సూపర్‌స్టార్ మూవీ ఈవెంట్‌తో 25% బడ్జెట్ రికవరీ..?
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'జన నాయగన్'. ఈ సినిమా విజయ్‌కి చివరి సినిమా అనే విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 26 Nov 2025 12:48 PM ISTతమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'జన నాయగన్'. ఈ సినిమా విజయ్‌కి చివరి సినిమా అనే విషయం తెల్సిందే. ఇప్పటికే విజయ్ తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెట్టాడు. వచ్చే ఏడాది జరగబోతున్న తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా విజయ్ పాత్ర పోషించాలని ఆశ పడుతున్నాడు. అందుకు తగ్గట్లుగానే రాజకీయ పావులు కదుపుతున్నాడు. వచ్చే ఏడాది తన రాజకీయానికి ఉపయోగపడే విధంగా 2026 జనవరిలో జన నాయగన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ప్లాన్ చేస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వెంకట్ కె.నారాయణ, జగదీష్ పళనిసామి, లోహిత్ ఎన్‌కె నిర్మిస్తున్నారు. మొదటి నుంచి ఈ సినిమా భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
విజయ్ జన నాయగన్ సినిమాతో...
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా మెయిన్ లైన్‌ను తీసుకుని, మొత్తం తమిళ నేటివిటీకి అనుగుణంగా మార్చడం ద్వారా జన నాయగన్ ఒక కొత్త మూవీ అనే ఫీల్ కలుగుతుందని కొందరు అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే నిర్మాతలు ఈ సినిమాను ఏకంగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లు సమాచారం అందుతోంది. విజయ్ కి పారితోషికంగా రూ.200 కోట్లు ఇవ్వగా మిగిలిన మొత్తంలో రూ.50 కోట్ల ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల పారితోషికాలు ఇవ్వడం జరిగిందట. మిగిలిన మొత్తంతో ప్రొడక్షన్ చేశారని తెలుస్తోంది. జన నాగయన్ సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేయడం కన్ఫర్మ్. సినిమా ఇప్పటికే చాలా ఏరియాల్లో అత్యధిక మొత్తాలకు అమ్ముడు పోయిందని సమాచారం అందుతోంది.
భగవంత్ కేసరి సినిమాకు రీమేక్...
ఈ సినిమాకు నిర్మాతలు భారీ స్థాయిలో లాభాలు దక్కించుకునే విధంగా పబ్లిసిటీ, బిజినెస్ ప్లాన్స్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరుపబోతున్నారు. మలేషియాలో ఆడియో విడుదల కార్యక్రమంకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. స్థానికంగా ఉన్న ఒక పెద్ద స్టేడియంలో సినిమా యొక్క ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆ కార్యక్రమంలో విజయ్ పాల్గొనబోతున్నారు. అంతే కాకుండా అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ కాన్సర్ట్ అన్నట్లుగా ఒక భారీ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ ఆడియో విడుదల కార్యక్రమంకు ప్రేక్షకులను ఫ్రీగా రానివ్వడం లేదు. పెద్ద ఎత్తున టికెట్ రేట్లను నిర్వహించడం జరిగిందని తెలుస్తోంది.
మలేషియాలో ఆడియో విడుదల కార్యక్రమం...
ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ తమిళ మీడియా సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంకు మూడు రకాల టికెట్లను ఇవ్వబోతున్నారు. మూడు రకాల టికెట్ల రేట్లను స్థానిక కరెన్సీలో ఇప్పటికే ఖరారు చేయడం జరిగిందట. అతి త్వరలోనే బుకింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ విజయ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా విజయ్ మొదటి సారి ఒక ఈవెంట్‌కి వస్తున్న కారణంగా స్థానికులు పెద్ద ఎత్తున ఈవెంట్‌కి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే స్టేడియం కెపాసిటీకి తగ్గట్లుగా 80 వేల నుంచి 85 వేల మంది హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈవెంట్‌లో బ్రాండింగ్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆధాయం దక్కించుకోబోతున్నారు. తద్వారా జన నాయగన్ బడ్జెట్ లో దాదాపుగా 25 శాతం అంటే రూ.100 కోట్లను ఆడియో ఈవెంట్ ద్వారా సాధించే అవకాశాలు ఉన్నాయని తమిళ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఈవెంట్స్‌కి టికెట్లను పెట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ఈవెంట్ కనుక హిట్ అయ్యి, నిర్మాతకు లాభాలు వస్తే ముందు ముందు సౌత్ హీరోలు అందరూ అదే దారిలో పయనించే అవకాశాలు లేక పోలేదు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో కచ్చితంగా ఇలాంటి కొత్త ఆదాయ మార్గాలు అవసరం అనేది పలువురి అభిప్రాయం.
