Begin typing your search above and press return to search.

మరో కథ దగ్గర.. విజయ్, మహేష్!

విజయ్, మహేష్ బాబు పేర్లు ఒకే సినిమా దగ్గర వినిపించడం కొత్త విషయం కాదు.

By:  M Prashanth   |   30 Aug 2026 10:01 AM IST
మరో కథ దగ్గర.. విజయ్, మహేష్!
X

విజయ్, మహేష్ బాబు పేర్లు ఒకే సినిమా దగ్గర వినిపించడం కొత్త విషయం కాదు. దాదాపు 15 ఏళ్ల క్రితమే మణిరత్నం ఈ ఇద్దరినీ ఒకే చిత్రంలో తీసుకురావాలని ప్రయత్నించారు. అప్పట్లో ఆయన ‘పొన్నియిన్ సెల్వన్’ను తెరకెక్కించాలని అనుకున్నప్పుడు విజయ్, మహేష్‌లను మెయిన్ పాత్రలకు అనుకున్నారు. ఇద్దరితో ఫొటోషూట్ కూడా జరిగింది. కానీ చివరి దశలో ఆ సినిమా ఆగిపోయింది.

ఆ సమయంలో అనుకున్న ‘పొన్నియిన్ సెల్వన్’ ముందుకు వెళ్లి ఉంటే విజయ్, మహేష్ ఒకే సినిమాలో కనిపించేవారు. చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం అదే కథను విక్రమ్, కార్తి, జయం రవి తదితరులతో తెరకెక్కించారు. కానీ మొదట అనుకున్న తారాగణం మాత్రం సినిమా అభిమానుల్లో ఇప్పటికీ అప్పుడప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది.

ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మరోసారి విజయ్, మహేష్ పేర్లు ఒకే కథ దగ్గరికి వచ్చాయి. ఈసారి దర్శకురాలు సుధ కొంగర కారణం. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ఇటీవల చెప్పిన వివరాల ప్రకారం సుధ ఒక కథను ముందుగా విజయ్‌కు వినిపించిందట. అయితే కథను పూర్తిగా సిద్ధం చేయడానికి ఆమెకు మరికొంత సమయం కావాల్సి వచ్చింది.

అదే సమయంలో విజయ్ వరుస సినిమాలతో ముందుకు వెళ్లాల్సి ఉండటంతో ఆ ప్రయత్నం అక్కడితో ఆగిపోయింది. తర్వాత విజయ్ ‘బీస్ట్’కు వెళ్లాడు. అలాగే పాలిటిక్స్ లోకి కూడా వెళ్లడంతో చాన్స్ పోయింది. అయితే సుధ ఆ కథను పక్కన పెట్టలేదు. జీవీ ప్రకాష్ చెప్పిన ప్రకారం అదే కథను తర్వాత మహేష్ బాబుకు కూడా వినిపించింది. కానీ మహేష్‌తో కూడా ఎంతో దూరం వెళ్లలేదు.

కొన్ని మార్పులు చేయాలని చూసినా అప్పటికే మహేష్ మరింత బిజి అయ్యాడు. ప్రస్తుతం వారణాసి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఎవరితో చేస్తారు అనేది ఫైనల్ కాలేదు. ఇక సుధ మళ్ళీ మహేష్ వద్దకు వెళతారా లేదా అనేది కాలమే సమాధానం ఇవ్వాలి. ఇక సుధ ఆ కథను పూర్తిగా వదిలేయలేదని జీవీ ప్రకాష్ చెబుతున్నాడు. భవిష్యత్తులో ఎప్పటికైనా ఆమె దాన్ని సినిమాగా తీసే అవకాశం ఉందట. అప్పుడు హీరోగా ఎవరు వస్తారన్నది చూడాలి.