Begin typing your search above and press return to search.

విజయ్ కి శివన్న పరోక్ష హెచ్చరిక.. తొక్కిసలాట మహిమేనా?

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. "నా స్నేహితుడు , ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాను. అయితే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలని సూచిస్తున్నాను.

By:  Madhu Reddy   |   9 Oct 2025 12:36 PM IST
విజయ్ కి శివన్న పరోక్ష హెచ్చరిక.. తొక్కిసలాట మహిమేనా?
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తమిళనాడు రాజకీయాలలోకి వెళ్లడానికి.. సొంతంగా టీవీకే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే ఎన్నికలలో పార్టీని బలోపేతం చేయడానికి.. ఆయన అధికారంలోకి రావడానికి ఇప్పటినుంచే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పలు బహిరంగ సభలు ఏర్పాటు చేసి.. ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నోసార్లు సభలు ఏర్పాటు చేసిన విజయ్ దళపతి.. ఈసారి కూడా కరూర్ లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించగా.. అక్కడ ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు రావడం, స్థలం సరిపోక తొక్కిసలాట జరగడంతో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. పైగా 100 మందికి గాయాలైనట్లు సమాచారం.

అలా అత్యంత విషాదకరంగా మారిన ఈ కరూర్ ఘటనపై ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కన్నడ సూపర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా స్పందించారు. అయితే ఇక్కడ ఈయన డైరెక్ట్ గా కరూర్ సంఘటన అని ప్రస్తావించక పోయినా.. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొని ఇన్ డైరెక్ట్ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే ఇటీవల తమిళనాడులోని తిరుచెందూర్ లోని సుబ్రమణ్యేశ్వర స్వామి దర్శించుకున్నారు శివరాజ్ కుమార్.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. "నా స్నేహితుడు , ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాను. అయితే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలని సూచిస్తున్నాను. పైగా నాకు తమిళనాడు రాజకీయాల గురించి పూర్తి అవగాహన లేదు. కాబట్టి విజయ్ మరింత జాగ్రత్తగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ తెలిపారు. మొత్తానికైతే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు శివరాజ్ కుమార్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా కరూరు తొక్కిసలాట ఘటనలో దాదాపు 41 మంది ప్రజలు మరణించగా.. సుమారుగా 100 మందికి పైగా ప్రజలు గాయపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విషాదం రాజకీయ ఉద్రిక్తతకి కూడా దారితీసింది. కరూర్ ర్యాలీకి కేవలం 10,000 మందికి మాత్రమే అనుమతి తీసుకున్నప్పటికీ.. అక్కడ ఊహకు మించిన జనాలు రావడంతోనే పోలీసులు వారిని అదుపు చేయలేక తొక్కిసలాట జరిగిందని, ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఇకపోతే మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 20 లక్షలు, గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున విజయ్ పరిహారం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

విజయ్ సినిమా జీవితం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన జననాయగన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదే ఆయన చివరి సినిమా అంటూ కూడా వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మరొకవైపు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.