స్టార్ హీరోల భారీ ఈవెంట్లకు అనుమతి లేదా?
దళపతి విజయ్ నటిస్తున్న చిట్ట చివరి సినిమా `జననాయగన్` సంక్రాంతి 2026 బరిలో దిగనుంది.
By: Sivaji Kontham | 22 Nov 2025 4:00 PM ISTదళపతి విజయ్ నటిస్తున్న చిట్ట చివరి సినిమా `జననాయగన్` సంక్రాంతి 2026 బరిలో దిగనుంది. ఆ మేరకు నిర్మాతల నుంచి అధికారికంగా తేదీ ఖరారైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ వెన్యూ ఫైనల్ అయింది. అయితే అందరూ ఊహిస్తున్నట్టు ఇది ఏ చెన్నై లేదా మధురైలో జరుగుతున్న ఈవెంట్ కానేకాదు. దీనిని ఏకంగా దేశం దాటించారు. మలేషియాలో ఈ ఆడియో వేడుకను నిర్వహించనున్నట్టు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే విజయ్ కి ఈ పరిస్థితి రావడానికి కారణం గత పొలిటికల్ ఈవెంట్లో జరిగిన తొక్కిసలాట. దాని ఫలితంగా పదుల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు మరణించడమే దీనికి కారణం. ఇలాంటి ప్రమాదాలు రిపీట్ కాకుండా తమిళనాడు ప్రభుత్వం దళపతి విజయ్ ఈవెంట్ లను ఇక్కడ స్థానికంగా నిర్వహించడానికి అభ్యంతరాలు చెబుతోంది. ఓవైపు జననాయగన్ సినిమాతో తన సినీకెరీర్ ని విడిచిపెట్టి పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమవ్వడానికి, తన టీవీకే (తమిళగ వెట్రి కజగం) పార్టీని బలోపేతం చేయడానికి విజయ్ పూనుకోనున్నాడు. అందుకే హెచ్.వినోద్ తెరకెక్కిస్తున్న జననాయగన్ రిలీజ్ ఎంతో ఎమోషన్ తో ముడిపడినది. ఈ వేదికపై విజయ్ పొలిటికల్ స్టంట్ పెద్ద ఎత్తున ఆవిష్కృతం కానుంది.
ఈ ఏడాది డిసెంబర్ 27న మలేషియాలో ఆడియో విడుదల జరుగుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించగానే ఆ దేశంలో ఉన్న విజయ్ అభిమానులు ఎంతో ఎమోషనల్ అయ్యారు. చాలా మంది కన్నీటి పర్యంతం అయ్యారు. దాదాపు మూడేళ్ల తర్వాత మరోసారి ఆడియో ఈవెంట్ పేరుతో విజయ్ మలేషియాలో అడుగుపెడుతుండడం అక్కడి ఫ్యాన్స్ ని కన్నీళ్లు పెట్టించింది. దీనికి తోడు అతడి జీవితంలో చిట్టచివరి ఆడియో చిట్ట చివరి సినిమా కూడా ఇదే కావడంతో ఎమోషన్ పీక్స్ కి చేరుకుంది. మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్ స్టేడియంలో అధికారికంగా జరగనుంది.
#OneLastDance - జననాయగన్ ఆడియో లాంచ్ ఈవెంట్ అంటూ ఈపాటికే తమిళనాడు, మలేషియాలో సందడి పరాకాష్టకు చేరుకుంది.. అయితే ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. భారతదేశంలో మరో హీరోకి మలేషియాలో ఈ రేంజు ఫాలోయింగ్ లేనేలేదని నిరూపించడానికి, అలాగే విదేశీ గడ్డపైనా అసాధారణ హీరోగా విజయ్ ని ఎలివేట్ చేయడానికి మలేషియా ఈవెంట్ వేదిక కానుంది.
ఇక అధికార పక్షం నాయకులు విజయ్ ప్రతి యాక్టివిటీని అణచి వేసేందుకు కుయుక్తులు పన్నుతున్నందున, జననాయగన్ ఆడియోకి అనుమతి లభించడం అంత సులువు కాదు. అక్కడ అధికారులను బతిమాలుకోవడం కూడా విజయ్ బృందానికి ఆసక్తి లేదు. పైగా ఈవెంట్లో మునుపటి తొక్కిసలాట మరోసారి రిపీటైతే అది రాజకీయంగా మరింత పెద్ద సమస్యకు దారి తీయవచ్చని కూడా విజయ్ టీమ్ భావించినట్టు తెలిసింది.
ఇక మలేషియాలో ఆడియో లంచ్ పై అంచనాను పెంచడానికి మేకర్స్ అందంగా రూపొందించిన వీడియో మాంటేజ్‌ను ఆవిష్కరించారు. ఇది ఫ్యాన్స్ లోకి వేగంగా దూసుకెళ్లింది. మాంటేజ్ విజయ్ పాపులర్ మూవీస్ నుంచి అతడి లుక్స్ అన్నిటినీ రివీల్ చేస్తుంది. ఖుషి, గిల్లి, సచ్చీన్, పోకిరి, వెట్టైకరన్, తుప్పాకి, థెరి, మెర్సల్, బిగిల్, మాస్టర్, లియో వరకు ప్రతి సినిమా నుంచి విజయ్ లుక్స్ ని రివీల్ చేస్తూ సాగిన మాంటేజ్ ఫ్యాన్స్ లో ఉత్కంఠను పెంచింది. ఈ వీడియోలో మలేషియా అభిమానులు విజయ్ తమకు ఎంత ఇష్టమో వ్యక్తిగత స్టోరీలు చెప్పడం కూడా ఆకట్టుకుంది. ఇక ఆడియో వేడుకలో దళపతి అభిమానుల ఎమోషన్ దృష్ట్యా, వారంతా వంద బకెట్ల కన్నీరు కార్చినా ఆశ్చర్యపోనవసరం లేదని ఇప్పటికే అంతా భావిస్తున్నారు.
ఒక ఫ్యాన్ తాను చిన్నప్పటి నుంచి విజయ్‌ని ఎంతగా ప్రేమిస్తాడో గుర్తుచేసుకున్నాడు - అన్నను ఎవరు ఇష్టపడరు? అని అన్నాడు. మరొకరు ఆయనను జీవితాంతం స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని అభివర్ణించారు. ఒక యువతి తనకు కుటుంబం లేదని, విజయ్‌ను తన సోదరుడిగా భావిస్తానని వెల్లడించింది. తన కష్ట సమయాల్లో బయటపడటానికి సహాయం చేసిన దళపతి మాటలను ప్రశంసించింది.
`జన నాయగన్`లో విజయ్ తో పాటు బాబీ డియోల్, పూజా హెగ్డే, మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మించారు. ఈ చిత్రం 9 జనవరి 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జన నాయగన్ దళపతి విజయ్ సినీప్రయాణంలో చివరి అధ్యాయం కానుంది. అందుకే ఆడియో ఈవెంట్ చాలా భావోద్వేగాలకు వేదిక కానుంది.
