జన నాయగన్ సంగతేంటి? తెలుగులో ఎవరు కొంటారు?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇప్పుడు జన నాయగన్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 21 Oct 2025 9:45 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇప్పుడు జన నాయగన్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. తాను సినిమాల్లో నటించనని ప్రకటించడంతో ఆయనకు అదే చివరి మూవీ కానుందని చెప్పాలి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్న జన నాయగన్ లో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, గౌతమ్ మీనన్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. ఇప్పటికే రిలీజ్ రూ.250 కోట్లు సాధించిందట మూవీ!
మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు దక్కించుకుందని సమాచారం. శాటిలైట్ హక్కులు సన్ నెట్ వర్క్ రూ. 55 కోట్లకు సొంతం చేసుకుందని వినికిడి. తమిళనాడు థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్రమైన పోటీ నెలకొందని, కానీ రోమియో పిక్చర్స్ సుమారు రూ. 90 కోట్లకు కొనుగోలు చేసిందని వినికిడి.
అయితే తెలుగు సినిమా రైట్స్ సంగతేంటన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. నిజానికి సంక్రాంతికి ఐదు తెలుగు హీరోల చిత్రాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. దీంతో థియేటర్స్ విషయంలో పోటీ తప్పదు. ఇప్పుడు వాటికి తోడు జన నాయగన్ మూవీ వస్తోంది. గతంలో కూడా విజయ్ సినిమాలు సంక్రాంతి టైమ్ లో వచ్చాయి.
ఆ సమయంలో ఏం జరిగిందో తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అప్పుడు విజయ్ సినిమాలను రిలీజ్ చేశారు. కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నెగిటివిటీ అయితే బీభత్సంగా వచ్చింది. దీంతో ఈసారి జన నాయగన్ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఎవరు కొనుగోలు చేస్తారనేది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
దానికి తోడు విజయ్ సినిమాల హక్కుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మన బాలయ్య నటించిన సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరి రీమేక్ గా జన నాయగన్ మూవీ రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య కోలీవుడ్ నటుడు వీటీవీ గణేష్ కూడా ఓ సినీ కార్యక్రమంలో అదే విషయాన్ని లీక్ చేశారు.
దీంతో తెలుగు సినిమాను రీమేక్ చేసి.. మార్పులు చేర్పులు చేసి.. మళ్లీ మనకే మూవీ చూపిస్తారా అని కచ్చితంగా అనేక మంది ఆడియన్స్ నుంచి క్వశ్చన్ లు వస్తాయి. మన ఒరిజినల్ మూవీస్ కు కాకుండా డబ్బింగ్ చిత్రాలు థియేటర్స్ కేటాయిస్తే మళ్లీ పాత సీనే రిపీట్ అవుతుంది. మరి జన నాయగన్ తెలుగు రైట్స్ విషయంలో ఏం జరుగుతుందో..
