేళ మీరు డేట్ చేస్తే ఎవరితో చేస్తారని.. పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారని అడగ్గా.. రష్మిక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.
డేట్ చేస్తే యానిమేషన్ క్యారెక్టర్ నరుటోతో చేస్తానని, ఎందుకంటే తనకు నరుటో పాత్ర చాలా ఇష్టమని తెలిపారు. పెళ్లి అంటే విజయ్ ను చేసుకుంటానని చెప్పారు. దీంతో అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ పెద్దగా అరుస్తూ కంగ్రాట్స్ చెప్పారు. అప్పుడు రష్మిక కూడా నవ్వుతూ తనకు విషెస్ చెప్పిన వారిందరికీ థాంక్స్ చెప్పారు.
అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎట్టకేలకు అమ్మడు ఓపెన్ అయ్యారుగా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో విజయ్, రష్మిక పెళ్లి చేసుకుంటారని అనేక మంది అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ లో వివాహం చేసుకోనున్నారని అంటున్నారు. మరి అందులో నిజమెంత అనేది వేచి చూడాలి.
