Begin typing your search above and press return to search.

'జననాయగన్' లీక్.. అసలు దోంగ దొరికాడు!

ఇది ఎక్కడో బయట జరిగింది కాదు, సాక్షాత్తూ ఎడిటింగ్ స్టూడియోలోనే జరిగిన దొంగతనం అని తేలడం ఇప్పుడు సంచలనంగా మారింది.

By:  M Prashanth   |   17 April 2026 10:26 AM IST
జననాయగన్ లీక్.. అసలు దోంగ దొరికాడు!
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రంగా వస్తున్న 'జననాయగన్' లీక్ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. సినిమా ఇంకా థియేటర్ల వరకు రాకముందే నెట్టింట దర్శనమివ్వడం మేకర్స్‌తో పాటు ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ గా ఒక షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ లీక్ వెనుక ఉన్న ప్రధాన నిందితులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇది ఎక్కడో బయట జరిగింది కాదు, సాక్షాత్తూ ఎడిటింగ్ స్టూడియోలోనే జరిగిన దొంగతనం అని తేలడం ఇప్పుడు సంచలనంగా మారింది.

విచారణలో తేలిన వివరాల ప్రకారం, ఈ లీక్ వెనుక ఒక ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు వేరే ఒక సినిమా ప్రాజెక్టులో పనిచేస్తూ, ఆ సాకుతో 'జననాయగన్' ఎడిటింగ్ జరుగుతున్న స్టూడియోలోకి అక్రమంగా ప్రవేశించాడు. అక్కడి సెక్యూరిటీ కళ్లను కప్పి డిజిటల్ రీల్స్‌ను దొంగిలించి, వాటిని పూర్తి స్థాయి మూవీ ఫైల్‌గా మార్చేశాడు. అనంతరం ఆ డేటాను మరో ఇద్దరికి చేరవేయడంతో అది కాస్తా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది.

ఈ స్కెచ్ అంతా చాలా పక్కాగా జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుల ఆచూకీని కనిపెట్టారు. ఈ దొంగతనానికి పాల్పడిన ఎడిటర్‌తో పాటు డేటాను సర్క్యులేట్ చేసిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం ముగ్గురు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వీరు కేవలం ఆన్‌లైన్‌లో షేర్ చేయడమే కాకుండా, పెన్ డ్రైవ్‌ల ద్వారా కూడా డేటాను బదిలీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఈ వివాదానికి ఒక కొలిక్కి వచ్చినట్లైంది.

విజయ్ వంటి పెద్ద హీరో సినిమా అది కూడా కెరీర్‌లో చివరి చిత్రం కావడంతో ఈ లీక్ ఇష్యూ బాక్సాఫీస్‌పై ప్రభావం చూపుతుందనే భయం నిర్మాతల్లో ఉంది. దీనివల్ల వందల కోట్ల బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే మద్రాస్ హైకోర్టు కూడా జోక్యం చేసుకుని ఈ సినిమా లీక్డ్ కంటెంట్‌ను ప్రసారం చేయకూడదని కేబుల్ ఆపరేటర్లకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు కూడా అప్రమత్తమై దాదాపు 300కు పైగా పైరసీ లింకులను తొలగించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’కి రీమేక్. విజయ్ తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టే ముందు చేస్తున్న సినిమా కావడంతో దీనిపై కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో పైరసీ దొంగలు దొరకడం చిత్ర బృందానికి పెద్ద ఊరటనిచ్చింది. ఈ ఘటన తర్వాత స్టూడియోల్లో సెక్యూరిటీ ప్రమాణాలపై మళ్లీ చర్చ మొదలైంది.

ఇకపై పెద్ద సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో మేకర్స్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ దర్యాప్తుతో విజయ్ అభిమానులు కాస్త శాంతించారు. పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలోనే సినిమా చూడాలని సూర్య వంటి స్టార్ హీరోలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలోనే సెన్సార్ పనులు ముగించుకుని సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి లీక్ దొంగలు దొరికిపోయారు కాబట్టి ఇకపై ‘జననాయగన్’ హవా థియేటర్లలో ఎలా ఉంటుందో చూడాలి.